33.2 C
Hyderabad
May 4, 2024 00: 37 AM
Slider ప్రత్యేకం

Analysis: కమల రథాన్ని నడిపిస్తున్న కాపు సారధులు

#BJPPresident

భారతీయ జనతా పార్టీ దక్షిణాదిన ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బలం పుంజుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానిలో భాగంగానే తెలంగాణాలో బండి సంజయ్ కుమార్ ను, ఆంధ్రప్రదేశ్ లో సోము వీర్రాజును బీజేపీ రాష్టస్థ్రాయి అధ్యక్షులుగా నియమించింది.

వీళ్ళు ఇద్దరూ బీజేపీ భావజాలాన్ని క్షేత్రస్థాయిలో కి బలంగా తీసుకువెళ్తారని విశ్వసించి పదవులు కట్టబెట్టింది. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ లో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. అటు పాలక టీ ఆర్ ఎస్ పార్టీని, ఇటు కాంగ్రెస్ ను ఎదుర్కొని బీజీపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న బండి

బండి సంజయ్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యత చేపట్టినప్పటి నుంచి పాలక టీ ఆర్ ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై సందర్భానుసారంగా విమర్శిస్తున్నారు.

అత్యంత క్లిష్టమైన  కోవిడ్ -19 సమస్యను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టడంలో టీ ఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ బీజేపీ మొదటి నుంచి దుయ్యబడుతూనే ఉంది.

కేంద్రప్రభుత్వం ఇస్తున్న సహకారాలను ఉపయోగించుకుంటూనే రాష్ట్రానికి సాయం అందించలేదంటున్న కేసీఆర్ ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. తాజాగా శ్రీశైలం విద్యుత్ కేంద్ర దుస్సంఘటన లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరునూ ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అందివచ్చిన  ప్రతి అవకాశాన్ని బీజేపీ కి అనుకూలంగా మలచుకునేందుకు వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తోంది.

గణేష్ మండపాల విషయంలో బిజెపి పైచేయి

వినాయక నవరాత్రుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత వైఖరిపై విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇచ్చిన పిలుపు మేరకు బిజెపి కార్యకర్తలు నాయకులు నిరసన ప్రదర్శనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇది పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిన అంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఆయన వ్యవహార శైలి బీజేపీ నేతలకు, కార్యకర్తలకు మింగుడుపడని సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలక వై ఎస్ ఆర్ పార్టీకి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రత్యమ్నాయంగా బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ కేంద్రనాయకత్వం  ఆశిస్తే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

రాష్ట్రంలో బీజేపీని నమ్ముకుని చాలా కాలంగా ఉన్న నేతలను కాదని కాంగ్రెస్ పార్టీనుంచి వచ్చిన  కన్నాకు బీజేపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం రాజకీయ పరిశీలకులకు అప్పటిలోనే విస్మయం కలిగించింది. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజుకి బీజీపీలో సిద్ధాంతాలను పాటించే అతికొద్ది వ్యక్తులలో ఒకరుగా పేరుంది.

పరిస్థితులు అనుకూలిస్తే గద్దెనెక్కేది పవన్

ఆయన రాకతో రాష్ట్రంలో ఉన్న బీజేపీ శ్రేణులు ఉత్సాహం వ్యక్తంచేస్తున్న తీరుతో రాష్ట్రంలో ఆ  పార్టీ బలపడగల సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పార్టీల సమీకరణాలు కొత్తరూపు సంతరించుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో బీజేపీకి , సినీనటుడు పవన్ కల్యాణ్ కు  చెందిన జనసేన పార్టీకి మధ్య గతకొద్ది రోజులుగా సాగుతున్న రాజకీయ అవగాహన చర్యలు రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ భూమిక పోషించనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పరిస్థితులు అనుకూలిస్తే… పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ- జనసేన పార్టీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల మధ్య నలుగుతున్న రాజకీయ వాతావరణం లో అతిబలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన బీజేపీ, జనసేన అధినాయకులు వ్యూహాత్మకంగా కలిసి పనిచేస్తున్నారు.

ఇది బిజెపికి ఎంత వరకు లాభం చేకూరుస్తుందో వేచి చూడాల్సి ఉంది.

– పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

తానే

Satyam NEWS

నెలనెలా విద్యుత్తు చార్జీల సవరణ దుర్మార్గం

Bhavani

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి

Murali Krishna

Leave a Comment