23.7 C
Hyderabad
May 8, 2024 05: 50 AM
Slider ప్రత్యేకం

ఆర్ధిక పతనం: అధిక వడ్డీ చెల్లిస్తేకానీ పుట్టని అప్పు

#ysjaganmoha

రోజు కూలీ చేసుకునేవారు ఏ రోజు వచ్చిన డబ్బుతో ఆ రోజు ఆకలి తీర్చుకుంటారు. వేరే గత్యంతరం లేక. అలాంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఏ రోజుకారోజు డబ్బులు వెతుక్కుంటుంటే……? ఆ రాష్ట్రం దివాలా అంచుకు చేరినట్లుగా భావించాలి.

భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని అనుకోవాలి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అలానే ఉన్నట్లు ఆర్ధిక నిపుణులే చెబుతున్నారు. రిజర్వు బ్యాంకు కౌంటర్ గ్యారెంటీతో తెచ్చుకునే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ (బహిరంగ మార్కెట్ రుణాలు) కూడా అతి కష్టంపైనే ఆంధ్రప్రదేశ్ కు దక్కుతున్నాయి.

అదీ కూడా అత్యధిక వడ్డీని చెల్లిస్తామని చెబితేనే రుణాలు ఇచ్చేవారు ముందుకు వస్తున్నారు. ఆసోం లాంటి చిన్న రాష్ట్రాలు, చిన్న ఆర్ధిక వ్యవస్థలు అతి తక్కువ వడ్డీ ఇస్తున్నా కూడా ఎంత అడిగితే అంత మేరకు రుణాలు ఇస్తున్న రుణదాతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం అత్యధిక శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నా అరకొరగానే విదిలిస్తున్నారు.

ఇంతటి దారుణ పరిస్థితి ఏనాడూ లేదు…..

ఇంతటి దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నడూ లేదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఆర్ధికంగా వత్తిడి ఉన్నప్పుడు ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు వెసులుబాటు కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని తరచూ వినియోగించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ నిన్న రెండు వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకున్నది.

ఏపితో బాటు 12 రాష్ట్రాలు అప్పుకోసం వెళ్లినా మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా అత్యధిక వడ్డీని ఏపి ఇవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు అత్యంత వెనుకబాటుతనంతో ఉండే బీహార్ లాంటి రాష్ట్రం 6.75 శాతం వడ్డీతో రెండు వేల కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్ నుంచి రుణంగా తీసుకున్నది.

ఆసోం లాంటి ఆర్ధికంగా చిన్న రాష్ట్రం కేవలం 6.33 శాతం వడ్డీ మాత్రమే ఇవ్వగలమని చెబితే రుణాలు మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం వెయ్యి కోట్ల రూపాయలను 7.19 శాతం వడ్డీ ఇచ్చి, మరో వెయ్యి కోట్ల రూపాయలను 7.15 శాతం వడ్డీ ఇచ్చి తెచ్చుకున్నది.

మనకన్నా మిజోరాం బెటర్…..

ఆంధ్రప్రదేశ్ తర్వాత అంత భారీ వడ్డీని ఆఫర్ చేసిన రాష్ట్రం మిజోరాం ఒక్కటే. ఆ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువే ఆఫర్ చేసింది. మిజోరాం ఇచ్చిన వడ్డీ 7.12 శాతం మాత్రమే. ఈ లెక్కన చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో అప్పు పట్టడం కూడా కష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

ఆర్ధిక శాఖను పర్యవేక్షించే అధికారులు, ఆర్ధిక వ్యవహారాలపై సలహాలు ఇచ్చే సలహాదారులు పరిస్థితిని వివరించి ఖర్చులు తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని సరిదిద్దాలి. అయితే ముఖ్యమంత్రి ప్రాధాన్యతలను నెరవేర్చడం తమ విధి అని భావిస్తున్న అధికారులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి.

కేంద్ర కొట్టిన దెబ్బతో ఏపి అబ్బా….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న విచ్చలవిడి ఖర్చులను అదుపు చేయడానికి ఆర్ధిక క్రమశిక్షణ కోసం నిర్దేశించిన ఎఫ్ఆర్ బిఎం లెవెల్స్ ను కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో గణనీయంగా తగ్గించింది. సుమారు 42 వేల కోట్ల మేరకు రుణాలు తెచ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏపి కోరితే కేవలం 27 వేల కోట్లకు మాత్రమే కేంద్రం అనుమతించింది.

గత ఏడాది కరోనా కష్టాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల ఎఫ్ ఆర్  బి ఎం లెవెల్స్ ను ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తి(జి ఎస్ డిపి)లో మూడు శాతం నుంచి ఐదు శాతానికి పెంచింది.

ఈ వెసులుబాటుతో గట్టెక్కిన ఆంధ్రప్రదేశ్ కు ఈ సారి కేంద్రం ఎఫ్ ఆర్  బి ఎం లెవెల్స్ తగ్గించడంతో తీవ్ర విఘాతం కలిగింది. ఇప్పటికైనా ప్రజలకు నేరుగా డబ్బులు పంచే కార్యక్రమాలు నిలుపుదల చేయకపోతే ఇక ఎవరూ అప్పు కూడా ఇవ్వరు.  

Related posts

రాజకీయ నాయకుల్లా కొట్లాడుకుంటున్న పోలీసులు

Satyam NEWS

పవన్ ని విమర్శించే అర్హత ఎమ్మెల్యే మేడా కు లేదు

Satyam NEWS

స్వేచ్ఛకు పర్మిషన్ ఇచ్చిన పండుగ దినం

Satyam NEWS

Leave a Comment