నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరితీసేందుకు ఇద్దరు తలారులను పంపించాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకూ జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైలులో చనిపోయే వరకూ వారిని ఉరి తీయాలని పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు దోషులు ముఖేశ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్(31)లకు అదనపు సెషన్స్ జడ్జి సతీశ్ కుమార్ అరోరా డెత్ వారెంట్లు జారీ చేశారు. నిర్భయ దోషులు నలుగురిని ఒకేసారి ఉరి తీసేందుకు మీరట్, లక్నో సెంట్రల్ జైళ్ల నుంచి ఇద్దరు తలారులను ఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించాలని కోరుతూ తాము యూపీ జైళ్ల శాఖ డైరెక్టరు జనరల్ కు లేఖ రాశామని తీహార్ జైలు సీనియర్ అధికారి వెల్లడించారు.