28.7 C
Hyderabad
May 6, 2024 02: 46 AM
Slider నల్గొండ

తెలంగాణ వీరపుత్రుడు కామ్రేడ్ బీఎన్

#BN Reddy

(నేడు ఆయన 12వ వర్థంతి సందర్భంగా)

వీరతెలంగాణా విప్లవసింహం భీమిరెడ్డి నరసింహ్మారెడ్డి (బి.ఎన్‌). బి.ఎన్‌.ను యాదిజేసుకోవడమంటే వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలోకి ప్రవేశించడమే. 1922 మొదలు 2008 దాకా ఈ భూమి మీద నడిచిన ఓ 86ఏండ్ల యుద్ధాన్ని కండ్లకద్దుకోవటమే.. అవును.. బి.ఎన్‌. ఓ చరిత్ర.. కష్టజీవులను అల్లుకున్న చరిత్ర..

భూస్వామ్యాన్ని ఎదిరించిన చరిత్ర… రాచరికాన్ని సవాలు చేసిన చరిత్ర.. వెట్టికి సమాధి కట్టిన చరిత్ర.. ఈ మట్టికి తేజస్సునిచ్చిన చరిత్ర.”బండెనక బండి గట్టి.. పదహారు బండ్లుగట్టి..ఏ బండ్లే పోతివి కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి”… ఇది సాయుధ పోరాటంలో శతఘ్నికంటే శక్తివంతంగా పేలిన పాట.

ఇప్పటికీ మనలను రోమాంచితులను చేస్తుంది. ఆ పోరాట కాలానికి మోసుకు పోతుంది! ఈ పాటకు నాయకుడు యాదగిరే.. కానీ ఈ పాట పుట్టిన సందర్భానికి కథా నాయకుడు బి.ఎన్‌.. యాదగిరి బి.ఎన్‌. దళ సభ్యుడు. ఎర్రబాడు దొర జన్నారెడ్డి ప్రతాప రెడ్ది, తను ఏ బండ్లె ఉన్నదీ ఎవరూ కనిపెట్టకుండా పద హారు బండ్లతో ప్రయాణమై దళం నుండి తప్పించు కున్న సందర్భంలో.. ఆవేశంతో యాదగిరి అశువుగా అందుకున్న ఈ పాట..

బి ఎన్ తో ముడిపడిన గాధలెన్నో

ఆ తరువాత ఆ పోరాటానికే ఓ ఆలంబనయ్యింది. పాలకుర్తి అయిలమ్మ ఘటనకూ బి.ఎన్‌.నే నాయకుడు. అయిలమ్మ పంటకు రక్షణగా నిలబడి.. విసునూరు దేశ్‌ముఖ్‌ గూండాలతో తలపడి.. ఆరెకరాల పంటను ఆమె ఇంటికి చేర్చిన బాహుబలి అతడే.. పంట ఇంటికి చేరడంతోనే ప్రమాదం తీరలేదని భావించి.. తన సహచరులతో కలిసి ఆ పంటకూ ఇంటికీ కాపలా కాస్తుండగా, అర్ధరాత్రి పెద్దసంఖ్యలో దిగిన పోలీసు బలగాలు వారిని అరెస్టు చేసి విసునూరు పోలీసు స్టేషన్‌లో బంధించాయి.

లాఠీలతో కుళ్లబొడిచి, ఆసనాల్లో కారం పోసి, మూత్రం తాపి చిత్రహింసలెన్ని పెట్టినా చెక్కుచెదరని ఉక్కుమనిషి బి.ఎన్‌.. ఇక్కడే మనకు అయిలమ్మలో కూడా బి.ఎన్‌. స్ఫూర్తి కనిపిస్తుంది. పాలకుర్తిలో సద్ది కట్టుకుని, పట్నంలో ఉన్న నాయకులందరికీ వార్త చేరవేసి, సంఘం అండతో ఆ అరెస్టులకు నిరసనగా ప్రజల్ని కదిలించడంలో ధీరవనితగా నిలిచింది ఆమె.

