34.2 C
Hyderabad
May 13, 2024 16: 01 PM
Slider ముఖ్యంశాలు

నదీ జలాలపై శాస్త్రీయ పరిష్కారం అవసరం

#tammineni

నదీ జలాల సమస్యపై శాస్త్రీయ పరిష్కారం అవసరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆంధ్రా, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాల సమస్య ద్వారా కేంద్రం లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. కృష్ణా రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి కృష్ణా నదిపై ప్రాజెక్టులను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని పేర్కొన్నారు. ఆర్నెళ్లలో ప్రభుత్వం కూలుతుందని బీఆర్‌ఎస్‌ చేస్తున్న వ్యాఖ్యలను తమ్మినేని ఖండించారు. అస్వస్థత నుంచి బయటపడిన తర్వాత తొలిసారి బుధవారం ఖమ్మం వచ్చిన వీరభద్రానికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవనం వద్ద ఘనస్వాగతం పలికారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు విడిపోకూడదని సీపీఐ(ఎం) సిద్ధాంతం అన్నారు. కేంద్రం లిటికేషన్స్‌ సృష్టించి లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పుడు కేంద్రం అనేక హామీలు ఇచ్చిందన్నారు. కానీ ఆ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని తరలించే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య తగవులు పెడుతోందని ఆరోపించారు. దేశం మొత్తానికి ఒకే ఎన్నిక ఉండాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో భాగమే తప్ప మరొకటి కాదన్నారు.

ప్రతిపక్షాలను అణచివేసే ధోరణి

కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసే ధోరణి అవలంబిస్తోందన్నారు. కేరళలో కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం జరిగే ఆందోళనకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ మద్దతు ఇచ్చిందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక , మతతత్వ, అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ ఈనెల 16వ తేదీన నిర్వహించే గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరలు, కార్మికవర్గం అసంతృప్తి, మైనార్టీలను లేకుండా చేసే ధోరణిపై బీజేపీ దృష్టి సారించిందన్నారు. రామాలయం నిర్మాణంతో లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ఇప్పటికీ 9 సార్లు కూటమిలు మార్చిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ వైఖరీని దేశ ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. జాతీయంగా ఇండియా కూటమి మధ్య వైరుధ్యాలు తగ్గించి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని తిప్పికొడతామని ధీమా వ్యక్తం చేశారు.

అహంకార ధోరణితోనే బీఆర్‌ఎస్‌ ఓటమి…

బీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక, అహంకార ధోరణిని సీపీఐ(ఎం) నిరసించిందన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల్లో రెండిరటిని అమలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తమ పార్టీ స్వాగతించిందన్నారు. అప్రజాస్వామిక విధానాలకు ప్రజలు ఎలా గుణపాఠం చెబుతారో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కేసీఆర్‌ ఓటమి తప్ప కాంగ్రెస్‌ విజయం కాదన్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలుతుందనే బీఆర్‌ఎస్‌ శాపనార్థాలు సరికాదని తమ్మినేని అన్నారు. ధరణి భూ సమస్యలు, రైతులు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగాల కార్మికుల సమస్యలు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తమ్మినేని కోరారు.

పాలేరు పాతకాలువకు నీరివ్వాల్సిందే…

పాలేరు పాతకాలువ ఆయకట్టు పరిధిలో 14,500 ఎకరాలుండగా దానిలో 7వేల ఎకరాల్లో యాసంగి వరి, చెరకు తదితర పంటలు సాగయ్యాయని వీటికి నీరు ఇచ్చేలా ముగ్గురు మంత్రులు బాధ్యత తీసుకోవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాను ఆరోగ్యం ఎంత సీరియస్‌ కండీషన్‌కు వెళ్లిందో అంత త్వరగా కోలుకున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు.

అంతకుముందు తమ్మినేనికి సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జాతీయ నాయకులు ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, పొన్నం  వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం, బండి రమేష్‌, బుగ్గవీటి సరళ, వై.విక్రమ్‌, బొంతు రాంబాబు, కళ్యాణం వెంకటేశ్వరరావు, చింతలచెర్వు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

14.96 కోట్లు రుణాలు

Murali Krishna

నంద్యాల నుంచి RARS తరలింపు తక్షణమే ఆపేయాలి

Satyam NEWS

కరోనా ఎలర్ట్: ఇంటి నుండి బయటికి ఎవ్వరూ రాకండి

Satyam NEWS

Leave a Comment