39.2 C
Hyderabad
May 3, 2024 14: 56 PM
Slider సంపాదకీయం

వన దేవతల ఉనికిని ప్రశ్నిస్తున్న వాచాలుడు

#chinajeyar

వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాజగురువుగా ఉన్న చిన జియర్ స్వామి వనదేవతలపై నోరు పారేసుకోవడాన్ని తెలంగాణ సమాజం భరించలేకపోతున్నది. ఐదేళ్ల కిందటో పదేళ్ల కిందటో మాట్లాడాడు… ఇప్పుడు గొడవలేమిటి? అంటూ ఆయన భక్తులు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చు.

ఇది మరీ దరిద్రమైన అంశం. ఎందుకంటారా? పదేళ్ల కిందట వనదేవతలను కించపరిచిన చిన జియర్ ను నెత్తిన పెట్టుకున్న తెలంగాణ నాయకులను కూడా, వారి నిజాయితీని కూడా ఇప్పుడు శంకించాల్సి వస్తుంది. పాత విషయం కదా పాతరేద్దాం అనుకోవడానికి కుదరదు.

ప్రమాదకమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిగా చిన జియర్ విషయంలో రుజువైంది. వనదేవతలైన సమ్మక్క సారక్కలను ‘వారు ఎవరు?’ అంటూ ప్రశ్నించడంతో చిన జియర్ స్వామిని చిన్న జియర్ గానే పైన రాశాను. గమనించండి. అంటే సమ్మక్క సారలమ్మలను ప్రశ్నించిన చిన జియర్ తనకు ఉన్న స్వామి అనే గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.

ద్వైతం, అద్వైతం పై తెలిసి తెలియని వ్యాఖ్యలు చేసిన చిన జియర్ తత్ సంబంధిత విషయాలపై అవగాహన ఉన్న వారి నుంచి ఇటీవల తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. రామానుజుడి విగ్రహాన్ని ఆయన పుట్టిన ప్రాంతంలోనే ఇంత పెద్దది పెట్టలేదు. హైదరాబాద్ లో ఆయన విగ్రహాన్ని పెట్టడంపై ఎంతో మంది ప్రశ్నించినా, పోనీలే ఏదో స్వామి చేసుకుంటున్నాడు అంటూ చాలా మంది సరిపెట్టుకున్నారు.

అక్కడున్న రియల్ ఎస్టేట్ పెద్దలకు సాయం చేసేందుకే ఇలా విగ్రహం పెట్టాడని అందరికి తెలిసినా కూడా పైకి ఎవరూ మాట్లాడలేదు. సమాజంలోని ఎంతో మంది పెద్దలు మౌనంగానే ఉండిపోయారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊతం ఇచ్చే విధంగా తెలంగాణ అసెంబ్లీలో త్రిబుల్ వన్ జీవోను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత మరి కొంత మందికి కూడా రూఢి అయింది.

ముచ్చింతలలో రామానుజుడి విగ్రహం ఎందుకు వచ్చిందో. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందులో లాభాలు వచ్చే వరకూ కూడా ఆగకుండా రామానుజుడి విగ్రహం చూడాలంటే 150 రూపాయల టిక్కెట్ పెట్టినప్పుడే అర్ధం అయింది. ఇది భక్తి కాదు వ్యాపారం అని. యాగ శాలలో ప్రవేశానికి 60 వేల రూపాయల ఫీజు వసూలు చేసినప్పుడు చాలా మందికి అర్ధం కాలేదు….ఇప్పుడు అందరికి అర్ధం అవుతున్నది.

ఈ రియల్ ఎస్టేట్ చిన జియర్ అద్వైతం పై మాట్లాడినప్పుడు కేవలం మేధావులే స్పందించారు. చిన జియర్ కు విషయం లేదు అని నిర్ధారించారు. కౌరవ సభలో ద్రౌపదికి చీరలు ఒలిచే సందర్భాన్ని మహిళలు కూడా ఉన్న సమావేశంలో ఎంతో వివరంగా చెప్పినపుడు చాలా మంది భక్తితో విని తరించారు కానీ దాని వెనక ఉన్న చిన జియర్ వెకిలితనాన్ని గుర్తించలేకపోయారు.

