27.7 C
Hyderabad
May 4, 2024 10: 45 AM
Slider సంపాదకీయం

రాజకీయ దాహం ఇంకా తీరలేదా? ఏమిటీ వలసలు?

#Telangana CM KCR 1

పార్టీ ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ టీఆర్ఎస్ కు సరైన నాయకత్వం లేదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నే నిజమనిపిస్తున్నది.

కొత్తలో తెలుగుదేశం పార్టీ నుంచి భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వచ్చాయి. పార్టీ ప్రారంభంలో కాబట్టి అందులో ఎవరూ తప్పు పట్టాల్సింది ఏమీ లేదు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు నాయకులు వచ్చి టీఆర్ఎస్ లో కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలలో బలపడటానికి ఇది తప్ప షార్ట్ కట్ మరొకటి లేదని సర్దుకోవచ్చు.

రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఎన్నికల్లోనే తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను శాసన సభ్యత్వాలకు రాజీనామాలు చేయించకుండా పార్టీలో కలిపేసుకుని వారికి మంత్రి పదవులు ఇచ్చేశారు.

ఎంతో మంది అరిచి గగ్గోలు పెట్టినా ఈ ప్రక్రియను నిరాటంకంగా కొనసాగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండో ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ ఢంకా భజాయించి గెలిచింది. అయినా ఫిరాయింపులు ప్రోత్సహించారు.

ఇంత జరిగినా ఇంకా ఇంకా ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ జరుగుతున్న పార్టీ మార్పిడులు చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీలో ద్వితీయశ్రేణి నాయకత్వం ఏ మాత్రం పటిష్టంగా లేదని పార్టీ అగ్రనాయకత్వమే అంగీకరించినట్లుగా భావించాల్సి వస్తున్నది.

ఉన్న నాయకులను కాదని కొత్త నాయకులను తెచ్చుకోవడం వల్ల ఒరిగేది ఏమిటో అర్ధం కాదు. టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో మమేకమై ఉన్న వారిని నాయకులుగా చేసుకుంటూ పోతే పార్టీ పది కాలాల పాటు మనుగడ సాగిస్తుంది. ఇలా ఆయారాం గయారామ్ ల వల్ల పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడే అవకాశం లేదు.

ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఈగెల్లా ముసురుతున్న నాయకులు రేపు పార్టీకి ఏదైనా కష్టకాలం వస్తే ఈ నాయకులు భుజం సాయం చేస్తారా? ఇప్పటికే అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా కొత్త నాయకులకు పాత నాయకులకు మధ్య భయంకరమైన విభేదాలు కనిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు తరచూ రచ్చకెక్కుతున్నాయి.

దాదాపుగా అన్ని నియోజకవర్గాలలోనూ పార్టీలో విభేదాలు కనిపిస్తున్న తరుణంలో ఇంకా ఇంకా కొత్త నాయకులను ఇతర పార్టీల నుంచి చేర్చుకోవడం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పెద్ద తప్పిదం.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణను పార్టీలో చేర్చుకోవడంతో జగిత్యాల జిల్లాలో ఇప్పటికే రెండు వర్గాలుగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మూడు వర్గాలుగా మారారు తప్ప పార్టీకి ప్రయోజనం లేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్ తరపున హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈటల రాజేందర్ పై ఓటమి పాలైన పాడి కౌశిక్ రెడ్డికి గాలం వేయడం కూడా ఇదే క్యాటగిరి కిందికి వస్తుంది.

గత ఎన్నికలలో ఆయనతో వ్యక్తిగతంగా విభేదించి, ఈటలతో వెళ్ల కుండా ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్న విధేయులకు ఈ పరిణామం షాక్ తగిలేలా చేసింది. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి రాగానే పాత టీఆర్ఎస్ నాయకులు కచ్చితంగా ఈటలతోనే వెళ్లిపోవడానికి ఆస్కారం ఏర్పడింది.

హుజురాబాద్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎంతో మంది ఆశావహులు తమకు అవకాశం దక్కుతుందని ఎదురు చూస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌశిక్ రెడ్డిని అరువు తెచ్చుకోవడం పార్టీకి ఎలా మేలు చేస్తుందో అర్ధం కాదు.

అరువు తెచ్చుకున్ననేతలు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి గుదిబండలుగా మారతారనడంలో సందేహం లేదు. అర్ధంతరంగా పార్టీలోకి వచ్చేవారితో పార్టీ బలపడే అవకాశమే లేదు. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వారిలో నాయకత్వ ప్రతిభను గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త తరానికి ప్రాతినిధ్యం కల్పిస్తుంటే పార్టీ బలపడుతూ ఉంటంది.

లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు, రేవంత్ రెడ్డి రాక ముందు కాంగ్రెస్ పార్టీ లాగా టీఆర్ఎస్ కూడా తయారవుతుంది. పైనుంచి వచ్చే నాయకులు పైపైనే ఉంటారు తప్ప కింది వరకూ వెళ్లి పార్టీకి బలం చేకూర్చరు.  

Related posts

మంత్రి పెద్దిరెడ్డి ప్రాణాల విలువ తెలియని రాక్షసుడు

Satyam NEWS

భారత్ చేతిలో ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు హతం

Satyam NEWS

హిందూ యువతులను అంతం చేసే “రాక్షస క్రీడా లవ్ జిహాద్”

Bhavani

Leave a Comment