29.7 C
Hyderabad
May 1, 2024 04: 37 AM
Slider సంపాదకీయం

పోలీసుల్ని కొట్టినా ఫర్వాలేదా?

#telanganapolice

పోలీసులపై తెగబడి దౌర్జన్యం చేస్తున్నా కూడా వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల, ఆమె తల్లి వై ఎస్ విజయలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తున్నది? ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. ఈ రోజు షర్మిల, ఆమె తల్లి విజయలక్ష్మి పోలీసులను నేరుగా కొట్టారు. తమను అరెస్టు చేయబోతున్న పోలీసులను తొయ్యడం లేదా నిలువరించడానికి ప్రయత్నించడం రాజకీయ నాయకులు సాధారణంగా చేస్తుంటారు. అలా కాకుండా పోలీసుల చెంపపై కొట్టడం ఇప్పటి వరకూ జరగలేదు.

కారణాలు ఏవైనా పోలీసులనే కొట్టడం అంటే తీవ్రమైన విషయం. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు. షర్మిలపై కేసు పెట్టడానికే పోలీసులు మల్లగుల్లాలు పడ్డారు. మహిళా పోలీసులపైనే కాకుండా ఒక ఎస్ ఐ పై కూడా షర్మిల చెయ్యి చేసుకోవడం వీడియోలలో స్పష్టంగా కనిపించింది. అదే విధంగా ఆమె తల్లి విజయలక్ష్మి కూడా ఒక పోలీసును చెంపపై కొట్టిన వీడియోలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

అయినా పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం దేనికి సంకేతం? అన్ని విషయాలను రాజకీయ కోణంలో చూస్తూ పోతే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం అసాధ్యం అవుతుంది. షర్మిలను అరెస్టు చేయాలా వద్దా విజయలక్ష్మిని అరెస్టు చేయాలా వద్దా అని పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉంటుంది. పోలీసు వ్యవస్థను రాజకీయ కారణాలకు వాడుకోవడం లేదా పోలీసుల విధి నిర్వహణలో రాజకీయ ప్రయోజనాలు జొప్పించడం ప్రభుత్వానికి కూడా మంచిది కాదు.

ఏపిలో ఉన్న ప్రభుత్వంతో సఖ్యతతో ఉన్నందుకు అక్కడి ముఖ్యమంత్రి సోదరి, తల్లిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతున్నదా? లేక ఏపి నుంచి వత్తిడి వచ్చి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆగిపోయారా? అనే విషయాలు స్పష్టం కావాల్సి ఉంది. ఇవన్నీ కాకపోతే మరో రాజకీయ కోణం పై కూడా చర్చ జరుగుతున్నది. షర్మిలను, ఆమె తల్లిపైన కఠిన చర్యలు తీసుకుంటే వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారా?

గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ షర్మిల పార్టీ గురించి పట్టించుకోవద్దని, ఆమె చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేయవద్దని తన పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి. చివరకు షర్మిల పాదయాత్రలో మంత్రులను సైతం వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి వచ్చారు. అయినా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా రాజకీయ అవసరాలు, రాజకీయ ప్రాధాన్యతలతో శాంతి భద్రతలను నిర్వహించాల్సిన పోలీసులను నిలువరిస్తే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది. పోలీసులను కొట్టే స్థాయికి నాయకులు రావడం మాత్రం మంచి పని కాదు. ఈ చర్యలను ఉపేక్షిస్తూ కూర్చుంటే పోలీసులకు ఇక విలువ ఉండదు.  

Related posts

నో ఫ్రీడమ్:బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టి మహిళపై అత్యాచారం

Satyam NEWS

యాసంగి వరి ధాన్యం కొనాల్సిందే : జుక్కల్ ఎమ్మెల్యే షిండే

Satyam NEWS

ప్రభుత్వానికి మంచి పేరు రావడంలో ఎంపీఓ ల కృషి ఎంతో ఉంది

Satyam NEWS

Leave a Comment