41.2 C
Hyderabad
May 4, 2024 17: 57 PM
Slider ప్రత్యేకం

అధికారం కోసం ఆరాటం లేదు… అందుకు పోరాటం లేదు

#PawanKalyan

పవన్ కల్యాణ్…పరిచయం అవసరంలేని పేరు.  “జనసేన”… ఇంకా బాగా పరిచయం కావాల్సిన పొలిటికల్ పార్టీ. తన వైవిధ్యమైన శైలితో తక్కువ సమయంలోనే కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో పవన్ కల్యాణ్ సినిమా రంగంలో విజయుడయ్యారు.

రాజకీయ క్షేత్రంలో, తానేంటో ఇంకా నిరూపించుకోవాల్సిన దశలోనే ఉన్నారు. ఆయన స్థాపించిన  “జనసేన పార్టీ ” మార్చి 14 వ తేదీకి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.2014 ఎన్నికల సమయంలో బిజెపి-టిడిపితో పవన్ కలిసి తిరిగారు.

తెలుగుదేశం పార్టీ గెలుపులో పవన్ కల్యాణ్ వాటా  ఉందన్నది నిజం. ఆ సమయంలో, ఆ గెలుపుతో మోదీని కూడా పవన్ ఆకర్షించారు. ప్రత్యేక హోదా అంశంలో విభేదించి,బిజెపి నుంచి పక్కకు తొలిగి, వామపక్షాలతో కలిసి సాగారు.

2019ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే జనసేన గెలిచింది. గాజువాకలో పవన్ తప్పకుండా గెలుస్తారని అందరూ అంచనా వేశారు. కానీ తాను స్వయంగా ప్రాతినిధ్యం వహించిన రెండు చోట్లా ఆయన ఓటమినే ఎదుర్కొన్నారు.

కాంగ్రెస్ తో పోల్చుకుంటే …. ఎంతో తృప్తి

సీట్ల అంశం అలా ఉంచితే,5.53 శాతం ఓట్లను జనసేన సాధించింది. వైసిపీ, టిడిపితో పోల్చుకుంటే ఈ శాతం తక్కువే కావచ్చు. కానీ, కాంగ్రెస్, బిజెపితో పోల్చుకుంటే? ఇది చాలా ఎక్కువ. దశబ్దాల పాటు రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ కేవలం 1.17శాతం ఓట్లను మాత్రమే సాధించింది.

కారణాలు ఏవైనా కావచ్చు, ఇది ఘోరమైన వైఫల్యం. జాతీయ స్థాయి పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న బిజెపి సైతం కేవలం 0.84శాతం ఓటింగ్ నే నమోదు చేసుకుంది. దిగ్గజాలైన ఈ రెండు పార్టీలు ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేక చతికిలా పడిపోయాయి.

37ఏళ్ళ వయస్సు దాటి, ఒకటిన్నర  దశాబ్దం పైగా రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం 23 స్థానాలే పొంది, ఘోరంగా దెబ్బతింది. వైసీపీ హోరులో పెద్ద పార్టీలు కొట్టుకుపోయాయి. ఇటువంటి వాతావరణంలో, జనసేన 5.53శాతం ఓట్ల షేర్ ను సంపాయించుకోవడం, ఒక్కసీటునైనా దక్కించుకోవడాన్ని విశేషంగానే భావించాలి.

జనంపైనే విశ్వాసం…. డబ్బుపై కాదు..

2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు డబ్బును వెదజల్ల లేదు. అందరూ  పవన్ కల్యాణ్ పైన విశ్వాసంతోనే ఎన్నికల బరిలోకి దిగారు. పార్టీ అధినేత పవన్ జనాన్ని నమ్మారు. జనంపై అపరిమితమైన విశ్వాసాన్ని పెట్టుకున్నారు. డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కోనని ఒట్టు పెట్టుకున్నారు.

ఈ తీరులో నడిచినందుకు ఆశించిన ఫలితం రాలేదు. అంచనాలు పూర్తిగా తప్పాయి. అయినప్పటికీ, పవన్ కల్యాణ్ నిరుత్సాహపడినట్లు ఎక్కడా కనిపించలేదు. రేపటి తరాల కోసమే నా ఆరాటం… అని ఆయన పదే పదే చెబుతున్నట్లుగా, నేడు అపజయాలు ఎదురైనా, రేపటి పట్ల పవన్ చాలా విశ్వాసంతో ఉన్నారు.

