28.7 C
Hyderabad
May 6, 2024 08: 11 AM
Slider చిత్తూరు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జగన్ కుట్ర

#naveen

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ “చీకటి చట్టాన్ని” ఉపసంహరించుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న భూహక్కుల చట్టం 27/ 2023 ను న్యాయవాదులతో పాటు ప్రజలందరూ వ్యతిరేకించకపోతే రాబోవు కాలంలో తమ ఆస్తులపై హక్కులు కోల్పోతారన్నారు. తిరుపతి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు భూ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న 3 వ రోజు రిలే నిరాహార దీక్షకు బుధవారం నవీన్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపి ప్రసంగించారు.

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి “ధర్మాన అధర్మంగా” మాట్లాడుతున్నారని భూ హక్కుల చట్టం కార్యరూపం దాల్చలేదని అధికారులను నియమించడం లేదని ఒకపక్క చెబుతూ మరోపక్క ప్రభుత్వ జీవోలను విడుదల చేయడం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆస్తుల హక్కులకు భంగం కలిగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు వెంటనే “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్” చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాష్ట్ర “ప్రజల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం” ఏమిటని ఆ హక్కు అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని మండి పడ్డారు. భారతదేశంలో ఏ రాష్ట్రాలలో లేని “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్” చట్టాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేయాలనుకోడంలో కుట్ర దాగి వుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సొంత స్థలాలు,వ్యవసాయ భూములు,ప్లాట్లు తమ బిడ్డలకు కుటుంబ సభ్యులకు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా,తమ బిడ్డల ఉన్నత చదువుల కోసం పెళ్లిళ్ల కోసం అత్యవసర పరిస్థితులలో అమ్ముకోవాలన్నా తాకట్టు పెట్టాలన్నా ప్రభుత్వం నియమించే “టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారి” అనుమతి తప్పనిసరి అవుతుందన్నారు.

భూ హక్కుల చట్టంలో టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారి అవినీతిపరుడయితే ప్రజల ఆస్తులకు భద్రత కరువవుతుందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం భారత ప్రజాస్వామ్య దేశంలో న్యాయవ్యవస్థ,రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవిన్యూ వ్యవస్థలు పనిచేస్తున్నాయని వాటికి మంగళం పాడే విధంగా ఈ “చీకటి చట్టం” కారణంగా ప్రజల సొత్తు ప్రభుత్వం చేతిలలోకి వెళ్ళిపోతుందన్నారు. ప్రజలు భూ తగాదాలకు సంబంధించి న్యాయస్థానాలను ఆశ్రయించకుండా పోయే ప్రమాదం ఉందని టైటిలింగ్ అధికారి అనుమతితో హైకోర్టుని ఆశ్రయించే విధంగా ప్రజల ఆస్తులను తమ గుప్పెట్లో పెట్టుకునే విధంగా ప్రభుత్వం ఈ దుర్మార్గపు చట్టాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు.

భూ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకొని పక్షంలో రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజల పక్షాన హైకోర్టును ఆశ్రయిస్తానని నవీన్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్, పూర్వాధ్యక్షులు దినకర్, న్యాయవాదులు ఆనంద్,దేవరాజులు, రమేష్, హరీష్, రాజశేఖర్, హరికృష్ణ, వెంకటేష్,రమణ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

Related posts

నేడు మల్దకల్ తిమ్మప్ప స్వామి కళ్యాణం

Bhavani

గతేడాది కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరణ

Bhavani

విజయనగరం పోలీస్ స్పంద‌న‌: రికార్డు స్థాయిలో 33 ఫిర్యాదులు…..!

Satyam NEWS

Leave a Comment