34.2 C
Hyderabad
May 11, 2024 20: 20 PM
Slider ఖమ్మం

గృహలక్ష్మికి మూడు రోజులు మాత్రమే… మద్యం దుకాణాలకు ఇరవై రోజుల గడువా..?

#ponguleti

గృహలక్ష్మి పథక దరఖాస్తుకు కేవలం మూడు రోజులు మాత్రమే గడువిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు ఇరవై రోజులు గడువు ఇచ్చిందని ఇదేం పద్ధతంటూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. గృహలక్ష్మి పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి… నియమ నిబంధనలు ఏంటి అని వివరించే నాథుడే లేడని విమర్శించారు. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామంలో ఆ ప్రాంత ముఖ్య నాయకుడు హరినాథబాబు ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత వెంకటగిరి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆ గ్రామవాసులు పొంగులేటికి భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. కోలాట నృత్యాల నడుమ క్రేన్ తో భారీ గజమాలను వేసి పొంగులేటిని సత్కరించారు. ఆయన రాక తమకెంతో సంతోషమని ఆ ప్రాంత వాసులు పేర్కొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని వచ్చిన వెంటనే రూ.5లక్షలతో ఇళ్లు లేని ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. వంటగ్యాస్ రూ.500కే ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలో విద్యార్థులకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయిస్తామన్నారు.

రైతన్నలకు రుణమాఫీ బీఆర్ఎస్ చేసినా చేయకపోయినా రాబోయే తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. వృద్ధులకు కూడా ఆసరా కింద నాలుగు వేల రూపాయాలను అందిస్తామని పేర్కొన్నారు. మాయల పకీరు మాటలకు కాలం చెల్లే రోజులు వచ్చాయన్నారు. భద్రాచల రామున్నే మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రామసహాయం మాధవి రెడ్డి, రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, రాం రెడ్డి చరణ్ రెడ్డి, ఐ ఎన్ టీ యూ సీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, బెల్లం శ్రీను, కళ్లెం వెంకట రెడ్డి, వెంకట నారాయణ తదితరులు ఉన్నారు.

Related posts

అదనపు కలెక్టర్ గా వచ్చి… ఆయనే కలెక్టర్ గా మారి…

Satyam NEWS

దక్షిణ భారత దేశానికి మండస్ తుపాను ప్రమాదం

Satyam NEWS

శిథిలావస్థకు చేరుకుంటున్న మోడల్ కాలనీ ఇండ్లు

Satyam NEWS

Leave a Comment