31.2 C
Hyderabad
May 2, 2024 23: 12 PM
Slider రంగారెడ్డి

జర్నలిస్టు రవీందర్ రెడ్డిపై సైబర్ క్రైం పోలీసులకు బిజెపి ఫిర్యాదు

#MadhavaramKantaraoBJP

తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న జర్నలిస్టు రవీందర్ రెడ్డిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. పత్రికాప్రకటన పూర్తి పాఠం:

రాష్ట్రంలోనే కాదు యావత్ దేశం వ్యాప్తంగా కోవిడ్ వ్యాధి తీవ్రంగా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటుంది. రాష్ట్రంలో ఓవైపు కేసులే లేవు.. అంతా అండర్ కంట్రోల్ అంటూ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి చాయ్ బిస్కెట్లు తింటూ సీఎస్ సోమేశ్ కుమార్ బల్లగుద్ది చెప్పారు. కానీ తెల్లవారే సాక్షాత్తు కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టి లాక్ డౌన్ విధించారు. దీన్నిబట్టే రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఏంటి, ప్రభుత్వానికి అధికారులకు మధ్య ఎంత కో ఆర్డినేషన్ ఉందో ఇట్టే అర్ధమవుతుంది.

ప్రభుత్వమే లాక్ డౌన్ పెడితే అందులో భాగస్వామి, ఆ పార్టీకి చెందిన ఓ శాసన సభ్యుడు సీఎం ఆదేశాలను బేఖాతర్ చేస్తూ లాక్ డౌన్ ఉందన్న విషయాన్ని మరిచిపోయి టీఆర్ ఎస్ పార్టీ కార్పొరేటర్ పుట్టినరోజు వేడుకలు బహిరంగ ప్రదేశాల్లో చేయడమే తప్పు. అది డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ను ఉల్లంఘించడమే కాదు పోలీసు యాక్ట్ కు కూడా విరుద్ధమే. బాధ్యతగల ఎమ్మెల్యేగా ఆయనకు కనీస అవగాహన లేదా..? ప్రజల ప్రాణాలు అంటే పట్టదా..? వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది అని ప్రభుత్వ చెబుతుంటే ఎమ్మెల్యే మాత్రం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుంది.

జర్నలిస్టులు అంటే మాకు ఎప్పుడూ గౌరవమే. నిబద్ధతతో విమర్శలు చేస్తే మేమూ స్వాగతిస్తాం.. విమర్శ ఎప్పుడూ సద్విమర్శ అయి ఉండాలనేది జర్నలిజంలో మౌళిక సూత్రం. కానీ కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే మోచేతి నీళ్లు తాగుతూ ఫక్తూ రాజకీయ నాయకులుగా మాట్లాడడం సిగ్గుచేటు.

ఒక రాజకీయ నాయకుడిని పేరు పెట్టి ఏక వచనంతో విమర్శించడం వారి కుసంస్కారానికి నిదర్శనం. అలాగే వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో మాపై పోస్టులు పెట్టి మా పరువుకు భంగం కలిగించిన సాక్షి దినపత్రిక జర్నలిస్టు రవీందర్ రెడ్డిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు పరువు నష్టం దావా వేసేందుకు ఏమాత్రం వెనుకడబోము.

ప్రజా జీవితంలో ఏళ్ల తరబడి ఉన్న మాపై ఏవైనా ఆరోపణలు ఉంటే, అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే మీరు పనిచేస్తున్న పత్రికల్లో రాస్తే మాకెలాంటి అభ్యంతరం ఉండదు. ఉండబోదు కూడా. దానికి మేము సంజాయిషీ ఇచ్చుకుంటాం. అలాగే దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఉన్నతమైన జర్నలిజం వృత్తిలో ఉంటూ ఎమ్మెల్యేపై మేము చేసిన ఆరోపణలను ఖండిస్తూ మీరు సామాజిక మాధ్యమాల్లో మా వ్యక్తిగత జీవితాలకు, విలువలకు భంగం కలిగించేలా పోస్టులు చేయడం ఏమాత్రం గర్హనీయం కాదు.

మీకు మాపై విమర్శలు చేయాలి, ఎమ్మెల్యే మెప్పు పొందాలి అని ఉంటే వెంటనే జర్నలిజాన్ని ( విలేఖరి) వృత్తిని మానుకుని టీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పుకుని చేయు. అంతేగాని జర్నలిస్ట్ వృత్తిని అడ్డుపెట్టుకుని కాదు. అయినా మీకు మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది. జర్నలిస్టుల పేరు చెప్పి వారిని నిలువునా ముంచి, వారి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టిన మీరు మమ్మల్ని వేలెత్తి చూపడం హాస్యాస్పదం. ఎమ్మెల్యేకు మీరు చెప్పిందే వేదం, ఏ పని కావాలన్న రవీందర్ రెడ్డి చేయి తడిపితే చాలన్నా విమర్శలు, ఆరోపణలు ఉన్నా ఇన్నాళ్లు మీ విలేఖరి వృత్తికి గౌరవం ఇచ్చి ఊరుకున్నాం.

కానీ నేడు మీరు చేసిన వ్యక్తిగత విమర్శలు, దూషణలు ఇకపై చూస్తూ ఊరుకునేది లేదు. కాంతారావు కళ్లు లేని కాబోది కాదు ఇకపై రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆయన అనుచరగణం చేసే ఒక్కో అక్రమాన్ని అందులో రవీందర్ రెడ్డి పాత్ర ఏంటో బయట పెట్టేందుకు రెడీగా ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దు. మేము కార్పొరేటర్ గా గెలవక పోవచ్చు.

కానీ ప్రజల మనస్సులను గెలిచి వారి ఆశీర్వాదలతో ప్రజా జీవితంలో కొనసాగుతున్నాం. మేము ఎవరికి వెన్నుపోటు పొడిచి, రోజుకో పార్టీ మార్చి, ఎవరి దగ్గర ఉంటే వారి భజన చేసే వ్యక్తులం కాదు రవీందర్ రెడ్డి ఖబడ్దార్. ఫక్తూ రాజకీయాలే చేద్దాం అని ఉంటే జర్నలిజాన్ని వదిలేసి బయటకు రా.. అక్కడే ఉంటా అంటే ఈ చంచాగిరి మాటలు, చేతలు మానుకో.. ఒక్కమాట అనే ముందు మరోసారి వెనక్కి తిరిగి చూసుకో మీ జీవితం, మీ చరిత్ర ఏంటో.. తీగలాగితే డొంక కదులుతుంది. పదవి శాశ్వతం కాదు మీరు ఎవర్ని చూసుకుని అసంబద్ద ప్రేళాపణలు పేలిన అది మళ్లీ మీకే చుట్టుకుంటుంది అన్న విషయాన్ని మర్చిపోకు.

ఇట్లు,

మాధవరం కాంతారావు

భారతీయ జనతా పార్టీ

మేడ్చల్  జిల్లా మాజీ  అధ్యక్షులు,

కూకట్పల్లి నియోజకవర్గ  ఇంచార్జి

Related posts

ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులకు ప్రయత్నం

Satyam NEWS

వేరుశనగ విత్తనాల సరఫరాపై సమీక్ష

Satyam NEWS

అవార్డ్ స్వీకరిoచిన శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్న

Satyam NEWS

Leave a Comment