29.7 C
Hyderabad
May 4, 2024 05: 54 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి అభిషేక సేవతో పులకించిన హైదరాబాద్ భక్తజనం

#srivenkateswara

హైదరాబాద్‌లో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీవారికి  అభిషేక సేవ నిర్వహించారు. స్వామి వారికి జరిగిన అభిషేక సేవను దర్శించిన భక్తులు పులకించిపోయారు. శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు అభిషేకం నిర్వహించారు.

అభిషేకం ప్రాశస్యం 

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం చేస్తారు. భగవద్రామానుజుల వారు శ్రీస్వామివారి వక్షఃస్థలంలో ”బంగారు అలమేలుమంగ” ప్రతిమను అలంకరించిన శుక్రవారం నాటితో మొదలుపెట్టి ప్రతి శుక్రవారం అభిషేకం జరిగేలా ఏర్పాటుచేశారట. పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్రజలాలతో సుమారు గంట పాటు అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న మహాలక్ష్మికి కూడా అభిషేకం చేస్తారు.

శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షఃస్థల లక్ష్మితో కలిసి ఈ శుక్రవారాభిషేక సమయంలో మాత్రమే దర్శించేందుకు వీలవుతుంది. స్వామి వారి భక్తులు జీవితంలో ఒక్కసారైనా అభిషేకం చూసి తరించాలనుకుంటారు. ఇలాంటి భక్తుల కోరిక తీరుస్తూ హైదరాబాదులో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం భక్తులందరిపై తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేక దర్శనం ముగిసింది. అనంతరం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిజపాదదర్శనం కల్పించారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు అర్చన, రెండో నివేదన, శాత్తుమొర చేపట్టారు. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7.30 గంటల వరకు  భక్తులకు సర్వదర్శనం కల్పించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులందరికీ శ్రీ వేంకటేశ సుప్రభాతం, గోవిందనామాలను పుస్తక ప్రసాదంగా అందజేశారు. గ్యాలరీల్లోని భక్తులు గోవిందనామాలు పఠిస్తూ స్వామివారి సేవలను దర్శించారు.

Related posts

ఒంగోలులో శాశ్వత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు మంత్రి హామీ

Satyam NEWS

కరోనా హెల్ప్: టీవీ, సినీ కళాకారులు అధైర్యపడొద్దు

Satyam NEWS

కడప జిల్లాలో శ్రమదానంతో జనసేన రోడ్ల మరమ్మతులు

Satyam NEWS

Leave a Comment