40.2 C
Hyderabad
May 5, 2024 15: 50 PM
Slider సంపాదకీయం

మద్యంపై మళ్లీ మారనున్న జగన్ ప్రభుత్వం పాలసీ?

#jagan

రాష్ట్రంలో మద్యం షాపులు మళ్లీ ప్రైవేటుకే అప్పగించేందుకు జగన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. మద్యం విధానంపై సుస్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు ‘ బ్యాక్ టు స్వ్కేర్ వన్’ లాగా మళ్లీ మద్యం షాపులను ప్రయివేటు వారికే అప్పగించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ మద్యం పాలసీపై తరచూ నిర్ణయాలు మార్చుకుంటున్నారు. మద్యం షాపులను తగ్గించేందుకు మద్యం షాపుల్ని ప్రయివేటు వ్యక్తుల నుంచి తీసేసి ప్రభుత్వమే అమ్మే విధానాన్ని ఆయన ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ షాపులు అయినా కూడా డిజిటల్ పే మెంట్స్ తీసుకోకుండా కేవలం క్యాష్ తోనే అమ్మకాలు సాగించారు.

దాంతో ఈ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేవలం క్యాష్ తోనే అమ్మకాలు సాగించడం వల్ల ఇదంతా నల్లధనంగా మారుతున్నదని విమర్శలు ఉన్నాయి. అయితే జగన్ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోలేదు. క్యాష్ ద్వారానే అమ్మకాలు సాగించారు. మద్యం అమ్మకాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది. మద్య నిషేధం మాట అటుంచి మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోబోతున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ దుకాణాలు ఎత్తేసి మద్యం వ్యాపారాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగిస్తే, భారీగా ఆదాయం ఆర్జించవచ్చని భావిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న అమ్మకాలకన్నా కనీసం రెట్టింపు అమ్మవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

ప్రయివేటు వ్యాపారులు అయితే బెల్టు షాపులు పెట్టుకుని మరీ మద్యం అమ్మకాలు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది. అందుకే ఈ విధానానికి మళ్లీ మారాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పైగా ఎంతో మంది వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం వ్యాపారంలో ఉన్నారు.

వారంతా ప్రభుత్వమే వ్యాపారం చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ మద్యాన్ని ప్రయివేటు వారికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటే సొంత పార్టీ వ్యాపారులను కూడా సంతృప్తి పరచవచ్చునని అనుకుంటున్నారు. మద్యం అమ్మకం షాపులను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే విషయంపై మూడు రోజుల కిందట జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

గత ఆర్థిక సంవత్సరంలో 25 వేల కోట్ల విలువైన మద్యం విక్రయించి దాదాపు 20 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించింది. మద్యం వ్యాపార పరిమాణం ఇంకా చాలా ఎక్కువగా ఉన్నా సరిగ్గా రాబట్టలేక పోతున్నామనే భావన ఎక్సైజ్‌ వర్గాల్లో ఉంది దుకాణాల నిర్వహణను ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తే కమీషన్‌ సొమ్ము కోసం వివిధ మార్గాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నారు.

పూర్తిగా వృత్తి నైపుణ్యంతో వ్యాపారం చేస్తారని, బీర్ల చల్లదనం కోసం కూలర్ల ఏర్పాటు, అవసరమైన ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోగలరని, పర్మిట్లు రూమ్‌ల వంటివి వస్తాయని, వీటన్నింటి వల్ల మద్యం మరింత ఎక్కువగా అమ్ముడువు తుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నెలకు 19 వందల కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. అదే ప్రైవేటుకు దుకాణాలు అప్పగిస్తే నెలకు కనీసం 3 వేల కోట్ల విలువైన మద్యం అమ్మొచ్చనేది అబ్కారీ శాఖ అంచనా. మద్యం దుకాణాల్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తూ విధానాన్ని ప్రకటిస్తే దరఖాస్తు రుసుము, లైసెన్సు ఫీజులు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల రూపంలో ఇప్పటికప్పుడు వెయ్యి కోట్ల రూపాయిలకు పైగానే ఆదాయం సమకూరుతుందని అంచనా.

గతంతో పోలిస్తే మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగానే పెరిగినా విక్రయాల పరిమాణం మాత్రం తగ్గింది. వాస్తవంగా రాష్ట్రంలో మద్యానికి డిమాండ్ బాగున్నా ఆ మేరకు అమ్మకాల పరిమాణం పెరగడం లేదని ప్రభుత్వం భావిస్తున్నది.

ఈ పరిస్థితుల్లో ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని భావిస్తున్న ఎక్సైజ్‌ శాఖ ప్రైవేటు దుకాణాల్ని తెరపైకి తెస్తోంది. అన్ని బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు అధికంగా ఉండటం, నాటుసారా తయారీ, వినియోగం విపరీతంగా పెరగడం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా,గోవా నుంచి సుంకం చెల్లించని మద్యం రాష్ట్రంలోకి పెద్దఎత్తున అక్రమంగా రవాణా అవుతుండటం, ఓ మాదిరి,ఖరీదైన బ్రాండ్లు తాగేవారిలో ఎక్కువ మంది ప్రభుత్వ దుకాణాల్లో మద్యం కొనడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడం లాంటి కారణాలతో ఏపీలో అమ్ముడవుతున్న మద్యం పరిమాణం తక్కువగా ఉంటోందనేది ఎక్సైజ్‌ శాఖ అభిప్రాయం. అందువల్ల ప్రైవేటుకు దుకాణాలు అప్పగిస్తే ఎక్కువ ఆదాయం రాబట్టుకోనే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాల ఆలోచనగా తెలుస్తోంది.

Related posts

పోలీసుల్ని కొట్టినా ఫర్వాలేదా?

Satyam NEWS

ఏపీ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ లో ఉత్త‌రాంద్ర వాసి….!

Satyam NEWS

కేసీఆర్ ను తరిమి తరిమి కొట్టేందుకే రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్ర

Satyam NEWS

Leave a Comment