ఎదురు తిరిగిన జనానికి వెన్నుపూస

ఇది ప్రజాకంటకుడైన విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్డిలో అవమానాగ్ని రగిలించింది. దీనికి తోడు అక్రమ లెవీ వసూళ్లు ఆపాలనీ, అప్పటికే తన గడీలో అక్రమంగా పోగుపడిన వంద పుట్ల లెవీ ధాన్యాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనీ సంఘనాయకులు ప్రకటన చేయడంతో ఆ దేశ్‌ముఖ్‌ భరించలేకపోయాడు..

నాయకుల హత్యకు కుట్రలు పన్నాడు. వారి జాడకోసం కార్యకర్తల ఇండ్లపై దాడులూ దౌర్జన్యాలకూ తెగబడ్డాడు. ఎదురుతిరిగిన ప్రజ.. కడవెండిలో దొర గడీ మీదకు ఊరేగింపుగా బయలుదేరింది. దొర గూండాలు దొంగచాటుగా ఆ ఊరేగింపుపై కాల్పులు జరిపారు. దొడ్డి కొమరయ్య నేలకొరిగాడు.. ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది..

ఊళ్లకు ఊళ్లే కదిలి గడీని చుట్టుముట్టాయి

.. కడవెండి జనసంద్రమైంది.. ప్రజా దిగ్భంధనంలో చిక్కుకున్న తన గడీని కాపాడుకోవడానికి ఆ దొర కొడుకు విసునూరు నుండి లారీలకొద్దీ రౌడీలను ఆయుధాలతో పంపించాడు.

అప్పటికే కొమరయ్య మరణంతో రగిలిపోతున్న ప్రజల ముందు ఆ రౌడీమూకలు నిలువలేక పారిపోయాయి. కొమరయ్య బలిదానం సాయుధ పోరాటానికి అంకురార్పణ చేసింది.. అప్పటివరకూ ఒక సాంస్కృతిక పోరాటంగా ప్రారంభమై హక్కుల పోరాటంగా సాగుతున్న ఉద్యమాన్ని సాయుధపోరాటంగా మలుపు తిప్పిన ఆ చారిత్రక కడవెండికి కూడా బి.ఎన్‌.

ఓ కథానాయకుడే..ఆయుధాల సమీకరణ, సాయుధ దళాల నిర్మాణం ఒక ప్రధాన కర్తవ్యంగా ముందుకొచ్చినప్పుడు… మొండ్రాయి, కొండ్రపోలు మొదలు కొడకండ్ల, కోటపాడు వరకూ అనేక రజాకారు క్యాంపులపై మెరుపుదాడులు చేసి తుపాకుల నెత్తుకొచ్చిన తెగింపు అతడు.. ఆయుధాల సమీకరణే కాదు, ఆ రహస్య జీవితంలో దళాల ఏర్పాటు నుంచి సాయుధ శిక్షణ వరకూ అన్నీతానై నిలిచిన నిట్టాడి అతడు.

గడియకో గండం దాటిన యోధుడు

గడియకో గండమెదుర్కొంటూ ముళ్లూ రాళ్లూ అడవులు కొండలు నదీనదాలను దాటిన ప్రయాణమతడు. మూసీనదికి ఇరువైపులా గెరిల్లా సైన్యాలను పరుగులెత్తించడమే కాదు, వాటిని కృష్ణా గోదావరి తీరాలకూ పరవళ్లు తొక్కించిన ప్రవాహమతడు. పాత సూర్యాపేట, బాలెంల, బైరాన్‌పల్లి, దేవరుప్పుల, ధర్మాపురం, మొండ్రాయి, కోటమర్తి, జాజిరెడ్డిగూడెం, మానుకోటవంటి అనేక వీరోచిత పోరాటాల ఆవిష్కర్తా అతడే…

సూర్యాపేట తాలూకా పాతర్లపాడు సమీపంలోని చిట్టడవి అది. చుట్టూ కొండలమధ్య, ఓ లోయలో ఏరియా కమిటీ సమావేశం జరుగుతోంది. తెలంగాణాలోకి యూనియన్‌ సైన్యాలు ప్రవేశించిన నేపథ్యంలో పోరాటాన్ని ఎలా కొనసాగించాలో చర్చించే సమావేశమది. పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావుతోపాటు పరిస్థితుల పరిశీలనార్థం కేంద్రకమిటీ పంపగా వచ్చిన సత్యపాల్‌ డాంగ్‌ కూడా ఆ సమావేశంలో ఉన్నారు.

