41.2 C
Hyderabad
May 4, 2024 18: 49 PM
Slider ప్రత్యేకం

A tribute: విషాదంలో శత తంత్రులు

‘ సంతూర్’ అనే జమ్మూ కశ్మీర్ పల్లెసీమల,జానపదుల సూఫీ సంగీతపు పక్కవాయిద్యాన్ని సంప్రదాయ సంగీత ఝరిగా ప్రపంచం మొత్తం వినిపించిన ఘనత పండిట్ శివ్ కుమార్ శర్మకే చెందుతుంది.

సంతూర్ కు పర్యాయపదంగా నిలిచిన ప్రపంచ సంగీతదిగ్గజం శివ్ కుమార్ శర్మ మంగళవారం నాడు శివైక్యం చెందారు. సంతూర్ ను ‘శతతంత్రీవీణ’ అని కూడా అంటారు.నిజంగా అలాగే అనాలి. కానీ సంతూర్ గానే ప్రాచుర్యం పొందింది.

ఈ ప్రభకు సృష్టి,స్థితి,లయకారుడు శివ్ కుమార్ శర్మ మాత్రమే. ఇతర దేశాలలో ఎలా ఉన్నపటికీ,భారతీయ సంగీత సుస్వరాలను జతచేర్చి సంతూర్ ను ‘సంప్రదాయ వాయిద్యం’గా శివ్ కుమార్ శర్మ మలిచి గెలిచిన తీరు అద్భుతం,అపూర్వం.

అందుకే భారత ప్రభుత్వం ఆయనను అతి ప్రతిష్ఠాత్మకమైన ‘పద్మ విభూషణ్’ తో ఘనంగా గౌరవించింది. ఎన్నో ఘన గౌరవ సత్కార హస్తాలు
ఆ కీర్తివీణను మీటాయి. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో జానపదులు వాడుకొనే చిన్న పక్కవాద్యం చిన్ననాటే శర్మను పెద్దగా ఆకర్షించింది.

14 ఏళ్ల నించే కఠోర సాధన

అప్పటి వరకూ నేర్చుకుంటున్న తబలా,గాత్ర సాధనలను కూడా పక్కన పెట్టేశాడు.మనసంతా ఆ తంత్రుల చుట్టూనే తిరగడం మొదలైంది.సంతూర్ తన చేతుల్లోకి వచ్చినప్పుడు శర్మ వయసు కేవలం 13-14 సంవత్సరాలు. తండ్రి ఉమాదత్ శర్మ దగ్గర ఇదేళ్ల ప్రాయంలోనే తన సంగీత విద్యాభ్యాసం ప్రారంభమైంది.

హిందుస్థానీ గాయక ఘనుడుగా,తబలా,పక్ వాజ్ విద్వాంసుడుగా ఉమాదత్ శర్మ ఆ కాలంలో పేరెన్నికగన్న కళాకారుడు. బెనారస్ ఘరానాకు చెందిన ఆయన కుమారుడిని తీర్చిదిద్దడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ‘ సంతూర్’ను కుమారుడికి పరిచయం చేశారు.

సహజ సంగీత ప్రతిభకు తండ్రి అధ్యాపనం కూడా జతకలిసి శివ్ కుమార్ శర్మను చేయితిరిగిన కళాకారుడిగా మలిచింది. 12 వయస్సులోనే తబలా, గాత్రంలో జమ్మూ ఆకాశవాణిలో ప్రదర్శనలను ఇచ్చే స్థాయికి తీసుకెళ్లింది.

సంప్రదాయ వాదుల నుంచి ప్రతిఘటన

ఆ తర్వాత నుంచి సంతూర్ సాధన మిన్నుముట్టింది. శివ్ కుమార్ శర్మ సుమారు నాలుగేళ్లపాటు బాగా సాధన చేసి,1955లో తన 17వ ఏట తొలి ప్రదర్శన ఇచ్చాడు. ప్రగతిశీల భావనలు కలిగినవారి నుంచి ప్రశంసలు వచ్చినా,సంప్రదాయవాదులు ఆ సంతూర్ సంగీతాన్ని ఒప్పుకోలేదు.శ్రావ్యమైన సంప్రదాయపు పోకళ్ళు అందులో లేనేలేవని పెద్దఎత్తున విమర్శలు మొదలుపెట్టారు. అది శివ్ కుమార్ శర్మలో మరింత పట్టుదలను పెంచింది. సంతూర్ వాద్య పరికరాన్ని రకరకాలుగా మారుస్తూ వచ్చారు.

తంత్రులను మార్చుకుంటూ, జతకలుపుతూ, మెల్లగా శ్రావ్యతను పెంచుకుంటూ వచ్చారు. మనిషి గాత్రం ఎంతటి మాధుర్యాన్ని,శ్రవణసుఖాన్ని ఇస్తుందో… అలా.. సంతూర్ ను శివ్ కుమార్ శర్మ తీర్చిదిద్దారు. సంగీత పరంగానూ – సాంకేతికంగానూ ‘సంతూర్’ను సంపూర్ణమైన వాయిద్యంగా మలచాడనికి శివ్ కుమార్ చేసిన కృషి అనన్య సామాన్యం. ఈ కష్టం ఊరికే పోలేదు.

