27.7 C
Hyderabad
May 14, 2024 05: 43 AM
Slider ప్రత్యేకం

టెంటు… ఫ్రంట్ లేకుండా ఏం చేస్తవు సారూ?

#Telangana CM KCR

ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి 21 ఏళ్ళ అనంతరం జాతీయస్థాయిలో విస్తరించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే టీ ఆర్ ఎస్ తరహాలో భారత రాష్ట్ర సమితి ( బీ ఆర్ ఎస్) ఏర్పాటు చేయాలని తెరాస ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ తో ప్రతిపాదన చేయించడం గమనార్హం.

దేశానికి కావలసింది ఫ్రంట్ లు కాదు. ఫ్రంట్ లతో సాధించేది ఏమీ లేదని ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు సాగాలని తెరాస 21 వ ప్లీనరీలో పార్టీ శ్రేణులకు అధినేత కె. చంద్ర శేఖర్ రావు పిలుపు ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం బాగుపడ డానికి కొత్త రాజకీయ శక్తి తప్పనిసరి అని ఆయన ప్రకటించారు.

దేశాన్ని సరైన ప్రగతి పథంలో నడిపించడానికి హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా, ప్రతిపాదన, సిద్ధాంతం తయారు కావాలని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ ప్రకటన గమనించిన పరిశీలకులకు పలు సందేహాలు రావడం సహజం. ఇటీవలి కాలం వరకు బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి జాతీయ స్థాయిలో ఒక ఐక్య ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ ప్రదర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఫ్రంట్ లతో సాధించేది ఏమీ లేదని వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

భాజపా, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల సహకారంతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని ఆశించిన కేసీఆర్ మనసులో కొత్తగా రాజకీయ శక్తి ఏర్పాటు అంశం పుట్టడం ఆసక్తి కలిగిస్తోంది.
ఒకనాడు…తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టీ రామారావు జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ కు ఛైర్మన్ గా వ్యవహరించారు. ఒక సందర్భంలో ఆయన కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావించి, భారతదేశం పేరుతో పార్టీ స్థాపించాలని అనుకున్నారు. కానీ కారణాంతరాల వల్ల అది సాధ్యం కాలేదు.

ఇప్పుడు దాదాపు అదే తరహా ఆలోచనతో తెరాస అధినేత ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెరాస ప్లీనరీ వేదికగా మోదీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. దేశం అన్ని రంగాలలో నాశనమై పోయిందని ఆయన అన్నారు. మతం పేరుతో కేంద్రంలోని బీజీపీ దుర్మార్గపు రాజకీయం చేస్తోందని కేసీఆర్ తప్పు పట్టారు. అపారమైన సహజ నీటి వనరులు ఉన్నా దేశంలోని పలు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థ పాలనకు ఇది నిదర్శనమని తెరాస అధ్యక్షుడు విమర్శించారు.

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ప్లీనరీలో మాట్లాడుతూ దేశానికి కేసీఆర్ లాంటి మార్గదర్శి అవసరం అని, జాతీయ రాజకీయాల్లో టీ ఆర్ ఎస్ కీలక భూమిక పోషించాలని తన అభిమతం ప్రకటించారు.
తెరాస ప్లీనరీలో ఆ పార్టీకి చెందిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జాతీయ స్థాయి రాజకీయాలలో ప్రవేశంపై ఆసక్తి చూపడం పట్ల భాజపా, టి.కాంగ్రెస్ పక్షాలు ఘాటుగానే స్పందించాయి.

ఎనిమిదేళ్ల పాలనలో ఏం వెలగబెట్టారని జాతీయ స్థాయి రాజకీయాలకు ఎగబాకాలని కలలు కంటున్నారని భాజపా తీవ్రంగా దుయ్యబట్టింది. టీ ఆర్ ఎస్ 20 ఏళ్ళ ప్రస్థానం మోసాలు, దగా, కుట్రలతో నడిచిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తెలంగాణ సమాజం ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చలేని కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని పగటి కలలు కనడం మూర్ఖత్వం అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

రాష్ట్రంలో తెరాస గ్రాఫ్ క్రమంగా తగ్గుముఖం పట్టడం వల్లనే కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తెరాస ప్లీనరీలో విమర్శనాస్త్రాలు సంధించా రని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న భాజపా ను ఎదుర్కోవడానికి కొత్త ఎజెండా అవసరం ఉందని కేసీఆర్ ప్రకటించడం వెనుక ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐ ప్యాక్ సూచన ఉన్నట్లు తెలుస్తోంది.

రానున్న శాసన సభ ఎన్నికలలో తెరాస తిరిగి అధికారంలోకి రావడానికి ఐ ప్యాక్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎనిమిదేళ్ల నాటి తెలంగాణ సెంటిమెంట్ 2023 ఎన్నికలలో అంతగా లబ్ది చేకూర్చదని గ్రహించిన తెరాస అధినేత కొత్త పల్లవి అందుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలలో వేడి పుంజుకుంటున్న నేపథ్యంలో
తెరాస రచించే రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా పదును పెట్టాలని విపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణ రాజకీయాలు ఎలా మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ సామాజిక విశ్లేషకులు

Related posts

ఆచార్య జయశంకర్ కు నివాళుర్పించిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

విభజన కన్నా ఎక్కువ విధ్వంసం చేసిన జగన్ పాలన

Satyam NEWS

Hats off: అవయవ దాత కు ఘన సన్మానం

Satyam NEWS

Leave a Comment