దేశంలో అంటరానితనం, కులవివక్ష, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు కల్పించిన రిజర్వేషన్లను కొనసాగించాలని, వాటిని తొలగించే సాహసం చేయరాదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య అన్నారు.
పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్ల దామాషా పెంచాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నేడు కొల్లాపూర్ లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భజరంగ్ దళ్ ఆర్ ఎస్ ఎస్, వి.హెచ్.పి లాంటి మతతత్వ శక్తులకు తలొగ్గి బడుగు, బలహీన, పీడిత, మైనారిటీ వర్గాల పై సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని అన్నారు.
ఆ వైఖరిని మార్చుకోవాలని చెన్నయ్య సూచించారు. దళితుల పై అత్యాచారాలను అఘాయిత్యాలను అరికట్టాలని లేనిపక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను జాగృతం చేసి సమన్వయ పరచుకుని దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
రాజ్యాధికారం కోసం పోరాడతామని చెన్నయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లిపెద్ది చంద్రశేఖర్, జాతీయ ప్రధాన కార్యదర్శి వడాల భాస్కర్ , వనపర్తి జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు మేడం రంజిత్, దశరథం, అవుట స్వామి, రామ్ చందర్ బీజ ఎం పి టి సి, అర్జున్, కలమంద చెన్నయ్య, కృష్ణయ్య, కలమంద కురుమయ్య, ఇండ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.