రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సోమేశ్ కుమార్ కు నేడు చేదు అనుభవం ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లాలో కాలుష్య కాసారాలుగా పారిశ్రామిక వాడలు ఉన్నాయని జిల్లా పర్యటనకు వెళ్ళిన సోమేశ్ కుమార్‌ను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామస్తులు తెలంగాణా కొత్త సీఎస్ సోమేశ్ కుమార్ ను అడ్డుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
కాలుష్య కారక పరిశ్రమలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని వారు చెప్పారు. గ్రామస్తుల డిమాండ్ మేరకు రంగారెడ్డి గూడ గ్రామంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో తమ గ్రామంలో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నామని వారన్నారు.
గ్రామాలలో చాలా మంది రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్ళారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించిన సోమేశ్ కుమార్ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.