భారత గణిత శాస్త్ర పితామహుడుగా పేరుగాంచిన శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జరుపుకునే గణిత దినోత్సవాన్ని సోమశిల ప్రాథమికోన్నత పాఠశాలలో వేడుకగా నిర్వహించారు. తరగతి గోడపై గీసిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఉపాధ్యాయుడు బృంగి కృష్ణప్రసాద్ ఆయన గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు.
శ్రీనివాస రామానుజన్ చిన్ననాటి నుండే తరగతి గదిలో ఉపాధ్యాయులను లోతైన విశ్లేషణతో సందేహాలు అడిగే వాడని ఆయన అన్నారు. జ్ఞానాన్ని సముపార్జించే చురుకైన విద్యార్థి గా శ్రీనివాస రామానుజన్ ఉండేవారని కృష్ణప్రసాద్ అన్నారు. నేటి తరం విద్యార్థులు కూడా ఆ చురుకుతనాన్ని అలవర్చుకొని ఎప్పటి సందేహాలను అప్పుడు నివృత్తి చేసుకునే విధంగా ఉండాలన్నారు.
గురువుల పట్ల భక్తి భావం, సమాజం పట్ల సహృద్భావం, చదువుల పట్ల సద్భావం ఏర్పరచుకోవలన్నారు. శ్రీనివాస రామనుజన్ తెలివైన తత్వం, చదువుకోవాలనే సంకల్పాన్ని చూసిన ఆయన టీచర్ హార్డీ బాధ్యత తీసుకున్నారని తెలిపారు. నేటి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, సంకల్పం, కష్టించేతత్వం ఉంటే సహకరించడానికి చాలా సంస్థలు, వ్యక్తులు ఉన్నారని కృష్ణప్రసాద్ విద్యార్థులకు తెలిపారు.
సెలవు దినమైన కూడా పాఠశాల కు ఇష్టంగా వచ్చి వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం లో గ్రామం లోని పూర్వ విద్యార్థులు కూడా పాల్గొన్నారు.