లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని విస్తరించాలని పాతబస్తీలోని అఫ్జల్‌గంజ్ మజీద్ మరమ్మతులకు నిధులు మంజూరి చేయాలని కోరుతూఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఓవైసీ హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞాపన పత్రం అందజేశారు. లాల్ దర్వాజ బోనాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తుచేశారు.
ఇంతటి ప్రసిద్ధి ఉన్నప్పటికీ, చాలినంత స్థలం లేకపోవడం వల్ల దేవాలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకపోవడం లేదని వివరించారు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.అలాగే పాతబస్తీలోని అఫ్జల్‌గంజ్ మజీద్ మరమ్మతుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారని.. మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతుందని సీఎం కేసీఆర్‌కు అక్బరుద్దీన్ వివరించారు.
అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.