33.2 C
Hyderabad
May 15, 2024 20: 46 PM
Slider సంపాదకీయం

తెలంగాణ లో బీజేపీ గ్రాఫ్ డౌన్….?

#Kavitha, Bandi sanjay

తెలంగాణ బీజేపీలో ఒక్క సారిగా నిస్సత్తువ నెలకొన్నది ఎందుకోసం? గత కొద్ది నెలలుగా బీఆర్ఎస్ తో నువ్వా నేనా అన్నట్లు తలపడిన తెలంగాణ బీజేపీలో ఒక్క సారిగా ఈ నిశ్శబ్దం ఎందుకు? తెలంగాణలో బీజేపీ చతికిలపడటానికి చాలా కారణాలు ఉన్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఎంతో ఉత్సాహంగా పని చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధంగా ఉన్నా కూడా ఆయనను పలు రకాల వ్యతిరేక శక్తులు కట్టడి చేస్తున్నాయనే అనుమానం వెల్లడవుతున్నది. కర్నాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం పాలయ్యింది. అక్కడి స్థానిక కారణాలు…

స్థానిక నేతలు దీనికి బాధ్యత వహించాల్సి ఉన్నా కూడా ఆ ప్రభావం తెలంగాణ పై పడింది. ఇది ప్రధాన కారణం కాగా,మరో ముఖ్యమైన కారణం కూడా తెలంగాణ బీజేపీని వెనక్కి లాగుతున్నది. అదేమిటంటే…. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు వ్యవహారం. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించినట్లు సీబీఐ, ఈడీలు పలు సందర్భాలలో వెల్లడించాయి. వెల్లడించడమే కాదు, ఆమె పేరును చార్జిషీట్ లో పేర్కొన్నాయి.

ఆమెను పలు దఫాలుగా ప్రశ్నించాయి. ఇంకే ముంది ఇక కవిత అరెస్టే తరువాయి… అంటూ తెలంగాణ బీజేపీ నాయకులు ఢంకా భజాయించి చెప్పారు. నేడో రేపో కవిత అరెస్టు ఖాయమని బీజేపీ శ్రేణులు కూడా నమ్మాయి. అయితే అలా జరగలేదు. కవిత ఇప్పటి వరకూ అరెస్టు కాలేదు. కవిత అరెస్టు కాకపోవడానికి ప్రధాన కారణం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు కావడమేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అది నిజమేనని మెజారిటీ ప్రజలు నమ్మేవిధంగా కవిత అరెస్టు జరగడం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికైనా కలిసిపోతాయని చాలా కాలంగా రేవంత్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు కవిత అరెస్టు విషయం ఉదాహరణగా చూపుతూ ఆయన చేస్తున్న వాదనలను ఎక్కువ మంది నమ్ముతున్నారు.

ఈ కారణం సహేతుకంగా ఉండటంతో బీజేపీ శ్రేణులు కూడా అయోమయంలో ఉన్నాయి. కర్నాటకలో గెలుపుతో ద్విగుణీకృత ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సై అంటున్నది. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అనుమానాస్పద ప్రకటనలు కూడా బీజేపీ శ్రేణులను కలవర పరుస్తున్నాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావులు బీజేపీలో చేరడం లేదని చెబుతూ,. నన్ను కూడా బీజేపీ నుంచి బయటకు రామ్మంటున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీని మరింత కృంగతీస్తున్నాయి.

బీజేపీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు, లేని వారు అనే వ్యత్యాసం బాగా ఉందనే ప్రచారం కూడా కొత్తనేతలు చేయడానికి ప్రతిబంధకంగా మారుతున్నది. కొత్త వారు రాక పాత వారు యాక్టీవ్ గా లేకపోవడంతో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నది.

Related posts

శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

తెలంగాణ యాపిల్ ఎంత తియ్యగా ఉందో

Satyam NEWS

నిబంధనలకు విరుద్ధంగా బిచ్కుందలో మరో ఆస్పత్రి

Satyam NEWS

Leave a Comment