పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో మంచు తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది.పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో కురిసిన భారీ మంచువర్షంతో 31మంది మరణించారు. గడచిన 24 గంటల్లో భారీగా కురిసిన మంచు వర్షంతో క్వెట్టా ప్రాంతంలో ఓ భవనం కూలి పోయిన దుర్ఘటనలో 17 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు.మృతుల్లో పిల్లలు, మహిళలున్నారు.
బలోచిస్థాన్ ప్రాంతంలో మంచు తుపాన్ వల్ల మరో 14 మంది మరణించారని బలోచిస్థాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇమ్రాన్ జర్కాన్ చెప్పారు. భారీగా కురిసిన మంచు ప్రభావంతో క్వెట్టా-జియారత్ జాతీయ రహదారిని మూసివేశారు.కశ్మీర్, గిల్జిత్, బల్టిస్థాన్, మలాకంద్, హాజారా జిల్లాల్లో భారీమంచు వర్షం కురిసింది.ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకి పడిపోయాయి. క్వెట్టా నగరంలో ఇండ్లలో వ్యాపార సంబంధిత పనులు చేసుకునే వారికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంచుతో కురుస్తున్న వర్షంతో ప్రజలు బయటకి రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. గతంలో కంటే కూడా ప్రస్తుతం వస్తున్న మంచు వర్షం తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తోందని స్థానిక మీడియా వెల్లడించింది. మంచు తుఫాన్ ధాటికి బెలూచిస్తాన్ లో ప్రతి సంవత్సరం 700 మంది పైగా చనిపోతారని ప్రభుత్వం తెలిపింది.