టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్సీలు కూడా ఇదే విధంగా చేసేందుకు సిద్ధంగ ఉన్నారని ఆయన తెలిపారు.
అయితే వాళ్లందరినీ తీసుకుని మేమేం చేయాలని సజ్జల ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో రామకృష్ణారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం తమకు లేదని ఆయన చెప్పారు. డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని తెలిపారు. సీఎం జగన్ నవతరం నాయకుడైతే.. చంద్రబాబు నాయుడు అంతరించిపోతున్న నాయకుడని ఆయన వ్యాఖ్యానించారు. మండలిలో ఉన్న మెజార్టీతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతోంది.
రాజధానిని గ్రాఫిక్స్‌లో అద్భుతంగా చూపించినట్టు.. మండలి తమ చేతిలో ఉందని తామేదైనా చేస్తామని టీడీపీ ప్రజలకు భ్రమలు కల్పిస్తోంది. చైర్మన్‌ను ప్రభావితం చేసి బాబు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. సామాన్య కార్యకర్తకంటే హీనంగా బాబు వ్యహరించారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను నియంత్రించడం దుర్మార్గం. ప్రజలు మీ గ్రాఫిక్స్ రాజధానిని నమ్మలేకే లోకేష్‌ని ఓడించారు. ప్రజల సంపూర్ణ మద్దతు, తీర్పు మావైపే ఉంది.
అయినా, పద్ధతి ప్రకారం సీఎం జగన్ ముందుకెళ్తున్నారు’అని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు శివరామకృష్ణన్ కమిటీని బాబు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బినామీ భూముల వ్యవహారం బయటపడుతుందనే.. అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారు. దళితులను భయపెట్టి చంద్రబాబు భూములను తీసుకున్నారు. లోకేష్‌ను ఓడించి, సీఎం జగన్ నాయకత్వాన్ని ఆహ్వానించిన ప్రాంతాన్ని.. ఆ ప్రజలను మేం ఎట్లా విస్మరిస్తాం. అమరావతి ప్రాంతంలో భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది అని ఆయన అన్నారు. ఎల్లో మీడియా కథనాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పొరపాటున కూడా డబ్బులిచ్చి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాలు చేయరు. ప్రజా సంక్షేమానికి అందరం కలిసి పనిచేద్దాం’అని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.