29.7 C
Hyderabad
May 3, 2024 04: 40 AM
Slider సినిమా

చిరస్థాయిగా నిలిచే పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడు

#Kaikala Satyanarayana

ఈ ఏడాది తెలుగు చలనచిత్ర సీమకు ఎన్నో విషాదాలను తెచ్చిపెట్టింది. 2022 వెళుతూ వెళుతూ నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణను కూడా తీసుకువెళ్లింది. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు కైకాల సత్యనారాయణ. తెలుగు చలన చిత్ర రంగంలో వెండితెరపై విలనిజంలో కొత్తదనాన్ని తీసుకువచ్చిన గొప్ప నటుడు సత్యనారాయణ. కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్…. ఇలా ఏ పాత్రను ఇచ్చినా కూడా ఆయన పూర్తి న్యాయం చేశారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు.. ఇప్పటి తరం హీరోలతోనూ ఆయన ఎన్నో చిత్రాలలో పని చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.

ఈ తరం హీరులు మహేష్‌ బాబు, ప్రభాస్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ వంటి హీరోలతోనూ ఆయన నటించారు. చివరగా ఆయన మహర్షి సినిమాలో కనిపించారు. ఎన్నో సినిమాల్లో యమధర్మరాజుగా కనిపించిన సత్యనారాయణ ప్రేక్షకులను మెప్పించాడు. 60 సంవత్సరాల సినీజీవితంలో ఆయన 777 సినిమాల్లో నటించాడు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలలో చిరస్మరణీయమై పాత్రలు చేసిన అద్భుత నటుడు కైకాల. హాస్య, ప్రతినాయక, నాయక,

భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో సత్యనారాయణ ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో కైకాల సినీ రంగ ప్రవేశం చేశాడు. ముందు హీరోగా వచ్చినా తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు. తెలుగు చలన చిత్ర సీమలో నెంబర్ వన్ విలన్ గా ఎన్నో సంవత్సరాల పాటు ఆయన హవా కొనసాగింది.

ఎన్టీఆర్, బి విఠలాచార్య సినిమాల్లో కైకాల సత్యనారాయణకు ప్రత్యేక పాత్రలు ఉండేవి. నాలుగు దశాబ్దాల పాటు జానపద, చారిత్రక, పౌరాణిక చిత్రాలలో సత్యనారాయణ లేని చిత్రాలు బహు అరుదు. 777 సినిమాలలో నటించగా అందులో 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాలు ఉన్నాయి. ఆయన మొత్తం 200 మంది దర్శకులతో పనిచేశారు. సత్యనారాయణ నటించిన 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. మరో 59 సినిమాలు అర్ధ శత దినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడాయి.

87 సంవత్సరాల కైకాల సత్యనారాయణ కనుమరుగు కావడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఏడాది రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ కుంగిపోయి ఉంటే.. ఇప్పుడు ఇలా కైకాల మరణంతో మరింతగా విషాదంలోకి నెట్టినట్టు అయింది.

Related posts

ఎల్ నినో: వచ్చేది మంట పుట్టించే ఎండలు

Satyam NEWS

మహేష్ బాబు ఎంకరేజ్ మెంట్ వల్లే ‘మేజర్’

Satyam NEWS

తొలి కేసును చేధించిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు…!

Satyam NEWS

Leave a Comment