37.2 C
Hyderabad
May 6, 2024 20: 30 PM
Slider ఖమ్మం

సైబర్ మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి

#cybercrime

సైబర్ మోసగాళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అమాయకులను బురిడీ కొట్టిస్తూ అనేక రకాలుగా నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ కె.శంకర్ అన్నారు. సైబర్ నేరాల అవగాహన కోసం నిర్వహిస్తున్న సైబర్ జాగృతి కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఖమ్మం నగరంలోని మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో సైబర్ జాగృతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే సైబర్‌ నేరాలు విజృంభిస్తున్నాయని, ఈ తరహా నేరాల్లో మనుషులు కనిపించరని, వారి గొంతూ వినిపించదని, కానీ మోసాలు జరిగిపోతుంటాయని అన్నారు. ఖాతాల్లోని డబ్బులు దోచుకోవడమే కాకుండా… ఫోన్లలోని రహస్య సమాచారాన్ని సైతం తస్కరిస్తారని అన్నారు. కేవలం అవగాహనలేమి కారణంగా వ్యక్తిగత గోప్యత, భద్రత కోల్పోతున్నారని తెలిపారు.

సైబర్‌నేరగాళ్లు ఎదో ఆశ చూపి వల వేస్తుంటారని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్‌లో ఏదైనా స్కీమ్‌ గురించి చెబితే అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్‌నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే, వెంటనే సైబర్‌క్రైమ్‌ టోల్‌ప్రీ నంబర్‌ 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.సైబర్‌ నేరాలను అడ్డుకోవడంలో భాగంగా కేంద్రం 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌తో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని. తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) ఆధ్వర్యంలో 24/7 ఈ కాల్‌సెంటర్‌ పనిచేస్తుందని తెలిపారు.

ఈ సెంటర్‌కు వచ్చే కాల్స్‌ను మేనేజ్‌ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చే కాల్స్‌ నేరుగా అక్కడ పనిచేసే సిబ్బందికి వెళ్తుంటాయని తెలిపారు. ఈ కాల్‌ సెంటర్‌కు ఆయా బ్యాంకుల రిస్క్‌మేనేజ్‌మెంట్‌ టీమ్‌లు అనుసంధానమై ఉంటాయని. సైబర్‌నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, తమ వైపు నుంచి తక్షణ చర్యలు తీసుకునేందుకు రిస్క్‌మేనేజ్‌మెంట్‌ టీమ్స్‌ను అందుబాటులో ఉంటాయని తెలిపారు.

దీంతో కాల్‌సెంటర్‌ నుంచి సమాచారం వెళ్లగానే.. ఆయా బ్యాంక్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్స్‌ అప్రమత్తమై బ్యాంకు ఖాతాల ఆధారంగా డబ్బు ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని గుర్తించి, ఆ ఖాతాలను ప్రీజ్‌ చేస్తారని తెలిపారు. నేరగాళ్లు ఆ ఖాతాల్లో నుంచి డబ్బు డ్రా చేయకుండా ఉంటే.. అందులో ఉండే నగదు కూడా ప్రీజ్‌ అవుతుందని తెలిపారు.ఈ సందర్భంగా అప్లికేషన్స్ మోసాలు, ఆన్‌లైన్ జాబ్ మోసాలు, కస్టమర్ కేర్ మోసాలు, క్రెడిట్ & డెబిట్ కార్డ్ మోసాలు, ఆధార్ ప్రామాణీకరణ మోసాలు మరియు ఒలెక్స్ మోసాలు మరియు డయల్ 1930 మరియు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ గురించి 24 గంటల్లో ఫిర్యాదు చేయడం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ నర్సింహారావు, ఎస్‌ఐ రంజిత్ కుమార్, డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ పి.పద్మావతి పాల్గొన్నారు.

Related posts

Good News: 23 నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్లు షురూ

Satyam NEWS

రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మందికి ఇండ్లు మంజూరు అయ్యాయి

Satyam NEWS

విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

Satyam NEWS

Leave a Comment