స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తో సహా పలువురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ తో సహా పార్టీ నాయకులు తనను వ్యక్తిగతంగా దూషిస్తూ తనకు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక నిర్వహించేందుకు తాను తీసుకుంటున్న చర్యలకు ముఖ్యమంత్రి తో సహా అందరూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ముఠా తగాదాలలో ఆరితేరిన వారు, కక్ష తో వ్యవహరించే వారు రాష్ట్రంలో ఉన్నందున తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు.
ఇప్పటికే తనకు ప్రాణహాని తలపెట్టేందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు తాను తన కుంటుంబం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో అనూహ్యంగా హింస జరిగిందని, ఏకపక్షంగా బెదిరింపులకు దిగారని తనకు పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు వచ్చాయని రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా తాను కొందరు అధికారులపై చర్యకు సిఫార్సు చేస్తే ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న కారణాన్ని చూపిస్తున్నారని ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో తన విధి నిర్వహణకు భంగం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని అందువల్ల తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించే బాధ్యతను కేంద్ర హోంశాఖ తీసుకోవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.