ఇప్పుడు చిన జియర్ తెలివితేటలు బట్టబయలు అయ్యాయి. ప్రకృతి ఆరాధకులు గిరిజనులు. ప్రకృతిపై బతికే వారు ప్రకృతిని ప్రేమిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భక్తిని వాడుకునే వారు ప్రకృతిని ప్రేమించలేరు… ఆరాధించలేరు. ముచ్చింతల ప్రాంతంలో ఉన్న చెట్లను నరికి రోడ్లేసిన వారికి, ముచ్చింతలో ఉన్న పొలాలను పూడ్చేసి కారు పార్కింగ్ లు చేసిన వారికి, పొలంగట్లను చెరిపేరి తారు రోడ్లు వేసిన వారికి ప్రకృతి గురించి తెలిసే అవకాశమే లేదు.

అందుకే చిన జియర్ ప్రకృతి దేవతలను ఇంత దారుణంగా అవమానించాడు. సమ్మక్క సారలమ్మలు అంటే అవి రామానుజుడిలా విగ్రహాలు కాదు…. ప్రకృతిలో భాగాలు… చెట్టు చేమ. చైనాలో తయారు చేయించి తెచ్చిన విగ్రహం కాదు. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా అక్కడిదాకా వెళ్లి కొన్ని కోట్ల మంది ఆరాధించే సమ్మక్క సారలమ్మలు నిజంగా బ్రహ్మలోకం నుంచి దిగివచ్చిన వారే.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారికి కొమ్ము కాసే చిన జియర్ లు మాత్రం కచ్చితంగా బ్రహ్మలోకం నుంచి వచ్చిన వారు మాత్రం కాదు. దేవుడి విగ్రహాన్ని పక్కన పెట్టుకుని పదవిలో ఉన్న మానవులను ఎంతో గొప్పగా పొగిడిన చిన జియర్ మాత్రం మరింత కచ్చితంగా బ్రహ్మలోకం నుంచి వచ్చిన వాడైతే కాదు.

సమ్మక్క సారలమ్మల గద్దెల వద్దకు చదువుకున్న వాళ్లు కూడా వెళుతున్నారని చిన జియర్ ఆశ్చర్యపోతున్నాడు. నిజమే… చదువుకున్న వారు తన వద్దకు కదా రావాల్సింది… వ్యాపారులు తన వద్దకు కదా రావాల్సింది. అక్రమ సంపాదన ఉన్న వారు తన వద్దకు కదా రావాల్సింది.. వీరినే కదా చిన జియర్ టార్గెట్ చేసుకున్నది? చిన జియర్ టార్గెట్ లోని చదువుకున్న వారు మాత్రమే సమ్మక్క సారలమ్మల వద్దకు వెళుతున్నారు.

నల్లవ్యాపారులు, అక్రమంగా వేల కోట్లు సంపాదించిన వారు చిన జియర్ తోనే ఉన్నారు. అందువల్ల చిన జియర్ వనదేవతల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన జియర్ తాను ఐదేళ్ల కిందటో పదేళ్ల కిందటో చెప్పిన ఈ మాటలకు గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. అంతే కాదు.

సమ్మక్క సారలమ్మ గద్దెల వరకూ వెళ్లి మొక్కు చెల్లించి ముక్కు నేలకు రాయాలి. అప్పుడు కానీ ఈ చిన జియర్ ను తెలంగాణ సమాజం క్షమించదు. అలా కాకుండా తన వెనుక ప్రధాన మంత్రి ఉన్నాడు… ముఖ్యమంత్రి ఉన్నాడు అని అహంభావం ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక్క చిన జియర్ మాత్రమే కాదు… అతడిని కాపాడే వారికి కూడా ఈ పాపంలో వాటా దక్కి తీరుతుంది.

Related posts

కరోనా రోగుల్ని దోచుకున్న డెక్కన్ ఆస్పత్రిపై చర్యలు

Satyam NEWS

అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష

Bhavani

యువత మత్తు జోలికి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుందాం

Satyam NEWS

Leave a Comment