తెలంగాణ సర్కార్ ఖర్చులేని కార్యం చేసింది.ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్డీఓ కార్యాలయాన్ని వేములవాడలో ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.రెవిన్యూ డివిజన్ కు అన్ని అర్హతలు ఉన్న వేములవాడ కు ఈ నిర్ణయం శుభవార్తే .ముఖ్యం గా స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు వెలువడటం తో ఆయనకుబర్త్డే గిఫ్ట్ దక్కినట్లయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు నుంచి 30 రోజుల్లో ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు రెవెన్యూ అధికారులకు అందించాలని లేనిపక్షంలో 30 రోజుల అనంతరం వేములవాడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కొత్తగా ఏర్పాటు చేసే వేములవాడ రెవెన్యూ డివిజన్‌లలో వేములవాడ, వేములవాడ (రూరల్), బోయిన్‌పల్లి, చందుర్తి, కోనారోపేట్, రుద్రంగి మండలాలతో కూడిన రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సంకల్పించింది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు
కాగా వేములవాడ లో ఇప్పటికే అన్ని కార్యాలయాలు ఉండగా ఒక్క ఆర్డీఓ కార్యాలయం మాత్రమే లేదు ఆ అధికారి కూడా లేదు.ఈ కార్యాలయం సిబ్బంది జీతభత్యాలు కార్యాలయం మినహా ప్రభుత్వాన్ని అదనంగా పెట్టాల్సిన ఖర్చు ఏమి లేక పోవడం ఈ ఏర్పాటు ప్రజలకు సౌలభ్యంగా ఉండటం శుభసూచకం.