38.2 C
Hyderabad
May 2, 2024 22: 12 PM
Slider కడప

మేధావులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

#CPMKadapa

ఢిల్లీ అల్లర్ల కేసులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రముఖ ఆర్థిక వేత్త జయతిఘోష్‌, ఇతర విద్యావేత్తలు, మేధావులను అక్రమ కేసులో ఇరికించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందని కడప సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మనోహర్, రామమోహన్ డిమాండ్ చేశారు.

సోమవారం నాడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కడప పాత బస్టాండ్ లో ఉన్న సిపిఎం కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ రాజధానిలో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో పోలీసులు తాజాగా దాఖలుచేసిన అనుబంధ ఛార్జిషీటులో సీతారాం ఏచూరి, ఆయనతో పాటు జయతీ ఘోష్‌, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అపూర్వనందన్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ రాహుల్‌ రారు, స్వరాజ్‌ అభియాన్‌ నాయకుడు యోగేంద్ర యాదవ్‌ల పేర్లను కూడా జాబితాలో చేర్చారన్నారు. 

ఈ అల్లర్లకు సంబంధించి పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) లకు నిరసనగా దేశవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలే ఢిల్లీ అల్లర్లకు దారితీశాయని ఆరోపిస్తూ అందులో పాల్గొన్న వామపక్షాల నాయకులు, మేధావులు, విద్యావేత్తలపై కేసులు పెట్టడానికి కేంద్ర సర్కారు కుట్ర పన్నిందన్నారు.

కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వారన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు శాంతియుతంగా జరుగుతున్న రాజకీయ నిరసనను నేరపూరిత చేయడం ఆపాలని వారు డిమాండ్ చేశారు.

బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయించి వారిని బెదిరించేందుకు క్రూరమైన చట్టాలను బనాయించడం పోలీసు వ్యవస్థలో భాగం అయిపోయిందని వారన్నారు. దీనికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పెద్దలు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

ఢిల్లీ పోలీసులు తమ రాజకీయ యజమానులకు తొత్తులుగా వ్యవహరిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కడప జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు.  తక్షణమే కేంద్ర హోమ్ మంత్రి తమ పదవికి రాజీనామా చేయాలని,  మేధావుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

కడప జిల్లాలో ఉన్న వామపక్ష శక్తులు ప్రజాతంత్ర వాదులు లౌకిక శక్తులు ఇలాంటి కుట్రకేసులను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రజాతంత్ర శక్తులు లౌకిక వాదులు ఏకమై పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు  దస్తగిరి రెడ్డి, సిపిఎం నాయకులు చంద్రారెడ్డి విశ్వనాథ్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

Satyam NEWS

కోటి దీపోత్సవంలో పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే

Satyam NEWS

యాంటీ వైరస్: కరోనాకు విరుగుడుగా గబ్బిలం మాంసం

Satyam NEWS

Leave a Comment