40.2 C
Hyderabad
May 5, 2024 16: 38 PM
Slider క్రీడలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ క్రీడాకారులతో మంత్రి ఆర్కే రోజా ముఖాముఖి

#ministerroja

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రాష్ట్ర పర్యాటక, క్రీడలు సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖాముఖి నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వీరతిలకం దిద్దినాము – విజయులై తిరిగిరండి’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని  ప్రతిఒక్కరినీ ఆశీర్వదించారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రం నుంచి 19 విభాగాల్లో 160 మంది క్రీడాకారులు హర్యానాలో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ఎంపికకావడం గర్వకారణమని, ఏపీ క్రీడాచరిత్రలో శుభదినమని అన్నారు. వేదికపై త్యంగ్-ట, టేబుల్ టెన్నిస్ ఆటలను మంత్రి రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. బ్రెజిల్ లో నిర్వహించిన 2021 డెఫ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన షేక్ జఫ్రీన్ ను మంత్రి, శాప్ ఛైర్మన్ లు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

మూడవ జాతీయస్థాయి దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ – 2022 పోస్టర్ ను మంత్రి రిలీజ్ చేశారు. అనంతరం క్రీడాకారుల డెమోలను ప్రదర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన క్రీడాకారుల మల్లఖాంబ్ ఆట ప్రత్యేక ప్రదర్శనగా ఆకట్టుకుంది. ఖేలో ఆంధ్రా, జయహో ఆంధ్రా అని నినాదాలు మార్మోగాయి.

మంత్రి ఆర్.కె. రోజా మాట్లాడుతూ.. 4వ ఖేలో ఇండియాకు ఎంపికైన క్రీడాకారులందరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నా అన్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లు ఎవరూ బయటకు రాలేని పరిస్థితి ఉందని.. కానీ ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేని విధంగా 19 విభాగాల నుంచి 160 మంది ఎంపిక కావడం  ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకు ఇస్తున్న ప్రొత్సాహాన్ని తెలుపుతుందన్నారు.

ఎంపికైన వారిలో ఎక్కువగా అమ్మాయిలు ఉన్నారని.. మారుతున్న కాలంలో ప్రతి విషయంలో అబ్బాయిలకు దీటుగా అమ్మాయిలు ఎదుగుతున్నారన్నారు. ఆడపిల్లలకు ఆత్మరక్షణగా ‘జూడో’ ఉపయోగపడుతుందని మంత్రి రోజా అన్నారు. హర్యానాలో జరిగే 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కార్యక్రమానికి క్రీడాకారులందరికీ తోడుగా.. మేము కూడా వస్తామని, సర్ ప్రైజ్ గా వస్తామని మంత్రి తెలిపారు. 

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతను, క్రీడలను బలంగా ప్రొత్సహిస్తున్నారన్నారు.  శాప్ కు యువ ఛైర్మన్ ను నియమించారని, క్రీడలను, క్రీడాకారులను ప్రొత్సహించేలా ఛైర్మన్ తీసుకున్న చర్యలు అభింనదనీయమన్నారు. క్రీడలకు మంచి రోజులు వచ్చాయన్నారు. సమ్మర్ క్యాంప్స్ ప్రారంభించామని, దాదాపు 45 వేల మంది వరకూ శిక్షణ పొందుతున్నారన్నారు.

సాధన చేస్తే విజేతలుగా నిలుస్తారు

మెడల్ సాధించాలని ధ్యేయంగా పెట్టుకుని.. దానికి తగిన విధంగా కృషి చేస్తే తప్పకుండా విజేతలుగా నిలుస్తారని క్రీడాకారుల్లో ధైర్యాన్ని నింపారు. మరేతర రంగాల్లో లేనివిధంగా క్రీడాకారులకు దేశాన్ని రిప్రజెంట్ చేసే గొప్ప అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈసారి జరిగే ఖేలో ఇండియాలో రాష్ట్రానికి అత్యధిక మెడల్స్ వస్తాయని మంత్రి ఆకాంక్షించారు.

శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులందరూ ఖేలో ఇండియాలో మెడల్స్ కొడితే మాకు ఎంతో ఆనందమన్నారు. మీరంతా ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రానికి , దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా ఆకాంక్షించారు. ప్రతి క్రీడాకారుడికి గుర్తింపు పెరగాలనే లక్ష్యంతో సీఎం కప్, శాప్ లీగ్స్, సమ్మర్ క్యాంపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

గతంలో శాప్ కార్యాలయం కూడా ఎవరికీ తెలిసేది కాదని, ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలిసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రపంచంలో స్పోర్ట్స్ స్టార్ కి ఉన్నంత క్రేజ్ మరెవరికీ ఉండదన్నారు. అయితే శ్రమపడకుండా, ఏ ఒక్కరూ రాత్రికి రాత్రే ఎవరూ స్టార్ అయిపోరని గుర్తించాలని సూచించారు. డెఫ్ ఒలింపిక్స్ లో షేక్ జఫ్రీన్ పతకం సాధించడం వెనుక కష్టాన్ని అందరూ గుర్తించాలని, ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలోని క్రీడాకారులందరూ ‘మీ కష్టం మీరు చేయండి.. మీ భవిష్యత్తుకు మాది బాధ్యత’ అని అభయం ఇచ్చారు. ఖేలో ఇండియాలో సర్టిఫికేట్ తీసుకున్నవారికి తగిన న్యాయం చేసే విధంగా స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. శాప్ టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చామని, ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పవచ్చని ఛైర్మన్ తెలిపారు.

డెఫ్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత షేక్ జఫ్రీన్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి అనేక సవాళ్లను దాటుకుని అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని, మరిచిపోలేని అనుభూతి అన్నారు. త‌న తండ్రి నుంచి, కుటుంబం నుంచి ల‌భించిన ప్రోత్సాహం, మ‌ద్ద‌తు మాటల్లో చెప్పలేనిదని ఆమె తెలిపారు.    

హర్యానాలో జరిగే నాల్గవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2021లో అండర్-17 కేటగిరీ బాలురు, బాలికల విభాగంలో 160 మంది క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ నుండి 19 విభాగాల్లో ఎంపికయ్యారు. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో గట్కా, మల్లఖాంబ్, త్యంగ్-ట అనే మూడు కొత్త విభాగాలు నిర్వహించనున్నారు.

మొత్తం 24 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులు 19 విభాగాల్లో ఎంపికకావడం శాప్ చేస్తున్న కృషికి నిదర్శనం.  ఆర్చెరీ నుంచి ఆరుగురు, అథ్లెటిక్స్ ఐదుగురు, బ్యాడ్మింటన్ ఒకరు, బాక్సింగ్  12 మంది, సైక్లింగ్  ఇద్దరు, గట్కా 16 మంది, జిమ్నాస్టిక్స్ ఒకరు, హ్యాండ్ బాల్ 16 మంది, జూడో 9 మంది, కబడ్డీ 24 మంది (పురుషులు, స్త్రీలు), ఖో ఖో – 12 మంది, మల్లఖాంబ్ – 12 మంది, షూటింట్ ఇద్దరు, స్విమ్మింగ్ ఆరుగురు, టేబుల్ టెన్నిస్ ఇద్దరు, టెన్నిస్ ఒకరు, త్యంగ్-ట ఐదుగురు, వెయిట్ లిఫ్టింగ్ 22 మంది, రెజ్లింగ్ ఆరుగురు ఎంపికయ్యారు.

ప్రత్యేక ఆకర్షణగా భీమవరం విద్యార్థులు చేసిన మల్లఖాంబ్…

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యార్థులు చేసిన మల్లఖాంబ్, రోప్ స్కిప్పింగ్ లు చూపరులను కట్టిపడేశాయి. మల్లఖాంబ్ క్రీడ మధ్యప్రదేశ్ కి చెందిన క్రీడ అని, వీటిలో పోల్ మల్లఖాంబ్, రోప్ మల్లఖాంబ్ అని రెండు రకాలుంటాయని కోచ్ జీ.పీ.సీ. శేఖర్ రాజు తెలిపారు. కోచ్ శేఖర్ రాజుకి మంత్రి, శాప్ ఛైర్మన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మల్లఖాంబ్ వంటి క్రీడలకు ప్రోత్సాహానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్రీడల్లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తారన్నారు. మల్లఖాంబ్ క్రీడాకారులతో మంత్రి రోజా సెల్ఫీ తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో శాప్ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్. ప్రభాకర్ రెడ్డి, శాప్ బోర్డు మెంబర్స్, వివిధ క్రీడా అసోసియేషన్స్ సభ్యులు, కోచ్ లు, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

One Side Love: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు

Satyam NEWS

పిలిచి మంత్రి పదవి ఇస్తే అన్యాయం చేశారు

Satyam NEWS

Target Killer: అనంత్ నాగ్ జిల్లాలో లష్కరే ఉగ్రవాది హతం

Satyam NEWS

Leave a Comment