రెండు పడవలు… సినిమా… రాజకీయాలు

అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. సినిమా – రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. పార్టీని నడపాలన్నా, తనను నమ్ముకున్నవారిని బతికించాలన్నా, సినిమా తప్ప, తనకు వేరే ఆదాయ మార్గం, ఆస్తులు లేవని చెప్పడాన్ని స్వాగతించడంలో తప్పులేదు.

కాకపోతే, రాజకీయాలను తాను చాలా సీరియస్ గా తీసుకున్నారనే విశ్వాసాన్ని ప్రజల్లో ఇంకా బలంగా నింపాల్సిన అవసరం మాత్రం  ఉంది. రాజకీయ ప్రయాణంలో భాగంగా, మళ్ళీ బిజెపితో కాపురం మొదలు పెట్టారు. దీనితో వామపక్షాలు దూరమయ్యాయి. బిజెపి – జనసేన పొత్తు ఇంకా బలంగా కుదురుకోలేదనే అనిపిస్తోంది.

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి బలాన్నిస్తున్నాయి. తెలంగాణలో బిజెపి నాయకులు జనసేన ఆడపడుచులను, నాయకులను చులకన చేసి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి బదులు పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవికి మద్దతు ఇస్తామని పవన్ ప్రకటించారు. స్థానిక బిజెపి నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో, ఢిల్లీలోని బిజెపి అగ్రనాయకత్వం తమ పట్ల ఎంతో గౌరవంగా ఉందని ప్రకటించారు.

కమలంతో బంధం కలకాలం సాగేనా….?

తెలంగాణ రాజకీయాల్లో వై ఎస్ షర్మిల హడావిడి చేస్తున్న సందర్భంలో,తెలంగాణలోనూ జనసేన తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటోంది. తెలంగాణలో జనసేనకు ఎంతో బలం ఉందనే విశ్వాసంలో పవన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని బిజెపి స్థానిక నాయకత్వం పట్ల ఇంకా మిశ్రమ అభిప్రాయంతోనే ఆయన ఉన్నారు.

ఈ బంధం కొనసాగుతుందా… తెగిపోతుందా.. కాలంలో తేలిపోతుంది.ఒంటరిగా తమ సత్తా, తమ పంథా ఏమిటో చూపించుకోకుండా, మళ్ళీ బిజెపితో కలిసి సాగడం వల్ల జనసేన పార్టీ స్వేచ్ఛను కోల్పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు, ఉధృతంగా సాగుతున్న ఉక్కు ఉద్యమంలో జనసేన పాక్షికంగానే పాల్గొంటోంది.

విశాఖ స్థానిక నేతలు మాత్రమే పాల్గొంటున్నారు. బిజెపితో కలిసి సాగుతున్న కారణంతో, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే స్వతంత్రతను  జనసేన కోల్పోయింది. ఏ ప్రత్యేక హోదా అంశంలో విభేదించి బయటకు వచ్చిందో?, ఇప్పుడు దాని గురించి కేంద్రంతో యుద్ధం చేసే స్వేచ్ఛ జనసేనకు పోయినట్లే అని భావించాలి. అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ విధానంపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది.

ప్రశ్నించే నేత చుట్టూ ప్రశ్నలే

ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనిపై ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారు. అప్పుడు ఒక రాజకీయ పార్టీగా ప్రజల వైపు పోరాడాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఇంకా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. వీటన్నిటి పట్ల జనసేన తన గళాన్ని ఏ విధంగా వినపిస్తుంది? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి.

అన్ని అంశాలకూ,కేవలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలను విమర్శించడం వల్ల ప్రజాభిమానం పెల్లుబుకదు, అనే సత్యాన్ని గ్రహించాలి.2019 ఎన్నికలకు కాస్త ముందు నుంచీ,అప్పుడు అధికారంలో ఉన్న టిడిపిని  జనసేన తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని మొదటి నుంచీ విమర్శిస్తోంది.

