33.2 C
Hyderabad
May 4, 2024 00: 01 AM
Slider ప్రత్యేకం

వ్యవ‘సాయం’ అందుకోవడంలోనూ ఏపీ దిగదుడుపే!

#YS Jagan Mohan Reddy

వ్యవసాయ సేవల రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ పూర్తిగా వెనుకబడింది. భారత వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ అంశాల వివరాలతో ‘వ్యవసాయ గణాంకాలు-2021’ నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. 2019 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు మధ్యకాలంలో 17 రాష్ట్రాలకు 187.85 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో తెలంగాణకు అత్యధికంగా 49.44 మిలియన్‌ డాలర్లు, బిహార్‌కు 39.5, గుజరాత్‌కు 30.49, తమిళనాడుకు 20.07 మిలియన్‌ డాలర్లు అందాయి. చివరి మూడు స్థానాల్లో ఏపీ(0.12 మిలియన్‌ డాలర్లు), రాజస్థాన్‌(0.11), ఒడిశా(0.01) నిలిచాయి. బిహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల వ్యవసాయరంగాలకు సైతం ఏపీకంటే ఎక్కువ పెట్టుబడులు రావడం గమనార్హం.

ఏపీలో 29.43 లక్షల రైతు కుటుంబాలకు అప్పులు

కేంద్రం నివేదిక ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని 29.43 లక్షల రైతు కుటుంబాలకు, తెలంగాణలోని 24.36 లక్షల రైతు కుటుంబాలకు అప్పులు ఉన్నాయి. దేశంలో మొత్తం 4.67 కోట్ల రైతు కుటుంబాలకు అప్పులున్నాయి. దేశంలో 2020-21లో పండిన మొత్తం ఆహారధాన్యాల్లో ఏపీ వాటా 3.7 శాతమైతే… దేశవ్యాప్తంగా అప్పుల్లో ఉన్న రైతు కుటుంబాల్లో ఏపీ వాటా 6.3 శాతం. తెలంగాణ ఆహారధాన్యాల వాటా 3.3 శాతమైతే అప్పుల్లో ఉన్న రైతు కుటుంబాలది 5.2 శాతంగా తేలింది.

ఏపీలో క్వింటా ధాన్యం ఉత్పత్తికి రూ.1005 ఖర్చు

ఒక క్వింటా ధాన్యం ఉత్పత్తికి అత్యధికంగా మహారాష్ట్రలో రూ.2,405, పశ్చిమబెంగాల్‌లో రూ.1,584, కేరళలో రూ.1,560 ఖర్చవుతోంది. అది తెలంగాణలో రూ.1,319, ఏపీలో రూ.1,005గా ఉంది. క్వింటా జొన్నల ఉత్పత్తికి తెలంగాణలో రూ.2,925, ఏపీలో రూ.1,290 ఖర్చు అవుతోంది. మొక్కజొన్నకు తెలంగాణలో రూ.930, ఏపీలో రూ.1330 అవుతోంది.

గోదాముల్లో నిల్వ సామర్థ్యం 2021 మార్చినాటికి ఏపీలో 33.52 లక్షల టన్నులుంటే తెలంగాణలో 17.09 లక్షల టన్నులుంది. అత్యధికంగా పంజాబ్‌లో 226.18 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యముంది. శీతల గిడ్డంగుల్లో నిల్వ సామర్థ్యం ఏపీ, తెలంగాణ కలిపి 2022 జనవరి ఆఖరుకు 16.97 లక్షల టన్నులుంది.

భూసార పరీక్షలు చేసి రైతులకు ఇచ్చిన భూసార ఫలితాల కార్డులు 2019-20లో ఏపీలో 2.26 లక్షలుంటే తెలంగాణలో 1.10 లక్షలున్నాయి. అత్యధికంగా యూపీలో 2.55 లక్షల కార్డులిచ్చారు. పంటల సాగుకు బ్యాంకులిచ్చిన పంట రుణాల సొమ్ము 2021-22లో తెలంగాణలో 18.74 లక్షల మంది రైతులకు రూ.23,037 కోట్లు. ఏపీలో 38.77 లక్షల మంది రైతులకు రూ.52,098 కోట్లున్నాయి.

Related posts

ప్రభుత్వ లక్ష్యాలు వెంటనే పూర్తి చేయాలి

Bhavani

ఇలా కూడా అప్పులు తీసుకురావచ్చా?

Satyam NEWS

బెస్ట్ హ్యూమానిటీ అవార్డు అందుకున్న హుజూర్ నగర్ వాసి

Satyam NEWS

Leave a Comment