గురజాడ నడయాడిన నేల పై జన్మించడం పూర్వ జన్మ సుకృతమని , అటువంటి మహనీయుని గృహం నందు వారు వినియోగించిన వస్తువులను తాకడం అదృష్టమని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు పెర్కొన్నారు. మహాకవి గురజాడ 161 వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
గురజాడ స్వగృహం నందు వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రకాశనం గావించి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, గురజాడ కుటుంభ సభ్యులు ప్రసాద్, ఇందిర, గురజాడ అభిమానులు పెద్ద సంఖ్య లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు .
అనంతరం గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయి గేయాన్ని ఆలపిస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్ధులతో గురజాడ జంక్షన్ వరకు గురజాడ వినియోగించిన వస్తువులతో ర్యాలీ గా సాగి గురజాడ విగ్రహానికి పూల మలాలంకరణ గావించారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ గురజాడ వారు చెప్పిన సొంత లాభం కొంత మానుకొని పొరుగువానికి సాయపడవోయి అనే మాటలను ప్రభుత్వం స్వీకరించి అభివృద్ధి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. తన రచనల ద్వారా దేశ భక్తిని పెంపొందించాలని 161 ఏళ్ల క్రితమే జాతికి దిశా నిర్దేశం చేసిన వ్యక్తి గురజాడ అని, ఇటీవల దేశ ప్రధాని మోడీ నోట గురజాడ మాటలు వినిపించాయని గుర్తు చేసారు.
అనేక మంది సందర్శకులు లైబ్రరీ కి వస్తున్న దృష్ట్యా వారి సౌకర్యార్ధం లైబ్రరీ లో మౌలిక వసతుల కల్పనకు జిల్లా పరిషత్ నుండి నిధులను సమకూర్చనున్నట్లు చైర్మన్ తెలిపారు. అందుకోసం ఒక కమిటీ ని ఏర్పాటు చేసి, ఏమేమి అవసరం అవుతాయో నివేదిక తయారు చేయాలని కలెక్టర్ కు కోరారు.
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ గురజాడ చిర స్మరనీయులని, వారి రచనలు ఎన్ని తరాలకైనా అనుసరనీయమని, ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. గురజాడ గృహాన్ని ఇటీవలే పెయింటింగ్స్ వేయించి కొంత మేరకు అభివృద్ధి చేయడం జరిగిందని, అందుకు అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు.
గురజాడ గృహం లో గురజాడ వినియోగించిన వస్తువులను , గురజాడ స్టాంప్ ను చేతి రాతలను, కళ్ళద్దాలను, గురజాడ సేకరించిన పుస్తకాలను , ఎక్సిబిషన్ రూమ్ లో గురజాడ సమకాలీన కవులు, మేధావుల చిత్ర పటాలను చైర్మన్, కలెక్టర్ సందర్శించి, విజిటర్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసి గురజాడ గృహాన్ని సందర్శించినందుకు గర్వంగా ఉందని రాసారు.
గోల్డెన్ హెరిటేజ్ అఫ్ విజయనగరం వారి వితరణతో గురజాడ గృహం లో సందర్శకుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన ఆర్.ఓ ప్లాంట్ ను కూడా చైర్మన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్ , మున్సిపల్ కమీషనర్ శ్రీరాములు నాయుడు, జిల్లా పర్యాటక అధికారి లక్ష్మి నారాయణ, , డి ఐ పి.ఆర్ ఓ దున్నా రమేష్ , తహసిల్దార్ కోరాడ శ్రీనివాస రావు, గురజాడ సమాఖ్య ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, సూర్య లక్ష్మి, గోపాల రావు, కృష్ణాజి సంగీత కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్ధులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.