27.7 C
Hyderabad
May 4, 2024 09: 56 AM
Slider ప్రత్యేకం

పాముల పండుగ

#snakeday

పాము.. అనే పేరు వినగానే భయం ఆక్రమిస్తుంది. దుష్ట గుణాలు కలిగినవారిని,పగబట్టే స్వభావం ఉన్నవారిని పాముతో పోలుస్తుంటారు.మెరిసేవన్నీ బంగారం కానట్టే, కనిపించే ప్రతిపాము కాటెయ్యదు, ప్రతికాటుకూ మనిషి మరణించడు. పాముల అవసరం ప్రపంచానికి ఎంతో ఉంది.ఆ ప్రాముఖ్యతను తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి జూలై 16 వ తేదీ నాడు ‘ప్రపంచ పాముల దినోత్సవం’ జరుపుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది.

టెక్సస్ లాంటి కొన్ని చోట్ల కోళ్లఫారాల లాగా ‘పాముల ఫారాలు’ కూడా ఉన్నాయి. ‘పాముల పండగరోజు’ వందలాది మంది ఒకచోట గుమిగూడి సందడి చేసే సంప్రదాయం చాలా దేశాల్లో ఉంది.వారంతా పాముల గురించి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. దాదాపు 50ఏళ్ళ నుంచి ఈ తరహా వేడుకలు జరుగుతున్నాయి.

వేడుకలు, విలాసాలు, భయాలు, మూఢ నమ్మకాలు,అపోహలు, అనాచారాల సంగతి అలా ఉంచుదాం. పాములు అంతరించి పోకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. దానిని గౌరవించి పాటించాలి. పర్యావరణంలో సమతుల్యతను కాపాడుకోవడం కోసం పాముల ఉనికి చాలా అవసరం. పాములు ప్రధానంగా తినేది మాంసాహారమే.

పంట పొలాలను నాశనం చేసే ఎలుకలు,కీటకాలను పాములు ఎక్కువగా తింటూఉంటాయి. దీని వల్ల పంటకు రక్షణ,తద్వారా మనకు మేలు జరుగుతుంది. క్యాన్సర్,బ్రెయిన్,హార్ట్ ఎటాక్స్,పార్కిన్ సన్స్ వంటి వ్యాధులకు సంబంధించిన ఔషధాల తయారీలో కొన్ని జాతులకు చెందిన పాముల విషాన్ని వాడతారని సమాచారం.

ప్రధానంగా విషం విరుగుడుకు ఉపయోగిస్తారని సమాచారం (ముల్లును ముల్లుతో తీసినట్లు,వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు). పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు పాముల పరిరక్షణను పెద్ద ఉద్యమంగా మలచాలని నినదిస్తున్నారు.

కానీ సమాజం కదలడం లేదు. కనిపించే ప్రతి పామునూ కొట్టి చంపేయడం ఎంత తప్పో.. భయపడడం కూడా అంతే తప్పు.పాములలో కొన్ని వేల జాతులు ఉన్నాయి. అందులో సుమారు 20కుటుంబాలకు చెందినవే విషపూరితమైనవి. అందులో ప్రమాదకరమైనవి ఇంకా తక్కువ. సుమారు 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుంచి పాములు పరిణామం చెందాయని చెబుతారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా కొన్ని లక్షల మంది పాము కాటుకు గురవుతూ ఉంటారు. అందులో కొన్ని వేలమంది మరణిస్తూ ఉంటారు.ఈ మరణాలకు కారణం కూడా సరియైన చికిత్స అందకనే అని తెలుస్తోంది. ముందుగా ప్రాథమిక చికిత్స సక్రమంగా అందితే గండం తప్పుతుంది. అట్లే కొన్ని రకాల నాటు వైద్యాలు, అశాస్త్రీయమైన విధానాల వల్ల ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఏ జాతి పాము కరిచిందో గుర్తించడం, తదనుగుణంగా చికిత్స అందించడం కీలకం.

పాముల గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఒఫియాలజీ’ అంటారు. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసేవారి సంఖ్య దాదాపు శూన్యమైపోయింది. ఈ శాస్త్రంలో పరిశోధనల గురించి పట్టించుకునే నాధులే కరువైపోయారు. ప్రమాదకరమైన పాముల నుంచి,వాటి కాటు నుంచి రక్షణ పొందాలన్నా, పర్యావరణ పరిరక్షణకు, పంటపొలాల సంరక్షణకు ఉపయోగపడే వివిధ పాముల జాతుల మనుగడను కాపాడుకోవాలన్నా, ఏఏ జాతుల వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవాలన్నా ముందుగా ఆ శాస్త్రాన్ని కాపాడుకోవాలి.

అధ్యయనం,పరిశోధనలు పెరగాలి.దానికి తగిన స్థాయిలో నిధులను కేటాయించడంలో, మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వాలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి.ఇప్పటికే అనేక జీవరాశులు నశించిపోయాయి. దాని వల్ల ప్రకృతికి,పర్యావరణంకు జరిగిన నష్టం అంతాఇంతకాదు. ఇప్పటికైనా మేలుకోవాలి. అంటార్కిటికా వంటి కొన్ని ప్రాంతాల్లో తప్ప ప్రతి ఖండంలోనూ పాములు ఉన్నాయి. భారతదేశంలో సుమారు 250 జాతులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదకరమైన పాముల విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. మిగిలినవాటి గురించి భయపడాల్సిన అవసరమేలేదని గ్రహించాలి.సరే! పాములను ఆహారంగా తీసుకొనే దేశాలు కూడా ఉన్నాయి. అది వేరే సంగతి!

మిగిలిన దేశాలలో ఎలా ఉన్నప్పటికీ,మన పురాణాల్లో, భారతీయ సంస్కృతిలో పాములను పరమ పూజనీయంగా భావించి, పూజించే సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. ‘నాగారాధన’ సింధూ నాగరికత కాలం నుంచి ఉందని ఆధునిక చరిత్ర చెబుతున్నప్పటికీ, పురాణాల ప్రకారం చూస్తే వేల సంవత్సరాల గతం ఉంది. భూగర్భంలో జీవించే వేల జాతులను సంరక్షించుకోవడం మానవజాతి కర్తవ్యం. నాగజాతితో తెలుగువారు పెనవేసుకున్న బంధం చాలా గొప్పది. మన పేర్లు,ఊర్లు, నాగులచవితి వంటి పండుగలే కాక, మన లిపికి – పాముల రూపాలకు పోలికలు ఉన్నాయని భాషాశాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. పాములపై అవగాహన పెంచుకొనే దిశగా ముందుకు సాగుదాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

మేల్ యానిమల్స్: అత్యంత కిరాతకంగా బాలిక హత్య

Satyam NEWS

ప్రూవ్డ్ కరెక్ట్: విశాఖ తరలివెళ్లడంపై సత్యం న్యూస్ చెప్పిందే జరిగింది

Satyam NEWS

ప్రజలకు సత్వర సేవలు అందించడంలో బ్లూ కోట్స్ విధులు కీలకం

Satyam NEWS

Leave a Comment