32.2 C
Hyderabad
May 12, 2024 21: 33 PM
Slider ప్రత్యేకం

Analysis: రోత పుట్టిస్తున్న రాతగాళ్ల నైజం

#MediaInIndia

తెలుగునాట జర్నలిజం వెర్రితలలు వేస్తున్న తీరు ప్రజాస్వామ్య ప్రియులను ఆశ్చర్య పరుస్తోంది. ఒకింత ఆందోళననూ కలిగిస్తోంది. తెలుగు ప్రచార, ప్రసార సాధనాలలో గుణాత్మక విలువలు కనుమరుగవడం మొదలై ప్రస్తుతం పౌరసమాజం హర్షించని స్థాయికి దిగజారడం శోచనీయం.

సమకాలీన సామాజిక, ఆర్ధిక, రాజకీయ పరిణామాలపై తులనాత్మక, నిష్పాక్షిక దృష్టి లోపించిన కారణంగా జర్నలిజంలో విలువలు లుప్తమవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. స్థూలంగా విశ్లేషిస్తే తెలుగు రాష్ట్రాలలో  మాధ్యమం పాలక ప్రభుత్వాలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా వ్యవహరిస్తున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రజాభిప్రాయానికి వేదిక కావాలి

ప్రభుత్వ పాలనాక్రమంలో భాగంగా ప్రజాసంక్షేమం లక్ష్యంగా తీసుకునే నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన వార్తలను స్వచ్చందంగా  సమాజానికి అందించాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. ప్రజాభిప్రాయాలకు వేదిక కావాల్సిన ప్రచార, ప్రసార సాధనాల నిర్వహణలో  రాగద్వేషాలు చొరబడి ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా ప్రేక్షకులకు లేదా వీక్షకులకు అర్ధసత్యాలు, అసత్యాలు అందించడం చూస్తున్నాం.

రాజ్యాంగం ప్రసాదించిన భావస్వాతంత్య్ర ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం ఉచితం కాదని ప్రముఖ మీడియా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వార్తకు,  వ్యాఖ్యకు మధ్య ఉండాల్సిన విభజనరేఖ కొన్ని సందర్భాలలో అదృశ్యం కావడం జర్నలిజం విలువలను కాలరాయడమేనని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

సామాజిక బాధ్యతను విస్మరించి మాధ్యమాన్ని ఇష్టారాజ్యంగా స్వార్ధప్రయోజనాలకోసం వినియోగించడం సహేతుకం కాదని స్పష్టం చేస్తున్నారు. లౌకికవాదాన్ని గౌరవిస్తూ సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించని విధంగా రాతలు, తీతలు ఉండాలని వారు మీడియా యాజమాన్యాలకు సూచిస్తున్నారు.

గతంలో మీడియా పాత్ర అమోఘం

సమాజంలో అశాంతి ప్రబలినప్పుడు, దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్పుడు, మహమ్మారితో వెతలబారిన పడినప్పుడు….ఇలా చాలా సందర్భాలలో మీడియా స్పందించి, వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకున్న ఉదాహరణలు తెలుగునాట గతంలో కోకొల్లలు.

భారత స్వాతంత్ర్య పోరాటకాలంలో పత్రికలు నిర్వహించిన పాత్ర అమోఘం.” ఉద్యమాలను నడిపించిన పత్రికలు జాతికే గర్వకారణం.” అని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చిన కితాబు నేటికీ స్ఫూర్తి దాయకం. “ఏ పత్రిక చరిత్ర చూసినా…ఏమున్నది గర్వకారణం…పత్రికా నిర్వహణంతా పరపీడనపరాయణత్వం ..”అని ఓ ఆధునిక కవి ఆవేదన వ్యక్తంచేశారు.

రాజీ పడటం జర్నలిస్టులకు అలవాటైపోయింది

పత్రికారంగంలో పెట్టుబడిదారుల ప్రవేశంతో జర్నలిజం కొత్త భాష్యాన్ని  పుణికిపుచ్చుకున్నదని  అనుభవజ్ఞులైన పాత్రికేయులు అంటూవుంటారు. యాజమాన్యం ఆలోచనలకు అనుగుణంగా అక్షరరూపం అందించడానికి సిద్ధం కాకపోతే ఉపాధికే ఎసరు వస్తుందని జర్నలిజం వృత్తిలో ఉన్నవారిలో కొంతమంది రాజీపడడం తప్పనిసరైంది.

 పర్యవసానంగా మీడియాలో వర్గవిభజన వేళ్ళూనుకుంది. దీనికితోడు ఇటీవల తామరతంపరగా పుట్టుకొస్తున్న సామాజిక మాధ్యమాలు సమాజంలో లేనిపోని వైషమ్యాలను రెచ్చగొడుతున్న వైఖరి ఆందోళన కలిగించే అంశం.

రోతపుట్టిస్తున్న వ్యాఖ్యానాలు

పాలకనేతలను ఆకాశానికి ఎత్తేస్తూ…లేదా ప్రతిపక్షాలను అప్రాజాస్వామిక పదజాలంతో దూషిస్తూ సాగిస్తున్న దుష్టవిన్యాసాలు ప్రజాస్వామ్య ప్రియులకు రోత కలిగిస్తున్నాయి. స్వీయ నియంత్రణ లేక పోవడంతో చౌకబారు సమాచార వ్యాప్తి బహుముఖాలుగా సభ్యసమాజానికి మేలుకంటే హాని ఎక్కువగా చేస్తోంది.

ప్రజలమధ్య కుల, మత, వర్గ, ప్రాంతీయ, భాషా విద్వేషాలు రెచ్చగొట్టి స్వార్ధప్రయోజనాలకు వెంపర్లాడడం బాధాకరం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జర్నలిజం ముసుగులో చోటు చేసుకుంటున్న దాష్టీకాలకు  అడ్డూఅదుపు ఉండదని విజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కష్టకాలంలో సైతం కొన్ని సామాజిక మాధ్యమాలు ప్రజలకు తప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడం  వాటి దమననీతికి పరాకాష్ట. ఇటువంటి ఆగడాలను నియంత్రిచడానికి ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం, బాధ్యతగల పౌరసంఘాలు చొరవతీసుకోవాల్సి ఉంది.

ప్రముఖ రాజనీతిజ్ఞుడు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక సందర్భంలో అన్నట్లు….” మితి మీరిన స్వేచ్ఛ, స్వతంత్రత ప్రజలకు మూర్ఖత్వం వైపు నెడతాయి”

-పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

విజయనగరంలో విప్లవ జ్యోతి అల్లూరి విగ్రహావిష్కరణ

Satyam NEWS

రాజీవ్ గాంధీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎంపి ఉత్తమ్ కు సన్మానం

Satyam NEWS

ట్రైనీ సహాయ కలెక్టర్ విశాఖ కు చెందిన సహాదిత్ వెంకట్ త్రివినాగ్

Satyam NEWS

Leave a Comment