41.2 C
Hyderabad
May 4, 2024 18: 37 PM
Slider కవి ప్రపంచం

చేత పెన్నుంటే……

#ElisettiSureshkumar

పాత్రికేయుడంటే కరివేపాకు

పనికిరాని ఆరోవేలు..

అందరికీ అవసరమే సమాచారం

ఎవరికీ పట్టనిది ఆ వార్త         

రాసేవాడి గ్రహచారం..

ఆకలేస్తే అన్నం..

రోగమొస్తే వైద్యం ..

వినోదానికి సినిమా…

విహారానికి యాత్ర..

విలేఖరి మాత్రం ఎక్స్పయిరీ డేట్ అయిపోయిన

చేదు మాత్ర..

నీ పక్కన జరిగే అన్యాయం

నీకే పట్టదు..

దానిని వేలెత్తి చూపేదాకా

జర్నలిస్టుకు నిద్రే పట్టదు..

ఎక్కడ ఏం జరిగినా

అక్కడ సిద్ధం

బ్రతుకుతెరువు కోసం మాత్రం అనుదినం యుద్ధం..

కరోనా మహమ్మారి విలయతాండవం

చేస్తున్న వేళ

భయంకరంగా వినిపిస్తున్న మృత్యుదేవత ఊళ..

ఎక్కడి వారక్కడే

గమ్మున గూడుల్లో

జర్నలిస్టు మాత్రం..

అలసిపోయిన దేహంతో

సమాచార దాహంతో

విధి నిర్వహణా వ్యామోహంతో

రోడ్డుపైనే జీవితం

క్వారెంటైన్ కు అతీతం..

ఈ విపత్కర వేళ..

వైద్యునికి హారతులు..

పోలీసుకు జేజేలు..

పారిశుధ్య కార్మికుని పాదాలకు జలాభిషేకాలు..అవసరమే..

ప్రజల సొమ్ము ప్రజలకే పంచిపెట్టే పాలకులు

దానకర్ణులు..

కొందరు పాలకులు

ఇప్పటికీ మొద్దు నిద్ర

వీడని కుంభకర్ణులు..

జర్నలిస్టులు మాత్రం

నిద్రే ఎరుగని

అభినవ లక్ష్మణులు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి

అడ్డంగా దొరికిపోయిన బలిపశువులు..

అందరికీ లభిస్తున్నాయి భీమాలు..

విలేఖరులకు ఇక్కడా

పంగనామాలు..

యాజమాన్యాలు ఇచ్చే  జీతాలు ఎప్పుడూ ఎండమావులే..

నట్టింట్లో..బయటి ప్రపంచానికి తెలియని ఆకలి కేకలే..

డాక్టరు ఆస్పత్రిలో..

పోలీసు చెట్టునీడలో

ఓ చిన్న కునుకు

జర్నలిస్టు ఎక్కడ ఏం జరిగినా మళ్లీ ఎలా పరిగెత్తాలోనని

గుండె బితుకు బితుకు..

మరి ఇంత చేసే..సమాచారం ఎప్పటికప్పుడు నీకు చేరవేసే..

విలేఖరి..జర్నలిస్టు.. కెమెరామన్..వీళ్ళు కాదా మనుషులు..

చేత పెన్నున్నంత మాత్రాన పడకుండా ఉంటుందా

కరోనా కన్ను..

అందుకే ఇంత కష్టపడుతున్న జర్నలిస్టుకూ ఇవ్వరాదా

ఓ బీమా..

నడివీథిలో విధినిర్వహణలో చచ్చినా కుటుంబాన్ని వీధిన పడేయలేదన్న ఓ చిన్న ధీమా..

అన్నట్టు..ఇంత చేసే జర్నలిస్టు

అడిగేది ఓ గుర్తింపు కార్డు..

దాని పేరు అక్రెడిటేషన్

అదేమీ కాదు ఓ సెన్సేషన్

కనీసం ఇవ్వదు రేషన్..

జర్నలిస్టుకు అదో గుర్తింపు..

వాయిస్తూ కూర్చుంటారు

గాని ఫిడేల్..

విలేఖరికి ఇవ్వలేరు కదా

ఈ చిన్న మెడల్..

ఇది వివక్షో..కక్షో మరి!?

ఎలిశెట్టి సురేష్ కుమార్, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్

Related posts

కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం లేదు

Satyam NEWS

కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ కలకలం: ఏడుగురికి పాజిటివ్

Satyam NEWS

మస్క్ నాయకత్వంలో ట్విట్టర్ సురక్షితం కాదు

Bhavani

Leave a Comment