30.7 C
Hyderabad
April 29, 2024 03: 31 AM
Slider సంపాదకీయం

ఆఖరి శ్వాస తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్

#GandhiBhavanHyderabad

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బేస్ కదలిపోతున్నది. ఇప్పటికే పోయింది పోగా మిగిలింది కూడా పోతున్నది. ఇదేదో కొండా విశ్వేశ్వరరెడ్డి వెళుతున్నాడని చెబుతున్నది కాదు. తెలంగాణ లో తిష్ట వేసుకు కూర్చున్న టీఆర్ఎస్ పార్టీని సవాల్ చేసే పరిస్థితిలోకి బిజెపి వచ్చి చేరడంతో కాంగ్రెస్ పార్టీ మరింత త్వరత్వరగా పతనం దిశగా పయనిస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికి బట్టకట్టాలంటే ఫైర్ బ్రాండ్ నాయకుడు, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడుగా చేయాలనే డిమాండ్ ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకుండా అనేక శక్తులు అడ్డుపడుతున్నాయి.

రేవంత్ రెడ్డికి పదవి దక్కకుండా పిసిసి అధ్యక్షరేసులోకి కొత్త పేర్లు చేరుస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి పేర్లు వచ్చి చేరింది కేవలం రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికేనని చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడానికి వీల్లేదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు.

రేవంత్ రెడ్డికి పదవి దక్కితే తమ ఉనికికి చెల్లుచీటీ వస్తుందని సీనియర్ నాయకులు తీవ్రంగా భయపడుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో సంబంధంలేకుండానే తన వర్గం ఉంది.

కాంగ్రెస్ సీనియర్ల పెద్దప్లాన్

రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయితే జిల్లాల్లో ఇప్పటి వరకూ పాతుకుపోయిన కాంగ్రెస్ నేతలకు స్థానచలనం తప్పదు. అందుకే రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ సీనియర్లు పెద్దప్లాన్ వేశారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడుగా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చిన విషయం తెలుసుకుని అభిప్రాయ సేకరణ చేసేలా పావులు కదిపారు.

అదీ కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి ఒప్పించారు. అందులో మెజారిటీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్పారు. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు ముందుకు వచ్చి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడుగా చేయడం కరెక్టు కాదని అధిష్టానవర్గానికి తేల్చి చెప్పారు.

అందుకు సమయం తీసుకోవాలని ఆయన మధ్యే మార్గంగా సూచించారు. అందుకు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికతో లింక్ పెట్టారు. దాంతో అధిష్టానవర్గం అందుకు అంగీకరించింది. రేవంత్ రెడ్డి ఎన్నిక వాయిదా వేసుకున్నది.

ఇది చాలు రేవంత్ రెడ్డి వ్యతిరేకులకు. ఆ నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ మళ్లీ బతుకుతుందని ఆశ చచ్చిన కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. వారిని ఆపే నాధుడు లేకుండా పోయాడు. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నట్లుగా అందరికి తెలుసు.

అయినా ఎవరూ ఏమీ చేయలేరు. రేవంత్ రెడ్డి పార్టీని నడిపించి విజయతీరాలకు చేరుస్తాడని అనుకున్న వారికి నిరాశ మిగులుతున్నది. తెలంగాణ లో రెడ్ల ఓట్లను గణనీయంగా చీల్చేందుకు వై ఎస్ షర్మిలా రెడ్డి పార్టీ పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్లప్పగించి చూస్తున్నారు తప్ప ఒక్కరూ వ్యతిరేకంగా మాట్లాడలేదు.

షర్మిలా రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి బాసటగా నిలిచేవారే కాంగ్రెస్ పార్టీలో కరవయ్యారు. షర్మిలా రెడ్డి బలపడితే ఆ పార్టీలో చేరేందుకు ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్ రెడ్డి నాయకులు ఉంచుకుంటున్నారు. మరణ శయ్యపై ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘‘కారుణ్య మరణం’’ కోసం దరఖాస్తు చేసుకోవడం బెటర్.  

Related posts

క్రైస్తవుడైన వై ఎస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

Satyam NEWS

సీతారామ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది

Murali Krishna

మంత్రి మల్లారెడ్డి జన్మదినం జరిపిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment