నాగర్ కర్నూలు జిల్లా లోని మూడు మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పి డాక్టర్ వై. సాయిశేఖర్ తెలిపారు. కౌంటింగ్ నిర్వహించే నాగర్ కర్నూల్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, కొల్లాపూర్ గ్రంథాలయం బిల్డింగ్, కల్వకుర్తి భ్రమరాంబ బి.ఈడి కాలేజీ ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడి ఉండవద్దని, జిల్లాలో ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు చేపట్టవద్దని, బాణసంచా కాల్చవద్దని ఆయన కోరారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందరూ పోలీసు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఎలక్షన్ కమిషన్ పాసులు ఉన్న మీడియా, పొలిటికల్ పార్టీల ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ సెంటర్ల వద్దకు వెళ్లాలని, సెల్ ఫోన్స్ ను ఎట్టి పరిస్థితి లో లోపలికి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని క్షుణ్నంగా పరిశీలించి కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వాలని ఆయన పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ సిబ్బంది కి అవసరమైన సూచనలు చేశారు. అందరూ పాటించాల్సిన నియమాలు: 1 కౌంటింగ్ సెంటర్స్ వద్ద చుట్టు పక్కల 144 సెక్షన్ అమలులో ఉంది.
2 ఐదుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ గుంపులు గుంపులుగా తిరగవద్దు. 3. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద చుట్టుపక్కల 500 మీటర్ల దూరంలో, పట్టణాలలో 144 సెక్షన్ అమలులో ఉంది. 4. కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల ఏజెంట్లు, పోటీచేసిన కౌన్సిలర్లు పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకొని వెళ్ళకూడదు.5. కౌంటింగ్ కేంద్రానికి 500 మీటర్ల దూరంలో ఐదుగురు కానీ గుమిగూడ వద్దు అంతకంటే ఎక్కువమంది కానీ గుంపులు గుంపులుగా ఉండవద్దు.
6. పార్టీ జెండాలు పార్టీ గుర్తులు ప్లే కార్డ్స్ ధరించవద్దు ప్రదర్శించవద్దు.7. కౌంటింగ్ కేంద్రలలో మైకులు లౌడ్ స్పీకర్లు వాడరాదు. పాటలు ఉపన్యాసాలు ఇవ్వకూడదు. 8. విజయోత్సవ ర్యాలీలు సభలు, సమావేశాలు నిర్వహించకూడదు.9. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటివి నిర్వహించడం నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 10. పోలీసువారి సలహాలు/సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించడానికి సహకరించాలి.