అదే.. తేడా. అంతకు మించి ఏమీ లేదనే అభిప్రాయంలోనే ప్రజలు ఉన్నారు.అధికారంలో ఉన్న పార్టీలు చేసే తప్పులను ఎండగట్టడం ప్రతిపక్షాల  బాధ్యత. అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం చేసే తప్పులను కూడా నిలదీయాలి. అప్పుడే ఆ పార్టీలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది.

రాష్ట్రంలోని మిగిలిన రాజకీయ పార్టీల నాయకుల కంటే పవన్ కల్యాణ్ కు ” మిస్టర్ క్లీన్”  ఇమేజ్ ఇంకా ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అతనిపైనే ఉంది. పార్టీని ఇంకా బూత్ స్థాయి నుంచి పటిష్ఠంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కల్యాణ్ నాయకత్వం పట్ల, జనసేన పార్టీ పట్ల ఇంకా ప్రజల్లో విశ్వాసం పెరగాలి.

పెంచాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది. కేవలం తెలంగాణలో నిర్మాణం చేపడితే సరిపోదు.ఆంధ్రప్రదేశ్ లోనూ నిర్మాణంలో బలమైన అడుగులు వేయాలి. జమిలి ఎన్నికలు వస్తే, సమయం లేదు మిత్రమా….పార్టీని బలోపేతం చేయడంలో వేగం పెరగాలి. పార్టీ స్థాపించి ఇప్పటికే 7ఏళ్ళు పూర్తయింది.

ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం

ఈ ఏడేళ్ల ప్రస్థానాన్ని ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. మేదోమధనం జరగాలి. సామాన్య ఓటరుకు మనం ఏం చేయాలనుకుంటున్నాం… ఏం చెబుతున్నామో  స్పష్టంగా అర్ధమవ్వాలి. పార్టీ శ్రేణుల్లోనూ పార్టీపై, వారి భవితపై విశ్వాసం పెంచాలి. పవన్ ఆలోచనలు, నిర్ణయాలు స్థిరంగా ఉండవు, తరచూ మారుతూ ఉంటాయి… అనే అపప్రధను పోగొట్టుకోవాలి.

బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని పెద్దలు చెబుతున్నారు. అధికారంలోకి రావాలన్నా, లేదా బలమైన ప్రతిపక్షంగా నిలబడాలన్నా జనసేన ఇంకా అడుగులు గట్టిగా వేయాలి. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు గొప్ప ఫలితాలు రాకపోయినా, విశాఖపట్నం వంటి మహా నగరంలో 3డివిజన్లను సొంతం చేసుకోవడం మంచి పరిణామమే.

స్థానిక ఎన్నికల్లో బిజెపితో పొత్తు వల్ల జనసేనకు నష్టం జరిగిందని ఆ పార్టీ నేతలే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో కొంత నిజం ఉంది. బడుగు వర్గాల పట్ల నిలుచుంటాము, పీడితులకు అండగా ఉంటాము,డబ్బు ప్రమేయం లేని రాజకీయాలు నడుపుతాము,రాజకీయాల్లో కొత్త సంస్కృతిని నెలకొల్పుతాము… అంటూ జనసేన ముందుకు వచ్చింది. 

పవన్ కల్యాణ్ ఆన్నీ తానై ముందుకు వెళ్తున్నారు. రేపటి తరాల కోసమే నా ఆరాటం… అని భావించే  కల్యాణ్ కు రేపటిపై ఎంతో విశ్వాసం ఉంది.జనసేన భావి ప్రస్థానం, జయాపజయాలు భవిష్యత్తులో తెలుస్తాయి.ఆరాటం ఎలా ఉన్నా,  పోరాటం ఎలా సాగిస్తున్నామన్నది ముఖ్యం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

మాజీ మంత్రి తుమ్మలను కలిసిన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్

Bhavani

రైతుల భూమిలో రైతు వేదిక నిర్మాణం ఆపాలి

Satyam NEWS

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి గా దర్శనం ఇస్తున్న దుర్గమ్మ

Satyam NEWS

Leave a Comment