37.7 C
Hyderabad
May 4, 2024 13: 45 PM
Slider సంపాదకీయం

విధ్వంసంతో ప్రభుత్వాన్ని లొంగదీయడం సాధ్యమా?

#DelhiFarmer

రైతు సమస్యను రాజకీయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న శక్తులు రిపబ్లిక్ డే ను బాగా వాడుకున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్నట్లు కనిపిస్తున్నా ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశ్యంతో నడిపిస్తున్న ఉద్యమంగానే చెప్పవచ్చు.

అమాయకులైన రైతులను రోడ్లపైకి ఈడ్చిపారేస్తున్న ఈ రాజకీయ దురుద్దేశాన్ని ఖండించక తప్పదు. ఇదేదో రైతులకు, వారి డిమాండ్లకు వ్యతిరేకంగా వెలిబుచ్చుతున్న అభిప్రాయం కాదు. వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తూ రైతులను వ్యతిరేకించడమూ కాదు. వాస్తవ పరిస్థితులు బేరీజు వేసుకుంటూ వెలిబుచ్చుతున్న అభిప్రాయం మాత్రమే.

ప్రభుత్వం వినకపోతే ఏం చేయాలి?

సాగు చట్టాలలో లోపాలు ఎత్తి చూపడం, వాటి సవరణకు ప్రభుత్వం పై వత్తిడి తీసుకురావడం వరకూ సమర్థనీయమే కానీ ఇదేంటి? చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమర్థనీయమా? ప్రభుత్వం వినకపోతే ఏం చేస్తారు అని అమాయకంగా ప్రశ్నించవద్దు.

దేశాన్ని పాలిస్తున్న బిజెపిని ఇరుకున పెట్టేందుకు దేశంలో ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడకు వెళ్లి అక్కడి రైతులను బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేసుకునేలా చేసుకోండి. అంతే కానీ సెల్ టవర్లు కూల్చివేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం రైతు డిమాండ్లకు సానుకూలత ఎలా తెస్తుంది?

అల్లర్లు సృష్టించడం సమర్థనీయం కాదు

రిపబ్లిక్ దినోత్సవం కేవలం కొందరు చేసుకునేది కాదు. జాతీయ పండుగ. ఇలాంటి పండుగ దినోత్సవం నాడు దేశ రాజధానిలో అల్లకల్లోలం సృష్టించడం సమర్థనీయం కాదు. సాగు చట్టాలపై వ్యతిరేకత నిజంగా ఉంటే ఒక్క పంజాబ్ లోనో, మహారాష్ట్రలోనే కాదు దేశం మొత్తంలో ఆందోళన జరిగిఉండేది.

ఇన్ని రోజులుగా రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఆందోళన చేస్తున్నా దేశంలో మరెక్కడా ఆందోళనలు జరగడం లేదు. కేవలం కమ్యూనిస్టు పార్టీలు తమకు బలం ఉన్నచోట్ల నిరసనలు వ్యక్తం చేయడం తప్ప. కేంద్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం అటుంచి చట్టాలను పూర్తిగా రద్దు చేసేవరకూ ఆందోళన చేస్తామని అనడం ఎంత వరకు సమంజసం?

వ్యవసాయ మార్కెట్లు ఎంత మంది వాడుతున్నారు?

దేశంలో చాలా చోట్ల ఉన్న వ్యవసాయ మార్కెట్లను ఎంత మంది రైతులు వినియోగించుకుంటున్నారు? వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కేవలం వ్యవసాయ మార్కెట్లలోనే అమ్ముకోవాలని నిబంధన తెస్తే సమర్ధిస్తారా? రైతుకు మద్దతు ధర ప్రభుత్వమే ఇవ్వాలనే డిమాండ్ ఈనాటి గ్లోబలైజేషన్ కు అనుకూలంగా ఉండదు.

దేశం తిరోగామి దశలో ఉన్న సమయంలో పి వి నరసింహారావు ప్రధాని గా అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే సరళీకృత ఆర్ధిక విధానాలను తీసుకువచ్చింది. ఆ నాటి నుంచి ప్రతి రంగంలో మార్పులు వస్తున్నాయి. క్రమేపీ అన్ని రంగాలకూ ఇవి వర్తిస్తూ ఉన్నాయి.

తెలంగాణ ఉదాహరణ గమనించండి

ఇప్పుడు వ్యవసాయ రంగానికి కూడా మార్పులు జోడించుకోవాల్సిన అత్యావశ్యకత ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రైతుల నుంచి అన్ని రకాల పంటలు కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. పర్యవసానం ఏమిటి? ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది.

ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించి పంటల కొనుగోలు నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ తాజా ఉదాహరణ చూసిన తర్వాత అయినా దేశంలోని రాజకీయ నాయకులు తమ ప్రవర్తనను మార్చుకోవాలి కానీ అలా జరగడం లేదు.

ప్రయివేటు రంగం సేద్యంలోకి, సంబంధిత వాణిజ్యంలోకి రావాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉన్నది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. మార్కెట్ యార్డులు, అక్కడే వ్యాపారం చేయడం అనే విధానం నుంచి మార్పు చేయడమే నూతన చట్టాల ఉద్దేశ్యం తప్ప రైతును రోడ్డున పడేయడం కాదు.

బిజెపిపై కోపం ఉంటే గద్దె దించండి

నూతన చట్టాల అమలు సరిగా లేకపోతే మరో మూడేళ్లలో మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వస్తాయి కదా అప్పుడు బిజెపి పై దేశ వ్యాప్తంగా రైతులే తిరుగుబాటు చేస్తారు. మోడీ ప్రభుత్వాన్ని దింపేస్తారు. వ్యవసాయ రంగంలో కొత్తగా చేస్తున్న మార్పులను స్వాగతించకపోయినా ఫర్వాలేదు.

ఇంత భారీ ఎత్తున వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. బ్యారికేడ్లను ధ్వంసం చేసుకుని ఢిల్లీ లోకి చొరబడితే వ్యవసాయ చట్టాలు రద్దు కావు. పోలీసుల చేతిలో రైతులు దెబ్బలు తింటే వ్యవసాయ చట్టాలు రద్దు కావు. చట్టాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇప్పటికే బలమైన వాదనలు వినిపించారు.

ఇంకా రెచ్చగొట్టి రైతులపై పోలీసులు తీవ్ర చర్యలు తీసుకునే వరకూ తీసుకురావద్దు. పాలకులూ ప్రతిపక్ష పార్టీలూ, వాటి నాయకులు కూడా సురక్షితంగానే ఉంటారు…. బలి అయ్యేది రైతులే…… వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం చూస్తుంటే గతంలో బ్యాంకుల జాతీయీకరణ సమయంలో జరిగిన ఆందోళనలు గుర్తుకు వస్తున్నాయి.

బ్యాంకుల్లో కంప్యూటర్లు ప్రవేశ పెట్టినప్పుడు జరిగిన ఆందోళనలు గుర్తుకువస్తున్నాయి. అప్పుడు అనివార్యం అయి ఇప్పుడు అలవాటు అయి, అవి లేకపోతే బ్యాంకులు నడిచేది ఎలా అనే స్థాయికి వచ్చాం. వ్యవసాయ చట్టాలు కూడా అంతే.

Related posts

పని చేయించుకుని బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ఇది

Satyam NEWS

హన్మకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Satyam NEWS

ఆర్టీసీ బస్సును దొంగలించిన వ్యక్తి అరెస్టు

Bhavani

Leave a Comment