32.2 C
Hyderabad
May 2, 2024 01: 28 AM
Slider ప్రత్యేకం

కేసీఆర్ ను తరిమి తరిమి కొట్టేందుకే రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్ర

#bandisainjai

తెలంగాణలో కేసీఆర్ పాలనను తరిమికొట్టేదాకా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అమ్మవారి టెంపుల్ పూజలు చేసిన అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు.

జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద జరిగిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గడప గడపకూ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడంతోపాటు కేసీఆర్ అరాచక, నయా నిజాం పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి చైతన్యం చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే జోగులాంబ అమ్మవారి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

రంజాన్ తరహాలోనే అయ్యప్ప, శివ, హనుమాన్ భక్తులు మాల ధారణ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకునేలా వెసులు బాటు కల్పిస్తూ ప్రత్యేక జీవోలిస్తామని స్పష్టం చేశారు. పాదయాత్ర కేసీఆర్ భాగోతాన్ని బయటపెడతానని… అవినీతి టీఆర్ఎస్ పాలకులను నిద్రపోనివ్వనని హెచ్చరించారు.

జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు

బీజేపీ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకుని అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు.  బండి సంజయ్ రాకను పురస్కరించుకుని ఆకాశాన్ని అంటేలా బాణా సంచా కాల్చి కార్యకర్తలు వేదికపైకి స్వాగతం పలికారు. వేలాది మంది కార్యకర్తల నినాదాలు, సంబురాలతో కోలాహలంగా మారిన సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.

ఈ సమావేశానికి బండి సంజయ్ తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,  ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, గరికపాటి రామ్మోహన్ రావు సహా పలువురు సీనియర్ నేతలు, రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు.

అమ్మల ఆశీర్వాదంతోనే…..

బండి సంజయ్ మాట్లాడుతూ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదంతో మొదటి విడత పాదయాత్ర విజయవంతం అయింది… ఈ రోజు జోగులాంబ అమ్మవారి పాదల చెంత నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం.  అక్కడ అమ్మవారే.. ఇక్కడ అమ్మవారే… అమ్మవార్ల ఆశీర్వాదంతోనే ముందుకెళ్తున్నం.అని బండి సంజయ్ అన్నారు.

ఈ స్థలం ఎంతో శక్తివంతమైనది. భారత దేశంలో పవిత్రమైన అష్టాదశ శక్తి పీఠాల్లో జోగులాంబ క్షేత్రం కీలకమైనది. అమ్మవారిని దర్శించుకుంటే నాకు వైబ్రేషన్స్ వచ్చినయ్.. కేసీఆర్ బట్టలు చింపుకునే హిందువునని అంటాడు కదా… మరి జోగులాంబ తల్లి ఏం తప్పు చేసింది? ఇక్కడి ప్రజలు చేసిన పాపమేంది? అని ప్రశ్నించారు.

కర్ణాటకలో  మైసూరులోని చండీమాత అమ్మవారు, విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆలయాల్లో అధికారికంగా దసరా ఉత్సవాలు జరుగుతయ్. కానీ అష్టాదశ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి దగ్గర మాత్రం ప్రభుత్వం ఉత్సవాలు జరపదు. ఎందుకు? మీరు ఎట్లాగు చేయరు, బీజేపీ అధికారంలోకి వచ్చాక దసరా ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహిస్తాం అని అన్నారు.

హిందువులను చంపుతామన్నా పట్టించుకోవడం లేదు

కేసీఆర్ కు మైనారిటీలంటే భయం… ఆయనను వదిలిపెట్టను. 15 నిమిషాలు సమయమిస్తే.. ఈ దేశంలోని హిందువులందరినీ చంపుతానన్న ఎంఐఎం నేతపై సాక్షాధారాలను ప్రభుత్వం సమర్పించకపోవడంవల్లే కేసు కొట్టేసింది. అయినా ఎంఐఎం నేతను వదిలిపెట్టే ప్రసక్తే లేదు… కేసులు తిరగదోడుతాం…  ఛత్రపతి శివాజీ మహారాజ్  దర్శించుకున్న స్థలం ఇది… ఈ పవర్ ఫుల్ టెంపుల్ నుండి రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కూడా స్టార్ట్ చేస్తున్నంమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పష్టం చేశారు.

