29.7 C
Hyderabad
May 2, 2024 06: 36 AM
Slider సంపాదకీయం

యాదవుల మీటింగ్ ఎందుకోసం?

#punganuru

పుంగనూరులో తిరుగులేని నాయకుడుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు అక్కడ గెలిచే పరిస్థితి కూడా లేకుండా పోయిందా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తున్నది. చిత్తూరు జిల్లా రాజకీయాలనే కాకుండా రాయలసీమ మొత్తం పెద్దిరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారు. జగన్ రెడ్డి ఆయననే ప్రోత్సహిస్తుండటంతో ఆయన హవా నడుస్తూ వస్తున్నది.

ధన బలానికి అధికార బలం తోడు కావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుగులేకుండా పోయింది. ఈ విచ్చలవిడితనంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయంగా తప్పులు చేయడం ప్రారంభించారు. పూర్తి స్థాయిలో అహం పేరుకుపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు లొంగిపోయిన వారిని తప్ప సామర్ధ్యం ఉన్నవారిని ప్రోత్సహించలేదు.

దాంతో రాయలసీమ మొత్తంలో పెద్దిరెడ్డి పెత్తనం ఏమిటి? అనే ప్రశ్న తలెత్తింది. దాంతో ఆయనపై లోలోనే సణగడం ప్రారంభం అయింది. అయితే అధికారం చేతిలో ఉన్న మనిషితో తగాదా పెట్టుకోవడం ఎందుకనే ఆలోచనలో చాలా మంది ఇంత కాలం గమ్మునున్నారు. రాయలసీమ మొత్తం తన కనుసన్నల్లో ఉండాలని కోరుకున్న పెద్దిరెడ్డి చేతి నుంచి ఒక్కొక్కరూ జారిపోవడం ప్రారంభం అయింది. అయితే ఎవరు ఎదురు తిరగకపోవడంతో ఈ వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు.

ఆ వ్యతిరేకత చిత్తూరు జిల్లాలో కూడా మొదలైంది. పెద్దిరెడ్డి చెప్పిన వారికే టిక్కెట్లు ఇస్తారనే వార్తలు తొలి నుంచి వినిపిస్తుండటంతో ఆయన కనుసన్నల్లో పడేందుకు చాలా మంది ప్రయత్నించారు. పెద్దిరెడ్డి ఆశీస్సులతో ఇప్పటికే టిక్కెట్లు ఖరారు చేసుకున్నవారు కూడా ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి తమ తమ నియోజకవర్గాలలో చేస్తున్న రాజకీయంతో చాలా మంది వైసీపీ నేతలే విసిగిపోయారు. పార్టీని బలోపేతం చేయడం అటుంచి తన సొంత వర్గాన్ని పెంచుకోవడానికే పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారనే వాదన బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఆయన మాటే వింటుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు సతమతం అయ్యారు. లోలోనే మధన పడుతూ ఉండిపోయారు.

ఇలా ఈ వ్యతిరేకత చివరకు పుంగనూరు నియోజకవర్గం వరకూ వచ్చేసింది. పుంగనూరు లో తిరుగులేని నేతగా చిరస్థాయిగా ఉండిపోదామనుకున్న పెద్దిరెడ్డి తనకు అణిగిమణిగి ఉండేవారికి పదవులు ఇప్పించుకోవడం, కాంట్రాక్టులు ఇప్పించుకోవడం చేశారు.

అంతే కాకుండా తనకు ఎదురుతిరిగిన వారిని అడ్డుతొలగించుకునే పని కూడా చేశారు. దాంతో పుంగనూరు వైసీపీలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయింది. అయితే పెద్దిరెడ్డి చుట్టూ ఉన్నవారిని చూసి భయపడిన వారు ఈ వ్యతిరేకతను బయట పెట్టలేకపోయారు. ఇప్పుడు పాపాలు బద్దలైనట్లుగా ఒక్క సారిగా తిరుగుబాటు జరుగుతున్నది. పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం, తిరుగుబాట్లు చేస్తుండటంతో పెద్దిరెడ్డి ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ముఖ్యంగా పుంగనూరు లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై దాడి జరగడం, వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టడం 90 మంది వరకూ అరెస్టు చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోవడంతో ఒక్క సారిగా పుంగనూరు ప్రజల్లో కూడా పెద్దిరెడ్డిపై అసంతృప్తి పెల్లుబుకుతున్నది.

మరీ ముఖ్యంగా యాదవ కులస్తుల్లో పెద్దిరెడ్డిని ఎలాగైనా వదిలించుకోవాలనే పట్టుదల పెరిగింది. పుంగనూరు నియోజకవర్గంలో మెజారిటీగా ఉన్న యాదవులను పెద్దిరెడ్డి తొక్కేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆది నుంచి తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉండే యాదవులు గత ఎన్నికలలో పెద్దిరెడ్డికి మద్దతుఇచ్చారు. తాము మద్దతు ఇచ్చి గెలిపించుకున్న వ్యక్తి తమకు ఏ విధంగా అన్యాయం చేశాడనే విషయం ఇప్పుడు యాదవులలో చర్చ జరుగుతున్నది.

యాదవులు తనకు వ్యతిరేకంగా మారిపోయారని తెలుసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో వైసీపీలో ఉన్న యాదవ నాయకులందరిని పిలిపించుకుని పుంగనూరులో పెద్ద మీటింగ్ కు ఆయన ప్లాన్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. యాదవుడైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈ సమావేశానికి వస్తున్నారు.

ఎన్నడూ లేని విధంగా యాదవులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఓటమి భయం పట్టుకున్నట్లుగా కనిపిస్తున్నదని చిత్తూరు జిల్లా రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లాన్ వేసినట్లు యాదవులు ఆయన జేబులోకి మళ్లీ వెళతారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసిన యాదవులు మళ్లీ పెద్దిరెడ్డి పంచన చేరరనేది వినిపిస్తున్న టాక్.

Related posts

గోళ్లపాడు చానల్ ఆధునికీకరణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

Murali Krishna

ఇంటింటికి సరుకులను పంపిణి చేసిన శ్రీపతి

Satyam NEWS

బంగాళాఖాతంలో పెరుగుతున్న ‘అసని’ తుపాను తీవ్రత

Satyam NEWS

Leave a Comment