42.2 C
Hyderabad
May 3, 2024 15: 54 PM
Slider ప్రత్యేకం

తెలంగాణ లో ఆశ… ఆంధ్రాలో… ఇంకా నిరాశే

#revanthreddy

” ఈడా ఉంటా.. ఆడా ఉంటా..నేను తెలుగుజాతి లెక్క.” అంటాడు గోన గన్నారెడ్డి పాత్రధారి రాణీ రుద్రమదేవి సినిమాలో. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చక్రం తిప్పవచ్చని పగటికలలు కన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రస్తుతం ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే వాటి ఉనికిని కాపాడుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాయి. తెలంగాణలో తెలుగదేశం, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రజలకు దూరంగా వెళ్లిపోయాయి.

దీనికి కారణం ఆయా పార్టీలు చేసుకున్న స్వయం అపరాధాలేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ సమాజం గుర్తించి తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని ఆశించి, భంగపడింది. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలలో కొందరు తెరాస లో చేరిపోవడం, వరుసగా రెండు సార్లు జరిగిన శాసన సభ ఎన్నికలలో కూడా అధికారం దక్కించుకోలేకపో యింది.

తెలంగాణ లో పోరాటం కొనసాగిస్తున్న కాంగ్రెస్

ప్రస్తుతం భాజపా జోరు ముందు పోటీ పడడానికి తల మునకలవుతోంది. తెరాస, భాజపా కలిసి నాటకాలు ఆడుతున్నారని, అంతర్గతంగా రెండు పార్టీల మధ్య రహస్య ఎజెండా ఉందని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆరోపిస్తోంది. ప్రస్తుతం  తెలంగాణలో వడ్లు కొనుగోలు అంశం కేంద్రంగా జరుగుతున్న రైతు మద్దతు కార్యక్రమంలో ఆ పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, కరెంట్ చార్జీల పెంపు పై కాంగ్రెస్ ఇటు రాష్ట్రం, అటు కేంద్రప్రభుత్వం పై క్షేత్రస్థాయి పోరాటం సాగిస్తోంది.

రానున్న శాసన సభ ఎన్నికలలో తెరాస,భాజపా లకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒకటేనని ఆ పార్టీ నమ్మ బలుకుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో ఆధిపత్య పోరు మొదటి నుంచి ఉన్నదే. జిల్లాలలో పట్టు ఉన్న నేతలు తమ మాటే చెలామణి కావాలని పీసీసీని సైతం ధిక్కరించడం ఆ పార్టీ నైజం.

అసమ్మతి సర్దుమణిగినట్లు కనిపించినా….

రాష్ట్రంలో పార్టీకి చెందిన సీనియర్ నేతలు అనేకమంది ఉండగా తెదేపా నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం పై చాలా మంది ఇప్పటికీ గుర్రుగా ఉన్నారు. ఢిల్లీ స్థాయి అగ్రనేతలు బుజ్జగించడంతో ప్రస్తుతానికి సద్దుమణిగినట్టు పైకి కనిపించినా పార్టీలో అసమ్మతి సెగలు అలాగే ఉన్నాయి. రానున్న రెండేళ్లు పార్టీకి చాలా ముఖ్యం. ఒక వైపు తెరాస, మరోవైపు భాజపా లను ఎదుర్కోవడం అంత సులభం కాదని పరిశీలకుల భావన.

ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయం పరిశీలిస్తే…అక్కడ కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అధికార వై యస్ ఆర్ సీపీ, తెలుగుదేశం, బీజీపీ, జనసేన పార్టీలతో పోల్చితే కాంగ్రెస్ పార్టీకి జనాదరణ ఎలా ఉందో అంచనా వేయడం కూడా చాలా కష్టం. ఒకనాటి కాంగ్రెస్ నేతలు బొత్స, అంబటి వంటి వారు చాలా మంది వై ఎస్ ఆర్ సీపీ లో చేరడంతో ఆ పార్టీకి చురుగ్గా పనిచేయగల నేతలు కరువయ్యారు.

ఆనాడు…. హేమా హేమీలు…..

తులసిరెడ్డి, రఘువీరారెడ్డి, కేవీపీ, సుబ్బరామిరెడ్డి వంటి సీనియర్లు పార్టీకి అండగా ఉన్నా వారిని అనుసరించడానికి శ్రేణులు సిద్ధంగా లేవని ప్రచారంలో ఉంది. తెదేపా 5 ఏళ్ల పాలనలో గానీ, ప్రస్తుతం జగన్ మూడేళ్ల పాలనలో గానీ …ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయకపోవడం ఆ పార్టీ నిష్క్రియాపరత్వానికి నిదర్శనం. ఒకనాడు దక్షిణాది రాష్ట్రాలలో దేశానికి ఉద్దం డులైన ఒక నీలం, ఒక కాసు, ఒక వైయస్ లను అందించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నానాటికీ తీసికట్టుగా మారడం శోచనీయం.

