అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 లో ఆఖరు నిమిషంలో అపశృతి చోటు చేసుకుని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం అతిసమీపంలోకి వెళ్లి ఆ తర్వాత జాడ కనబడకుండా పోయిన విషయం తెలిసిందే. 14 రోజుల పాటు విక్రమ్ ల్యాండర్ గురించి పరిశోధన చేసినా ఫలితం లేకపోయింది.
ఈ దశలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తాము విక్రమ్ ల్యాండర్ ను వెతుకుతామని ముందుకు వచ్చింది. తాజాగా చంద్రుడిపై ఉన్న విక్రమ్ జాడను నాసా కనిపెట్టింది. దానికి సంబంధించిన ఫోటోని షేర్ చేసింది. విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 26న ఏ ప్రదేశంలో పడిందో గుర్తించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ శకలాలు గుర్తించి ఫోటోలు తీసి పంపించింది.
ల్యాండర్ కూలిపోయినట్లు దాని శకలాలు అక్కడ అక్కడ పడ్డట్టు నాసా తెలిపింది. విక్రమ్ శిథిలాలను భారతీయ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ గుర్తించినట్లు నాసా చెప్పింది. ఎల్ఆర్‌వో టీమ్‌తో షణ్ముగ తన డేటాను షేర్ చేశాడు. దీంతో నాసాకు చెందిన ఎల్ఆర్‌వో విక్రమ్ పడిన ప్రాంతాన్ని గుర్తించింది.
అక్టోబర్ 14, 15, నవంబర్ 11 తేదీల్లో తీసిన ఫోటోలను నాసా ఇమేజ్ సీక్వెన్స్ చేసింది. ఆ తర్వాత నవంబర్‌లో తీసిన ఫోటోలతో బెస్ట్ పిక్సెల్ క్లారిటీ వచ్చింది. దీంతో విక్రమ్‌ను గుర్తించినట్లు నాసా వెల్లడించింది. గతితప్పిన విక్రమ్ ల్యాండర్ వాయవ్య ప్రాంతానికి 750 మీటర్ల సమీపంలో విక్రమ్ శిథిలాలు కనిపించాయి.