శివాజీ మహారాజ్ ఎట్లయితే హిందూ ద్రోహుల తల నరుక్కుంటా పోయిండో…. మనం అవినీతి-నియంత-కుటంబ పాలనను అంతం చేసేందుకు కంకణం కట్టుకుని బయలుదేరుతున్నం….  ఏయ్ సీఎం.. మమ్మల్ని మతోన్మాదులు అంటావా… మైనార్టీ ఓట్లకోసం హిందు సమాజాన్ని, హిందూ దేవాలయాలకు అవమానం చేస్తుంది నువ్వు కాదా. కేసీఆర్ హిందూ ద్రోహి….అని ఆరోపించారు.

రంజాన్, బక్రీద్ కోసం అయితే నమాజ్ కోసం, ఇఫ్తార్ కోసం స్పెషల్ పర్మిషన్ల కోసం జీవో లు ఇస్తావు…మరి నా అయ్యప్ప, శివ, హనుమాన్ భక్తులు ఏం చేశారు? నా అయ్యప్ప స్వాముల కోసం, హనుమాన్ మాల భక్తుల కోసం, శివ భక్తుల, అమ్మవారి భక్తుల కోసం భిక్షకు టైం ఇవ్వవు. దీక్ష తీసుకున్నోళ్లు డ్యూటీకి, స్కూలుకు రావద్దని అంటున్నావు…ఇంకెందుకీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.

ఒక కొత్త ప్రాజెక్టు కూడా కట్టలేదు

ఈ ఏడేళ్ల ఒక్క ప్రాజెక్టైనా కొత్తది కట్టావా అని ప్రశ్నించారు.ఈ వేదిక నుండే నీ చెబుతున్నా….. నీ పతనాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని.. నిన్ను  నీ పార్టీని కట్టకట్టి ప్రజలు తుంగభద్రలో పడేటం ఖాయమని బీజేపీ ఆధ్యక్షుడు జోస్యం చెప్పారు. మొదటి ప్రజాసంగ్రామ యాత్రతలో ఉచిత విద్యా, వైద్యం అందిస్తాం అని ప్రకటించాం…. ఈ జోగులాంబ అమ్మవారి పాదాల సాక్షిగా రెండో దఫా ప్రజాసంగ్రామ యాత్ర సాక్షి గా చెబుతున్న మేం అధికారంలోకి రాగానే పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తాం…పల్లెలన్నీ తిరుగుతాం… పట్టణాలు తిరుగుతాం… సమస్యలను తెలుసుకుంటాం… కల్వకుంట్ల ప్రభుత్వ అరాచక ప్రభుత్వాన్ని అంతమొద్దిద్దాం…. మీరు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటు చేస్తామన్నారు. “నా యాత్ర ఆగదు… ప్రజల బతుకుల్ని ఆగం చేసిన నిన్ను నిద్రపోనివ్వ…పాలమురు బిడ్డల్లారా ఇదే ఆఖరిపోరాటం… పాలమూరు వలసలు ఆగాలంటే… పడావుపడ్డ భూములు పచ్చ పడాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే… బీజేపీ అధికారంలోకి రావాల్సిందే… నడవండి… మాతో కదలిరండి… ఈ సంగ్రామ యాత్రతో మన ఆశయాలను సాధిద్దాం… భారత్ మాతాకీ జై అంటూ ప్రసంగం ముగించారు.. బండి సంజయ్.

Related posts

హైదరాబాద్‌ కు చెందిన ప్రాక్టికల్లీ ఫ్రీ టీచర్ యాప్‌ ప్రారంభం

Satyam NEWS

మారుమూల ప్రాంతాల ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS

మై లార్డ్: చట్టంతో ఆడుకుంటున్న నిర్భయ దోషులు

Satyam NEWS

Leave a Comment