29.7 C
Hyderabad
May 4, 2024 04: 28 AM
Slider సంపాదకీయం

డీజీపీ సునీన్ కుమార్ పై చర్య తీసుకోక తప్పదా?

#DGP Sunin Kumar

కొద్ది కాలం కిందటి వరకూ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో అత్యంత కీలక పాత్ర పోషించి డిజిపి గా ప్రమోషన్ పొందిన సీఐడీ విభాగం మాజీ చీఫ్ పి వి సునీల్ కుమార్ పై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఎదురయ్యిందా? సీఎం జగన్ కు అత్యంత విధేయుడుగా ఉన్న పి వి సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆయనను అక్కడ నుంచి తీసేసి సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు.

సీఐడీ చీఫ్ గా ఉన్న సమయంలో పి వి సునీల్ కుమార్ ఎంతో దూకుడుగా వ్యవహరించి సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థులపైన ఎన్నో కేసులు పెట్టారు. తనపై రాజకీయ కారణాలతో కేసు పెట్టి లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఐపిఎస్ అధికారిగా ఉన్న పి వి సునీల్ కుమార్ ఒక మతసంస్థను ఏర్పాటు చేసి దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆ తర్వాతి కాలంలో రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.

మార్గదర్శకాలు, ఉన్నతాధికారులకు ఉండే నిబంధనలు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్దంగా సునీల్ కుమార్ వ్యవహారిస్తున్నారని అమరావతి కి చెందిన హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కూడా ఫిర్యాదు చేశారు. వీరిద్దరే కాకుండా పీ వీ సునీల్ కుమార్ దురుసు ప్రవర్తన పై కూడా కేంద్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులే కాకుండా పీ వీ సునీల్ కుమార్ పై ఆయన భార్య కూడా ఫిర్యాదు చేశారు. ఆ కేసు కూడా తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నది. వీటన్నింటి నేపథ్యంలో సునీల్ కుమార్ పై తగిన చర్యలు తీసుకుని తమకు తెలియచేయాలని కేంద్ర హోం శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.

ఇప్పటి వరకూ నాలుగు సార్లు కేంద్రం నుంచి ఇదే తరహా లేఖలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. తాజాగా ఒక నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు వచ్చాయి. దాంతో ఇప్పుడు పీ వీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితిలోకి జగన్ ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు.

పీ వీ సునీల్ కుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇదే విధంగా కాలక్షేపం చేయడం ఇక కుదరకపోవచ్చునని న్యాయనిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత విధేయుడైన పీ వీ సునీల్ కుమార్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే చర్యలు తీసుకోని ఉన్నతాధికారులపై కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Related posts

నాణ్యమైన బోధన, నాణ్యమైన భోజనం

Murali Krishna

కరోనా వైరస్ భయంతో గ్రామాల మధ్య కంచె

Satyam NEWS

బాసర ఆర్జీయూకేటీ బీటెక్ అడ్మిషన్ నోటిఫికేషన్

Satyam NEWS

Leave a Comment