ఇటీవల పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ.ఎం.పి. డాక్టర్ మల్లురవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
అనునిత్యం ప్రజలతో ఉండే డాక్టర్ మల్లు రవి కి కరోనా పాజిటివ్ రావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడ చికిత్స పొందిన అనంతరం ఆయనకు మళ్లీ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేశారు.
వైద్యుల సూచనల మేరకు పది రోజులు కారోనా నిబంధనలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్ లో ఉండనున్నారు. ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఆయన మాట్లాడారు.
తన ఆరోగ్యం కోసం ఆందోళన చెందిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. క్వారంటైన్ సమయం పూర్తి అయిన తర్వాత మళ్లీ యథావిధిగా ప్రజాసేవలో పాల్గొంటానని ఆయన తెలిపారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను నిరంకుశ పద్ధతిలో ఆమోదించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నదని డాక్టర్ మల్లు రవి తెలిపారు.