రక్షణ బాధ్యతలు

సరిగ్గా దీనికి ఒకరోజు ముందే రెండు రజాకారు, పోలీసు క్యాంపులను జయించిన బి.ఎన్‌. దళం.. భారీసంఖ్యలో ఆయుధాలను సమకూర్చుకున్న ఉత్సాహంలో ఉన్న సమయాన ఆ సమావేశం జరుగుతోంది.. సుందరయ్య మాట్లాడుతున్నారు.. బి.ఎన్‌. సమావేశంలో పాల్గొంటూనే రక్షణ బాధ్యతలు పర్యవేక్షి స్తున్నాడు.. ఇంతలో సెంట్రీ నుంచి ‘పోలీస్‌’ అన్న కేక… దాని వెనుకే ‘ధన్‌’ మన్న తుపాకీ శబ్దం..!

ఆ శబ్దాన్ని బట్టే గ్రహించాడు బి.ఎన్‌.. వచ్చింది పోలీసులు కాదు అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన యూనియన్‌ సైన్యాలనీ… అంతే.. మెరుపు వేగంతో అప్రమత్తమయ్యాడు.. వ్యూహాత్మకంగా కాల్పులకు దిగకుండా తన రక్షణ వ్యవస్థకు ఆదేశాలిస్తూనే ఒక్క ఉదుటున గుహలోకి దూకి.. నిద్రలో ఉన్న తన పసిబిడ్డనందుకుని చాకచక్యంగా నాయకులతో సహా అందరినీ శత్రువలయం నుంచి సురక్షితంగా తప్పించాడు.

సమయస్ఫూర్తి గుండె ధైర్యం

ఆ సమయస్ఫూర్తి, గుండెధైర్యం ఆ రోజున ఎన్ని నిండు ప్రాణాలను కాపాడిందో..! ఈ సందర్భంలోనే.. బి.ఎన్‌. భార్య సరోజిని ఓ ముళ్ల పొదలో దూరి ఆ రోజంతా భయంకర మైన ఒంటరి జీవితాన్ని గడపాల్సి వచ్చింది.. ఇటువంటి అనేక సాహసాల సమాహారం ఆయన జీవితం.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సాయుధపోరాటానికి మొట్టమొదట ఆయుధ మెత్తిందీ, చిట్టచివర ఆయుధం దించిందీ బి.ఎనే. అందుకే ఇలా చెప్పుకుంటూ పోతే ఆతనో పోరాటాల ఊరేగింపే అవుతాడు..!బి.ఎన్‌… నిజాం పోలీసులకు, రజాకార్‌ ముష్కరులకూ ఊపిరిసలపనివ్వని ఊదరబాంబు… గడీలను వణికించిన వడిసెల…

గెరిల్లా యోధుల భుజాలమీద గర్జించే స్టెన్‌గన్‌.. మొత్తంగా ఆ సాయుధ పోరాటానికే అతడో ఐకాన్‌…పోరాటవిరమణ తర్వాత కూడా ఆయనో పోరాటమే..! అది పార్టీ నిర్మాణమైనా, ప్రజా సమస్యల పరిష్కారమైనా, పార్లమెంటరీ వ్యవహారమైనా ఆయనకు తెలిసింది దేనినైనా పోరాడి సాధించడమే.