హిందూస్థానీ సంప్రదాయ సంగీతవాదులు సంతూర్ ను తన కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించారు.అప్పటి నుంచి సంగీత లోకంలో అది ‘శివ’తాండవం చేసింది. సంతూర్ ను భుజంపై వేసుకొని శివ్ కుమార్ శర్మ ప్రపంచమంతా జైత్రయాత్ర చేశారు.కొన్ని వేల సోలో’ ప్రదర్శనలు, జుగల్ బందీలు,త్రిగళ్ బందీలు కూడా ఇచ్చారు.

శివ్ కుమార్ శర్మ సంతూర్ ప్రదర్శన ఇస్తుంటే..ఆ నాదానికి జగతి తన్మయమైపోయేది. సినిమా సంగీత ప్రపంచంలోనూ శివ్ కుమార్ శర్మ గొప్ప సందడి చేశారు.ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ తెచ్చారు.

ప్రఖ్యాత వేణుగాన విద్వాంసుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి ‘శివ్ -హరి’ గా ఆ జంట పండించిన సంగీతం అజరామరం. 1967ప్రాంతంలో వీరు చేసిన ‘కాల్ అఫ్ ది వ్యాలీ’ ఆల్బమ్ ఒక ఊపుఊపింది. ఈ నిర్మాణంలో గిటార్ విద్వాంసుడు బ్రిజ్ భూషణ్ కాబ్రా కూడా జతకట్టాడు.ఈ సంగీత త్రయం నుంచి వెలువడిన ఆ ఆల్బమ్ పాశ్చాత్య సంగీత విద్వాంసులను కూడా వణికించింది.

భారతీయ సంగీత కళాకారులు సృష్టించిన అద్భుతమైన విజయం సాధించిన శాస్త్రీయ సంగీత ఆల్బమ్ గా ప్రపంచంలో ఇప్పటికీ రికార్డ్స్ ను సృష్టిస్తూనే ఉంది.’ది వ్యాలీ రీకాల్స్ ‘ పేరుతో శివ్ -హరి ద్వయం 1996లో తీసుకొచ్చిన మరో ఆల్బమ్ కూడా గొప్ప ఆదరణను గడించింది. ప్రఖ్యాత చిత్ర దర్శకుడు వి శాంతారామ్ కు కూడా శివ్ కుమార్ శర్మ అంటే ఎంతో ఇష్టం.అద్భుతమైన విజయం సాధించిన ‘ఝణక్ ఝణక్ పాయల్ బాజే’ సినిమాలోని కొన్ని దృశ్యాలకు శివ్ కుమార్ శర్మ తెరవెనక సంగీతం అందించారు.

‘గైడ్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన సుప్రసిద్ధ గీతం ‘మోసే చల్ కియే జాయ్’ కు శివ్ కుమార్ శర్మ తబలా వాద్యంతో సహకరించారని ఎక్కువమందికి తెలియదు. ‘శివ్ -హరి’ ద్వయ స్వరరచనా ప్రస్థానంలో సిల్సిలా,చాందినీ,లమ్ హే, డర్,ఫాస్ లే మొదలైన సినిమాల్లో ఎన్నో విజయవంతమైన గీతాల
సృష్టి జరిగింది.

కొప్పరపు కవుల కళాపీఠం పురస్కారం

భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ,పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడెమి పురస్కారాలను పొందడమే గాక,యూ ఎస్ ఏ,బాల్టిమోర్ మొదలైన దేశాల గౌరవ పౌరసత్వ గౌరవాలను కూడా శివ్ కుమార్ శర్మ తన సంతూర్ సాధన ద్వారా సాధించుకున్నారు. 2017లో తెలుగునాట, విశాఖపట్నంలో శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం ‘జాతీయ ప్రతిభా పురస్కారం’ ప్రదానం చేసి ఘనంగా సత్కరించింది.

పండిట్ శివ్ కుమార్ సంగీత వారసత్వం విజయవంతంగా కొనసాగుతోంది. కుమారుడు రాహుల్ శర్మ తండ్రి నుంచి స్వయంగా సంతూర్ వాద్యవిద్యను నేర్చుకొని,దేశవిదేశాలలో పేరు తెచ్చుకుంటున్నారు. కుమారుడిగా,శిష్యుడిగా శివ్ కుమార్ శర్మ వారసత్వ వైభవాన్ని నిలబెడుతున్నందుకు రాహుల్ శర్మను అభినందిద్దాం.

84 ఏళ్ళ ప్రాయం వరకూ తుదిశ్వాస వరకూ సంగీతంలోనే తరించి, తుదిశ్వాస వదిలిన ‘నాదయోగి’ పండిట్ శివ్ కుమార్ శర్మ ధన్యజీవి,చిరంజీవి.

మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్

Related posts

కరోనా పై పోరాటానికి కదిలిన అధికార యంత్రాంగం

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

Satyam NEWS

లాక్ డౌన్ కరోనాకు నామినేటెడ్ పోస్టు నాకు

Satyam NEWS

Leave a Comment