34.7 C
Hyderabad
May 4, 2024 23: 57 PM
Slider సంపాదకీయం

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడానికి కారణం ఏమిటీ?

#kcr

నేలవిడిచి సాము చేయడం అనేది ఒక సామెత. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఎందుకో ఈ సారి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వాస్తవానికి దూరంగా జరిగి ఆలోచన ఎందుకు చేస్తున్నారో కూడా అంతుచిక్కడం లేదు. ఇప్పటి వరకూ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన ఏ ప్రాంతీయ పార్టీ నేత కూడా తనకు ఉనికి కల్పించిన పార్టీ పేరు మార్చుకోలేదు. వారి వారి పార్టీల పేరుతోనే జాతీయ రాజకీయాల్లో ఫ్రంట్ లు కట్టేందుకు ప్రయత్నించారు.

కొందరు సక్సెస్ అయ్యారు. మరి కొందరు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ప్రాంతీయ పార్టీలు ఒక చోటకు వచ్చి ఫ్రంట్ కట్టడమే ఇంతకాలం చూశాం. కేసీఆర్ ఇప్పుడు కొత్త సినిమా చూపించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ను సాకారం చేయించి, తనకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ని ఆయన కాదనుకుంటున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాస్తు, జాతకాల పిచ్చి ఎక్కువ. ఆయన ఏం చేసినా జాతకాల ప్రకారమే చేస్తారు. ఎంతో పటిష్టంగా ఉన్న రాష్ట్ర సచీవాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టించడం కూడా జాతకాలు లేదా వాస్తు కోసమే జరిగిందని అంటారు. అలాగే ప్రగతిభవన్ నిర్మాణం నుంచి అన్నీ ఆయన అలానే చేస్తారు. చివరకు టీఆర్ఎస్ పేరును మార్చడం కూడా జాతక రీత్యానే చేసి ఉంటారనేది కొందరి వాదన.

జాతీయ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తే తప్ప తన మనుగడ సాధ్యం కాదని ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. అందుకే జాతీయ రాజకీయాల పేరుతో టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చేస్తున్నారు. గత అసెంబ్లీ సమయంలో జాతకం రిత్యా ఆయన ముందస్తు ఎన్నికలకు వచ్చేశారు. జాతకం, వాస్తు ప్రకారం కేసీఆర్ చేసిన అన్ని ప్రయోగాలూ ఇప్పటి వరకూ ఫలించాయి.

మరి ఈ పార్టీ పేరు మార్పు నిర్ణయం ఏ విధంగా ఆయనకు ఉపకరిస్తుందో కాలమే నిర్ణయించాలి. రాజకీయంగా చూస్తే మాత్రం ఆయన ఈ నిర్ణయంతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల కేసీఆర్ నిర్ణయాలకు అంతగా వ్యతిరేకత వచ్చినట్లు కనిపించదు. అదే విధంగా కేసీఆర్ మనోభావాలకు అనుగుణంగానే వార్తలు ప్రసారం చేసే మీడియా హౌస్ లు ఉండటం వల్ల కూడా వ్యతిరేక వాదనలు బయటకు రావు.

అందువల్ల కేసీఆర్ ఏం చేసినా ఎండుగడ్డి మంటలా వచ్చి చప్పున చల్లారిపోతుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎనిమిదేళ్ల అధికార కాలంలో తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ప్రజల్లో కూడా అంతే. అయితే ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ కు దారుణ వైఫల్యాలు ఎదురుకాలేదు. అది ఆయన బలంలాగానే కనిపిస్తుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు తప్ప కేసీఆర్ కు ఎదురు నిలిచిన రాజకీయ పార్టీనే లేదు.

ఆ రెండు ఉప ఎన్నికలలో కూడా వ్యక్తులే తప్ప పార్టీలు గెలవలేదనేది అందరికి తెలిసిన వాస్తవం. మూడో ఉప ఎన్నిక మునుగోడు లో బీజపీ గెలిస్తే కూడా ఇదే జరుగుతుంది. రాష్ట్రంలో రాజకీయ వ్యతిరేకత అంతగా లేకపోయినా, పరిపాలనా వైఫల్యాలు గణనీయంగా లేకపోయినా కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరుతో కొత్త కసరత్తు ఎందుకు చేస్తున్నారు? లాజిక్ లకు అందని ఈ ప్రశ్న కారణంగానే జాతకం, వాస్తు అంశాలు ముందుకు వస్తున్నాయి.

దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల కారణంగా ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళుతున్నారని ఆయన భక్తులు బలంగా ప్రచారం చేస్తుంటారు. కానీ కేసీఆర్ గత రెండు సంవత్సరాలుగా జాతీయ రాజకీయాలలో చేసిన ఒక్క ప్రయోగం కూడా ఫలించలేదు. ఒక్కరూ కలిసి రాలేదు.

‘‘టెంటు లేదు ఫ్రంటూ లేదు’’ అని ఆయనంతట ఆయనే ప్రకటించారు ఒక దశలో. ఆయన ఆ ప్రకటన చేసిన నాటికి ఈనాటికి రాజకీయంగా ఎలాంటి మార్పులు జరగలేదు. అయినా ఆయన జాతీయ రాజకీయాల కోసం పార్టీ పేరు మార్చుకుని మరీ వెళ్లడం వల్లే ‘‘జాతకం’’ అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.    

Related posts

రూ.21.1 కోట్లతో ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి

Satyam NEWS

మండల స్థాయి ఎన్నికలలో కూడా టీడీపీ విజయం సాధించాలి

Satyam NEWS

ప్రశాంతంగా గ్రూప్ -1 పరీక్ష

Satyam NEWS

Leave a Comment