ఏ ఆపద వచ్చినా ప్రత్యక్షమయ్యేవాడు

ఆ ప్రత్యేకతే ఆయనను పోరాటానికి మారుపేరుగా నిలిపింది. పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాలలో కూడా ఆ రోజుల్లో అనేక నిర్భంధాలను ఎదుర్కోవలసివచ్చేది. పార్టీ ఆఫీసులపైనా, ఉద్యమాలపైనా తరచూ ప్రజాశత్రువుల దాడులూ దౌర్జన్యాలూ జరుగుతుండేవి. అలాంటి సందర్భాల్లో ప్రజలకు ఎక్కడ ఏ ఆపదొచ్చినా అక్కడ ప్రత్యక్షం కావడం ఆయనను మరింతగా ప్రజలకు సొంతం చేసింది.

క్యాడర్‌ను కాపాడుకోవడంలో ఆయన కన్నతండ్రి లాంటివాడు. ఘర్షణ అనివార్యమైనపుడు క్యాడర్‌తో కలిసి శత్రువులతో తలపడ్డాడు. బహిరంగసభలపై శత్రువులు దాడి చేసినపుడు.. వేదికపైనున్న మైక్‌ స్టాండ్‌నే గదాయుధంగా ధరించి, భీముడిలా రంగంలో దూకి వైరిమూకలను పరుగులెత్తించిన ఘటనలనేకం..!

ఇలాంటి సందర్భాలను దృష్టిలో ఉంచుకునే కొందరు ”ఏమిటి బి.ఎన్‌… మీలాంటి నాయకులు సామాన్య కార్యకర్తవలే ముష్టియుద్ధాలకు దిగడం మర్యాద కాదు” అని పలు సందర్భాలలో సున్నితంగా గుర్తు చేసేవారు. వారికి ఆయన సమాధానం మాత్రం కటువుగానే ఉండేది. ‘ఇది కమ్యూనిస్టుపార్టీ.. ఇక్కడ క్యాడరేందీ లీడరేందీ…

కార్యకర్తలు నెత్తురోడుతుంటే నాయకుడు సురక్షిత స్థావరాల్లో సేదదీరడమేం న్యాయం?’ అని ఎదురు ప్రశ్నించేవాడు. సుందరయ్య నేతృత్వంలో, దేవులపల్లి సహచర్యంలో రాటుదేలిన విప్లవకారుడతడు… అలాకాక ఇంకెలా ఉంటాడు….! సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, అఖిల భారత ఉపాధ్యక్షునిగా సుధీర్ఘకాలం పని చేసిన బి.ఎన్‌…

మొదట పీడీఎఫ్‌ తరపున, ఆ పైన సీపీఐ(ఎం) తరుపున రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. పారే నదీ జలాలన్నీ పంటభూములు తడపాలన్నదే లక్ష్యంగా చట్టసభల్లో కొట్లాడాడు. బీబీనగర్‌-నల్లగొండ రైల్వే లైన్‌, శ్రీరాంసాగర్‌ రెండవదశ కాల్వల నిర్మాణాలు ఆయన పోరాట ఫలితాలే. అది ప్రజాక్షేత్రమైనా, పార్ల మెంటయినా ఏడు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఆయన బతుకంతా పోరాటమే.

అభిమానులే తప్ప ధనం కూడబెట్టని త్యాగధనుడు

రాష్ట్రంలో బలమైన కమ్యూనిస్టు నేతగా, సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా పేరొందిన బి.ఎన్‌… కన్ను మూసేనాటికి తనకంటూ ఏమీ మిగుల్చుకోని ఓ నిరుపేద… కానీ పోరాడే యోధులకు మాత్రం తరగని సంపద. కారణం… బి.ఎన్‌. అనేక అనుభవాల కూడలి… వేల దారుల్లో ఏ వైపుకెళ్లినా ఎదురొచ్చే జ్ఞాపకం… ఆ జ్ఞాపకాల వెంట నడిస్తే చాలు… అవి మన గుండెల్లో ఉద్వేగం నింపుతాయి.. నరాల్లో ఉత్తేజం నింపుతాయి.

Related posts

వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన ఆహారం అందించాలి

Murali Krishna

స్పందన ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి

Satyam NEWS

బిల్లు కోసం వేధించిన కొటెక్ మహేంద్ర బ్యాంకుకు జరిమానా

Satyam NEWS

Leave a Comment