రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మునిసిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుండగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మునిసిపాలిటీలో పూర్తిగా వెనుకబడి ఉంది. అక్కడ టీఆర్ఎస్ రెబెల్ నాయకులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున నామినేషన్లు వేసి పోటీ చేశారు. కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీరం హర్షవర్ధన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని సత్యం న్యూస్ ముందే వెల్లడించింది.
ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధుల విజయాన్ని కూడా సత్యం న్యూస్ ముందే వెల్లడించింది. మునిసిపల్ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్ధులకే టీఆర్ఎస్ అధిష్టానం ప్రాధాన్యతనిచ్చింది. అక్కడ అప్పటి వరకూ టీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచర వర్గానికి టీఆర్ఎస్ టిక్కెట్లు కూడా దక్కలేదు. ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న విషయం టీఆర్ఎస్ అధిష్టానానికి కూడా తెలుసు. దాంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పిలిచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ కు పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు.
సరిగా పని చేసుకోవాలని, టీఆర్ఎస్ గెలిచేలా చూడాలని మందలించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ నుంచి సత్యం న్యూస్ వార్త రాసింది. అయితే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మనుషులు కొల్లాపూర్ సత్యం న్యూస్ ప్రతినిధిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజావ్యతిరేకత ఉందని సత్యం న్యూస్ పెట్టిన పోస్టింగులు చూసి ఎమ్మెల్యే తన వైఖరిని సరిదిద్దుకుంటే కనీసం మునిసిపల్ ఎన్నికలలో పరువు అన్నా దక్కేది. అలా చేయకుండా అధికార దర్పంతో ఆయన ప్రవర్తించడంతో పూర్తి స్థాయి ప్రతికూల ఫలితాలు వచ్చాయి.