28.7 C
Hyderabad
May 6, 2024 08: 18 AM
Slider కడప

చెరువులు, వంకలు, అలుగుల ఆక్రమణలు తొలగించండి..

#CPI Kadapa

కడప నగరాన్ని యూజీడీ మురికి తో కూడిన జలమయం నుండి కాపాడాలని, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం వెంటనే చూపాలని సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ డిమాండ్ చేశారు.

సోమవారం కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఐ నేతృత్వంలో ముంపు బాధిత ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. నగర పాలక,  అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) దురావస్థ వల్ల, నీటి కాలువలు, చెరువులు, అలుగుల ఆక్రమణల వల్ల సగం పైబడి కడప నగరం మురికి తో కూడిన జలమయం అవుతున్నదని వెంకట శివ ఆందోళన వ్యక్తం చేశారు.

మూడు గంటలపాటు కురుస్తున్న వర్షాలకే నగరంలోని జనజీవనం అతలాకుతలమౌతున్నదనీ పేర్కొన్నారు.10 ఏళ్ళ కిందట లేని ఈ నీటి ముoపు సమస్యతో చిన్నపాటి వర్షానికే దాదాపు సగం పైబడి డివిజనల్ లలో అనేక ప్రాంతాల్లో వేలాది ఇల్లులు నీట మునిగి ఆస్తి నష్టం జరుగుతున్నదన్నారు.

14,13, 12,11,10,48 డివిజన్ల పరిధిలో వర్షం వచ్చినప్పుడు జనం బాధలు వర్ణనాతీతమని, లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లమీద మురికి తో కూడిన వర్షపునీరు పాచి పట్టి దోమలకు నిలయంగా మారిందన్నారు. ఫకీర్ పల్లె బచ్చారావు చెరువు కు పాలకొండ నుండి ఆర్ట్స్ కాలేజ్  మీదుగా వచ్చే  వరద నీటి కాలువలు, అలుగు, దాదాపు 8 ఎకరాల చెరువు ఆక్రమణలతో పరివాహక ప్రాంత ప్రజలు పదే పదే నీటిముంపుకు గురవుతున్నారన్నారు.

మరో వైపు ఊటుకూరు చెరువు అలుగు ఆక్రమణలతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్థ ప్రయోజనాలతో 48 వ డివిజన్ మొత్తం పదే పదే ముంపుకు గురవుతున్నదన్నారు. అట్టర్ ఫ్లాప్ అయిన యూజీడీ వల్ల, డ్రైనేజీ కాలువలు వరద నీటికి సరిపడు సక్రమంగా లేక చాలా చోట్ల నీళ్లు రోడ్లమీద ప్రవహించడం వల్ల జనం అవస్థలతో పాటు  రోడ్లు దెబ్బతింటున్నాయన్నారు.

సింగపూర్, సుందరీకరణ పేర్లు వల్లే వేసిన కడప మేయర్ లు, ప్రభుత్వ, పాలక యంత్రాంగం ముంపు సమస్యలను ఏళ్ళతరబడి పరిష్కరించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న కాలనీలలో సైతం సహాయక చర్యలు మొక్కుబడిగా సాగాయన్నారు. కడప కార్పొరేషన్, రెవెన్యూ ,ఇరిగేషన్ శాఖల సమన్వయంతో నగర పాలక వర్గం కదిలి నగరానికి మరో ముప్పు రాకుండా, మరో ‘మూసీ’ ని తలపిoచకుండా యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టాలని కోరారు.

నిరసన చేపట్టిన సమయంలో కార్పొరేషన్ కార్యాలయం కి వస్తున్న కమిషనర్ వాహనాన్ని ఆపి కమిషనర్ లవన్నకు వినతిపత్రం ఇచ్చారు. వర్షం వచ్చిన ప్రతిసారి పదే పదే జనం అవస్థలు పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు సావంత్ సుధాకర్,టక్కోలి మనోహర్ రెడ్డి నగర కార్యవర్గ సభ్యులు కె. మునయ్య, వి.భాగ్యలక్ష్మి,గౌస్,శంకర్ నాయక్, నారాయణ, సుబ్బరాయుడు, ఓబులయ్య, రాజు, చంద్రశేఖర్ రెడ్డి,ముంపు బాధిత ప్రజలు జయరామయ్య, కృష్ణ, లక్ష్మీనారాయణ,సరోజ,లక్ష్మి, దస్తగిరి, మోహన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదలకు నిత్యావసరాలు అందించిన ఏ.ఆర్ సిబ్బంది

Satyam NEWS

బెస్ట్ సోషల్ సర్వీసర్ గా డా.కె.అనితారెడ్డి ఎంపిక

Satyam NEWS

కనుమ రోజు సంప్రదాయబద్దంగా గోమాత పూజ

Satyam NEWS

Leave a Comment