ఒక అంచనా ప్రకారం…కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకోవడం అసాధ్యమని అంటున్నారు. ఒకనాటి కాంగ్రెస్ సానుభూతి పరులు, కాంగ్రెస్ అభిమానులు పార్టీకీ దూరం కావడంతో పార్టీకి సహజంగా ఉండిన 25- 30 శాతం సాంప్రదాయ ఓట్లు కూడా కాంగ్రెసేతర పార్టీల మధ్య చీలిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కంటే  తెలంగాణలో పార్టీ మెరుగ్గా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దే కార్యక్రమం చేపట్టక పోవడం విడ్డూరం కలిగించే అంశం.

తెలంగాణ లో కనిపించని తెలుగుదేశం

ఇక తెలుగుదేశం పార్టీ గురించి పరిశీలిస్తే…ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న దుస్థితినే తెలంగాణా లో తెదేపా అనుభవిస్తోంది. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ప్రచారం జరగడంతో ఆ పార్టీకి ప్రజాదరణ దూరమైంది. తెలంగాణ టీడీపీ నేతలు, శ్రేణులతో సహా తెరాస, కాంగ్రెస్ వైపు వెళ్లిపోవడంతో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఒకనాడు తెదేపా ను విశేషంగా ఆదరించిన తెలంగాణ ప్రజలు ఆ పార్టీ స్వయంకృతం కారణంగా దూరం పెట్టారు.  తెలంగాణలో తెదేపా ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు లేవన్నది  విశ్లేషకుల మాట. తెదేపా కు చెందిన ఓట్లను పలు పార్టీలు పంచుకున్నాయి.

ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా ఇప్పటికీ బలంగానే ఉంది. దాదాపు రాష్ట్రం అంతటా ఆ పార్టీకి క్షేత్రస్థాయి శ్రేణులు, అభిమానులు పార్టీతోనే ఉన్నారు. అధికార వైయస్ ఆర్ సీపీ తో పోల్చితే తెదేపా లోనే పార్టీ సిద్ధాంతాన్ని విశ్వసించే సీనియర్ నేతలు పార్టీకి అండగా ఉండడం విశేషం.

జగన్ ను ఎండగడుతున్న మీడియా

చంద్రబాబు తిరిగి ముఖ్య మంత్రి కావడానికి కావలసిన యంత్రాంగం, మంత్రాంగం సమకూర్చడంలో తెదేపా కు ఎవరూ పోటీ కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒక వైపు మీడియా, మరో వైపు సామాజిక మాధ్యమాలు తెదేపాకి మొదటి నుంచీ మద్దతు ఇవ్వడంతో… జగన్   ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండ గట్టడం, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకు పోవడం లాభిస్తోంది.

ఏ కోణంలో చూసినా వై ఎస్ ఆర్ సీపీ కి ధీటైన ప్రత్యామ్నాయ పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే నని, మిగిలిన పార్టీలు  జనసేన, బీజేపీ, కాంగ్రెస్ కు తరవాతి స్థానాలలో ఉంటాయని విశ్లేషకులు తెలపడం ఆసక్తి కలిగిస్తుంది.

అయితే…ఎన్నికలు జరిగే కాలం నాటికి అధికార వైయస్ ఆర్ సీపీని ఓడించడానికి ఎటువంటి రాజకీయ సమీకరణలు, ఒప్పందాలు, సరుబాట్లు, రాజీ తంత్రాలు చోటుచేసుకుంటాయి అనేది ఇప్పుడే ఊహించడం సహేతుకం కాదు.

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తెలంగాణ లో తెలుగుదేశం పార్టీకి, ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెప్పినట్లే అర్థం చేసుకోవాలి.

“ప్రస్తుత రాజకీయాలలో అధికారం కోసం  హత్యలూ, ఆత్మహత్యలతో పాటు ఎటువంటి దుర్మార్గమైనా జరగవచ్చు.”

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ సామాజిక విశ్లేషకుడు

Related posts

మంత్రి కేటీఆర్ పర్యటన కోసం ఖమ్మం పోలీసుల భారీ భద్రత

Satyam NEWS

కరోనా నుంచి కోలుకున్న డాక్టర్ మల్లు రవి

Satyam NEWS

అస్మదీయుల కోసం విద్యావిలువలకు తిలోదకాలు

Satyam NEWS

Leave a Comment