ఒడిశాలోని తాల్చేరులో ఉన్న మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్‌కో థర్మల్ ప్లాంట్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలకు సరిపడా బొగ్గు, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచే సరఫరా అయ్యేదని, రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్ కాలరీస్‌ను తెలంగాణా రాష్ట్రానికి ఇచ్చారని, కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదని సిఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. అందుకోసం ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని, దీనివల్ల రాష్ట్ర విద్యుత్ రంగంలో భరోసా లేకుండా పోయిందని ఆయన అన్నారు. దీనివల్ల ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు అవరోధాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయని, ఐబి వ్యాలీ, తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలున్నాయని ఆయన తెలిపారు. మార్చి 2020 నాటికి ఏపీ జెన్‌కో తన థర్మల్ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు సిద్ధమవుతోందని, ఈ అదనపు విద్యుత్ తయారీకోసం ఏటా 7.5 ఎంఎంటీఏల బొగ్గు నిల్వలు అవసరం ఉందని ఆయన తెలిపారు. అంతేకాక ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరాచేయాల్సి ఉందని, అందుకే మందానికిని– ‘‘ఎ’’ కోల్ బ్లాక్, తాల్చేరు కోల్‌ఫీల్డ్, అంగుల్ బొగ్గు క్షేత్రాలను వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కోరారు.
previous post