ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ కు ప్రాణహాని ఉన్నందున కేంద్ర భద్రతా బలగాలతో రక్షణ కల్పించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. అధికార వైసిపి పోలీసులు, ఎన్నికల అధికారులను ఉపయోగించుకుని అనేక చోట్ల ఎన్నికల అవకతవకలకు పాల్పడిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకూ ఎన్నడూ ఇంత హింస జరగలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలను చూస్తే రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అర్ధం అవుతుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృభిస్తున్నదని, ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా వేశారని ఆయన తెలిపారు.
ఎన్నికలు వాయిదా వేసిన అనంతరం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి స్పీకర్ తమ్మినేని శీతారాం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం ఎల్ ఏలు, ఎంపిలు మంత్రులు అత్యంత అభ్యంతరకరమైన రీతిలో ఎన్నికల కమిషనర్ ను దుర్భాషలాడారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
ఈ నాయకులు తమ కింది స్థాయి కార్యకర్తలు రెచ్చిపోయే విధంగా ప్రకటనలు చేసినందున ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై భౌతిక దాడులు జరిగే అవకాశం ఉందని కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఉన్నత స్థాయి భద్రత కల్పించకపోతే పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని అందువల్ల కేంద్ర బలగాలను ఆయనకు రక్షణగా ఏర్పాటు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ తన లేఖలో కోరారు.