29.7 C
Hyderabad
May 3, 2024 03: 20 AM
Slider నిజామాబాద్

మీ కుటుంబ పాలనలో ఆడపడుచులు భాగం కాదా?

#katipalli

‘ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారూ.. మొన్న అసెంబ్లీలో ఎస్.. మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే.. తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే అని గొప్పగా చెప్పిన మీకు మీ కుటుంబ పాలనలో తెలంగాణ ఆడపడుచులు కనపడటం లేదా.. వారి సమస్యలు కనపడటం లేదా’ అని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు.

జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గంలో మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి 52 కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం పథకం కింద 1040 కోట్లు, వడ్డీలేని రుణాలు 4500 కోట్లు, స్త్రినిది ద్వారా 1000 కోట్లు మొత్తం 6540 కోట్లు రావాల్సి ఉందన్నారు. 2018 లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 3 నెలల రుణాలు విడుదల చేసారని, నాటి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు.

ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 1500 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారని, ఆ నిధులు పాత బకాయిల కోసం ఉపయోగిస్తారా లేక కొత్తవాటికి ఉపయోగిస్తారా అనే దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. మున్సిపల్ మంత్రికి మున్సిపల్ పరిధిలో ఉన్న మహిళా సంఘాలకు ఎన్ని కోట్ల నిధులు బకాయి ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మంది మహిళా సంఘాల్లో ఉన్నారని, ఇందులో రెగ్యులర్ గా 62 లక్షల మంది ఉండగా 29 లక్షల మంది డిఫాల్ట్ కింద ఉన్నారన్నారు. దానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్లే ఈ సంఘాల సభ్యులు డిఫాల్ట్ కింద ఉన్నది నిజం కాదా అని నిలదీశారు. మహిళలకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఆవే డబ్బుల నుంచి పింఛన్లు, రుణాల రూపంలో ఇస్తున్నారని, ఇది నిరూపించడానికి తాను ఓపెన్ డిబేట్ కు సిద్ధమని సవాల్ విసిరారు.

నియోజకవర్గంలో మహిళలు తమకు రావాల్సిన బకాయిల కోసం రోడ్డెక్కితే దానికి ఏపీఎంలను బాద్యులను చేసి ఎలా బదిలీ చేస్తారని కలెక్టర్, పిడీలను ప్రశ్నించారు. మహిళలు రోడ్లపైకి రాకుండా కలెక్టర్, పిడీలు ఆపగలరా అని ప్రశ్నించారు. ఏపీఎంలు ఏ తప్పు చేసారని బదిలీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలు కడుపు మండి రోడ్లపైకి వస్తే రాజంపేట మండలం శివాయిపల్లి సర్పంచ్ విఠల్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజంగా సర్పంచ్ అంత మగాడే అయితే కేంద్రం నుంచి మీ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను తీసుకున్న మీ ప్రభుత్వం నుంచి తిరిగి తెప్పించుకునే దమ్ముందా అని  నిలదీశారు. మీ గ్రామంలో ఉన్న మహిళా సంఘాలకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని సవాల్ విసిరారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే గ్రామానికి వచ్చి జిపి లెక్కలు మొత్తం బయటకు తీస్తానని హెచ్చరించారు. మహిళలతో కలిసి సర్పంచ్ ఇంటిముందు కూర్చుంటామని హెచ్చరించారు. అనవసరంగా మాట్లాడవద్దని సూచించారు.

కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

మీడియా సమావేశం అనంతరం మహిళలు వందలాదిగా కలెక్టరేట్ కు బయలుదేరారు. మహిళా సంఘాలకు రావాల్సిన నిధులను విడుదల చేయించాలని వినతిపత్రాన్ని ఇవ్వడానికి ముందే సమయం అడిగితే మధ్యాహ్నం 1 గంటకు రావాల్సిందిగా కలెక్టర్ సూచించడంతో మహిళలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దాంతో పోలీసులు మహిళలను కలెక్టరేట్ గేటు వద్ద అడ్డుకున్నారు. తాము 20 మందిమి కలిసి కలెక్టర్ ను కలుస్తామని చెప్పగా 10 మందికే పోలీసులు అనుమతించారు.

10 మంది లోపలికి వెళ్లగా అక్కడ ఛాంబర్లోకి 10 మందికి అనుమతి లేదని, కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతించారు. అయినా ముగ్గురు కూడా వెళ్లినా కలెక్టర్ లేరని చెప్పడంతో కలెక్టరేట్ వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. కలెక్టర్ కలవడానికి సమయమిచ్చి లేకుండా వెళ్లాడాన్ని మహిళలు తప్పుబట్టారు. సమయం ఇచ్చి కూడా ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కొద్దిసేపటి ఆందోళన తర్వాత మహిళలు వెనుదిరిగారు.

కలెక్టరేట్ వద్ద మహిళల ఆందోళన

Related posts

పార్టీ అనుబంధ కమిటీ లు త్వరగా పూర్తి చేయాలి

Satyam NEWS

భూతద్ధం భాస్కర్‌ నారాయణగా శివ కందుకూరి నటించిన సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌

Satyam NEWS

గణేష్ నిమజ్జనం కొలనును పరిశీలించిన జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి

Satyam NEWS

Leave a Comment