33.2 C
Hyderabad
May 15, 2024 20: 45 PM
Slider జాతీయం

జీవో నెంబర్ 145 ఎందుకు రద్దు చేశారో ప్రజలకు జవాబు చెప్పాలి.!

#Lakshmiswara Reddy

జి.వొ. నంబర్ 145 ను ఎందుకు రద్దు చేశారో ప్రజలకు జవాబు చెప్పాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రవేట్ లేఅవుట్లలో ఐదు శాతం స్థలాన్ని ఆర్థికంగా వెనకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) వారికి రిజర్వ్ చేయాలని 2021లో జారీ చేసిన జీవో నెంబర్ 145 ని ప్రభుత్వం రద్దు చేస్తూ ఇటీవల జీవో ఎంఎస్ నంబర్ 13 ఇచ్చిందని లక్ష్మీశ్వర రెడ్డి తెలిపారు.

అంటే ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వారికి ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదని భావిస్తుందా.? అని ఆయన ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చేయడానికి ఈ పని చేశామని ప్రభుత్వం చెప్తుందని, రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంటే, అది గాలి బుడగ లాంటిదని అది ఏ క్షణమైనా పేలిపోతుందని ఆయన పేర్కొన్నారు.ఒకవైపు భూమిలో పంటలు పండక ఉత్పత్తి తగ్గిపోతుంటే భూముల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అయన ప్రశ్నించారు.

పల్నాడు జిల్లాలో అనేక చోట్ల 15 నుండి 18 బస్తాలు కౌలు ఇచ్చేటటువంటి వరి పండే భూములు ఈనాడు రెండు మూడు బస్తాలు కౌలుకు తీసుకోమన్నా, ఎవరు ముందుకు రావడంలేదని, ఈ విధంగా భూములు పడవుపడి వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోతుంటే, భూములు రేట్లు ఎలా పెంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు ఈ ఖరీఫ్లో రెండు లక్షల ఎకరాల భూమి ఏ పైరు వేయకుండా పడావు పడితే, ప్రభుత్వం దాన్ని గురించి పట్టించుకోవడంలేదని, మరోవైపు వ్యవసాయ భూమిని ఏ నిబంధనలూ పాటించకుండా, అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తుంటే ప్రభుత్వం గుడ్లు అప్పగించి చూస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే పల్నాడు జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా లక్ష ఎకరాలు దాకా రియల్ ఎస్టేట్ వెంచర్ల వేశారని, ఇలా అడ్డగోలుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తుంటే విచారణ చేయాల్సిన ప్రభుత్వం, ఇంకా రియల్ ఎస్టేట్ వెంచర్లను ప్రోత్సహిస్తాం అనటం శొచనీయమని లక్ష్మీశ్వర రెడ్డి పేర్కొన్నారు.

రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇన్ని అవసరమా అనేది ప్రభుత్వం పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చిందని, అటువంటప్పుడు తక్కువ భూమిలోనే ఎక్కువ మందికి నివాసం కల్పించగల అవకాశం పెరిగిందని, అయినప్పటికీ వ్యవసాయ భూమిని అనవసరంగా ఎందుకు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసి బంగారం బిస్కెట్లుగా మారుస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

బంగారం బిస్కెట్లు తినటానికి తాగటానికి ఎందుకు పనికి రావని, కేవలం డబ్బు దాచుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారని, కానీ వ్యవసాయం చేసి ఉత్పత్తి పెంచడానికో లేక ఇల్లు కట్టుకొని నివాసం ఉండటానికో ఉపయోగించాల్సిన భూమిని, బంగారు బిస్కెట్లుగా మార్చి కేవలం డబ్బు దాచుకునే వస్తువుగా మారుస్తున్నారని ఇది చాలా దారుణం అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ప్రభుత్వం పలనాడు జిల్లా మొత్తాన్ని పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొచ్చిందని ఇది కేవలం ప్రజలపై పన్నుల భారాలు పెంచడానికేనని, ప్రజలకు దీని వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దాచేపల్లి, గురజాలను మున్సిపాలిటీలుగా మార్చినందువల్ల అక్కడ వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విధంగా పట్టణీకరణ పేరుతో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చటాన్ని తమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ఈ విషయంపై తమ సంఘం ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Related posts

జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సహాయం

Satyam NEWS

జాతీయ పండుగ

Satyam NEWS

అమాంతంగా పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

Leave a Comment